ఆంధ్రాబ్యాంకు లాభం 32% డౌన్
మార్చి క్వార్టర్‌లో రూ.35 కోట్లు...
పెరిగిన నిరర్ధక ఆస్తుల భారం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొండి బకాయిలు అధికమవడంతో మార్చి త్రైమాసికంలో ఆంధ్రాబ్యాంకు నికర లాభం క్రితం ఏడాదితో పోలిస్తే గణనీయంగా పడిపోయింది. ఈ కాలంలో నికర లాభం 32 శాతం తగ్గడంతో రూ.35 కోట్లు నమోదు చేసింది. క్యూ4లో మొత్తం ఆదాయం రూ.5,124 కోట్ల నుంచి రూ.5,425 కోట్లకు ఎగసింది. నికర వడ్డీ ఆదాయం 12.3 శాతం అధికమై రూ.1,685 కోట్లుగా ఉంది. నికర వడ్డీ మార్జిన్ 3.1 నుంచి 3.59 శాతానికి పెరిగింది. నిర్వహణ లాభం 22.3 శాతం అధికమై 1,434 కోట్లకు చేరింది.
ఆర్థిక సంవత్సరంలో..
2016–17లో నికర లాభం అంత క్రితం కాలంతో పోలిస్తే 68 శాతం పడిపోయి రూ.174 కోట్లకు తగ్గింది. ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయం రూ.19,199 కోట్ల నుంచి రూ.20,336 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం 3.9 శాతం పెరిగి రూ.5,532 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్ 3.18 నుంచి 3.07 శాతంగా ఉంది. నిర్వహణ లాభం 10.8 శాతం పెరిగి రూ.4,388 కోట్లుంది.
గుదిబండగా ఎన్‌పీఏలు..
బ్యాంకు నిరర్ధక ఆస్తులు (ఎన్‌పీఏ) గణనీయంగా పెరిగాయి. స్థూల ఎన్‌పీఏలు 8.39 శాతం నుంచి 12.25 శాతానికి చేరి రూ.17,670 కోట్లకు ఎగిసాయి. నికర ఎన్‌పీఏలు 4.61 నుంచి 7.57 శాతంతో రూ.10,355 కోట్లకు చేరాయి. మొండి బకాయిల కోసం చేసిన కేటాయింపులు మార్చి త్రైమాసికంలో 24.7 శాతం పెరిగి రూ.1,399 కోట్లