Net interest margin
-
యస్ బ్యాంక్ లాభం 32% అప్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ నికర లాభం 32 శాతం ఎగిసి రూ. 966 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో ఇది రూ.732 కోట్లు. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో యస్ బ్యాంక్ ఆదాయం రూ. 4,763 కోట్ల నుంచి రూ. 5,786 కోట్లకు పెరిగింది. అటు వడ్డీ ఆదాయం రూ. 3,802 కోట్ల నుంచి రూ. 4,654 కోట్లకు చేరగా.. పెట్టుబడులపై ఆదాయం మాత్రం రూ.959 కోట్ల నుంచి రూ.903 కోట్లకు క్షీణించింది. రూ. 10 ముఖవిలువ గల 1 ఈక్విటీ షేరును రూ. 2 ముఖ విలువతో అయిదు షేర్ల కింద విభజించాలన్న ప్రతిపాదనకు డైరెక్టర్ల బోర్డు ఆమోదముద్ర వేసిందని యస్ బ్యాంక్ వెల్లడించింది. 0.97 శాతానికి స్థూల ఎన్పీఏలు .. బ్యాంకు లాభదాయకతకు కొలమానం అయిన నికర వడ్డీ మార్జిన్ (నిమ్) 3.6 శాతం నుంచి 3.7 శాతానికి పెరిగింది. వడ్డీ ఆదాయం 44 శాతం వృద్ధితో రూ. 1,809 కోట్లకు చేరింది. గతేడాది జూన్ త్రైమాసికంలో మొత్తం రుణాల్లో 0.79 శాతంగా ఉన్న స్థూల ఎన్పీఏలు (జీఎన్‌పీఏ) ఈ ఏడాది జూన్ ఆఖరు నాటికి 0.97 శాతానికి పెరిగాయి. నికర నిరర్ధక ఆస్తులు (ఎన్ఎన్పీఏ) 0.29 శాతం నుంచి 0.39 శాతానికి చేరాయి. మొండిబాకీలు మొదలైన వాటికి కేటాయింపులు రూ. 207 కోట్ల నుంచి రూ. 286 కోట్లకు పెరిగాయి. మరో త్రైమాసికంలో తాము 14వ ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నామన్న యస్ బ్యాంక్ ఎండీ రాణా కపూర్.. 2020 నాటికి నిర్దేశించుకున్న లక్ష్యాలు సాధించే దిశలోనే పురోగమిస్తున్నామన్నారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బుధవారం బీఎస్ఈలో యస్ బ్యాంక్ షేరు సమారు 6 శాతంపెరిగి రూ. 1,712.55 వద్ద ముగిసింది. -
ఆంధ్రాబ్యాంకు లాభం 32% డౌన్
మార్చి క్వార్టర్లో రూ.35 కోట్లు... పెరిగిన నిరర్ధక ఆస్తుల భారం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొండి బకాయిలు అధికమవడంతో మార్చి త్రైమాసికంలో ఆంధ్రాబ్యాంకు నికర లాభం క్రితం ఏడాదితో పోలిస్తే గణనీయంగా పడిపోయింది. ఈ కాలంలో నికర లాభం 32 శాతం తగ్గడంతో రూ.35 కోట్లు నమోదు చేసింది. క్యూ4లో మొత్తం ఆదాయం రూ.5,124 కోట్ల నుంచి రూ.5,425 కోట్లకు ఎగసింది. నికర వడ్డీ ఆదాయం 12.3 శాతం అధికమై రూ.1,685 కోట్లుగా ఉంది. నికర వడ్డీ మార్జిన్ 3.1 నుంచి 3.59 శాతానికి పెరిగింది. నిర్వహణ లాభం 22.3 శాతం అధికమై 1,434 కోట్లకు చేరింది. ఆర్థిక సంవత్సరంలో.. 2016–17లో నికర లాభం అంత క్రితం కాలంతో పోలిస్తే 68 శాతం పడిపోయి రూ.174 కోట్లకు తగ్గింది. ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయం రూ.19,199 కోట్ల నుంచి రూ.20,336 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం 3.9 శాతం పెరిగి రూ.5,532 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్ 3.18 నుంచి 3.07 శాతంగా ఉంది. నిర్వహణ లాభం 10.8 శాతం పెరిగి రూ.4,388 కోట్లుంది. గుదిబండగా ఎన్పీఏలు.. బ్యాంకు నిరర్ధక ఆస్తులు (ఎన్పీఏ) గణనీయంగా పెరిగాయి. స్థూల ఎన్పీఏలు 8.39 శాతం నుంచి 12.25 శాతానికి చేరి రూ.17,670 కోట్లకు ఎగిసాయి. నికర ఎన్పీఏలు 4.61 నుంచి 7.57 శాతంతో రూ.10,355 కోట్లకు చేరాయి. మొండి బకాయిల కోసం చేసిన కేటాయింపులు మార్చి త్రైమాసికంలో 24.7 శాతం పెరిగి రూ.1,399 కోట్లకు చేరుకున్నాయి. ఆర్థిక సంవత్సరంలో ఇవి 23.2 శాతం ఎగసి రూ.4,214 కోట్లుగా ఉన్నాయి. కాగా, మొత్తం వ్యాపారం 9.3 శాతం పెరిగి రూ.3,39,673 కోట్లను తాకింది. మొత్తం డిపాజిట్లు 12.1 శాతం అధికమై రూ.1,95,441 కోట్లకు చేరుకున్నాయి. -
యాక్సిస్ బ్యాంక్
ముంబై: ప్రైవేట్ రంగంలో దేశీయంగా మూడో అతి పెద్ద బ్యాంక్ యాక్సిస్.. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ. 1,842 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది అంత క్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4తో పోలిస్తే 18 శాతం అధికం. అప్పట్లో దాదాపు రూ. 9,055 కోట్ల ఆదాయంపై రూ. 1,555 కోట్ల లాభం ఆర్జించింది. తాజా క్యూ4లో ఆదాయం రూ. 10,179 కోట్లకు పెరిగింది. శుక్రవారం ప్రకటించిన ఆర్థిక ఫలితాల ప్రకారం.. నికర వడ్డీ ఆదాయం 19 శాతం పెరిగి రూ. 2,665 కోట్ల నుంచి రూ. 3,166 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్(నిమ్) సైతం 3.70 శాతం నుంచి 3.89%కి పెరిగింది. 2013-14 ఆర్థిక సంవత్సరానికి గాను 200% మేర(రూ.20) డివిడెండ్ ఇవ్వాలని యాక్సిస్ బ్యాంక్ బోర్డు నిర్ణయించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం 180 శాతం (రూ. 18) డివిడెండ్ ఇచ్చింది. మరోవైపు, బ్యాంక్ బోర్డు.. షేర్ల విభజన ప్రతిపాదనను ఆమోదించింది. దీని ప్రకారం రూ. 10 ముఖ విలువ గల ఒక్కో షేరును రూ. 2 ముఖ విలువ గల 5 షేర్ల కింద విభజిస్తారు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను .. యాక్సిస్ బ్యాంక్ నికర లాభం 20 శాతం ఎగిసింది. రూ. 5,179 కోట్ల నుంచి సుమారు రూ. 6,218 కోట్లకు పెరిగింది. తొలిసారిగా బిలియన్ డాలర్ల మేర నికర లాభాన్ని ఆర్జించినట్లు బ్యాంక్ పేర్కొంది. మొత్తం ఆదాయం రూ. 33,734 కోట్ల నుంచి రూ. 38,046 కోట్లకు పెరిగింది. బాసెల్ త్రీ నిబంధనల ప్రకారం మార్చి ఆఖరు నాటికి మూలధన నిష్పత్తి (సీఏఆర్) 16.07 శాతంగా ఉన్నట్లు బ్యాంక్ వివరించింది. నికర వడ్డీ ఆదాయం, ఫీజుల కారణంగా లాభాలు గణనీయంగా పెరిగాయని యాక్సిస్ ఈడీ సోమ్‌నాథ్ సేన్‌గుప్తా వివరించారు. రియల్టీ, కార్లు.. వాణిజ్య వాహన రుణాల విభాగాల్లో పనితీరు కొంత మందకొడిగా ఉందని, అయితే సెంటిమెంట్ కొంతైనా మెరుగుపడితే పరిస్థితుల్లో మార్పు రాగలదని తెలిపారు. 1.22 శాతానికి స్థూల ఎన్పీఏలు.. బ్యాంక్ ఇచ్చిన రుణాల్లో స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) 1.22%కి పెరిగాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇవి 1.06 శాతంగా ఉన్నాయి. అటు నికర ఎన్పీఏలు సైతం 0.32% నుంచి 0.40%కి పెరిగాయి. యాక్సిస్ బ్యాంక్ షేర్ల ధర బీఎస్ఈలో సుమారు 1.10 శాతం పెరిగి రూ. 1,534.45 వద్ద ముగిసింది.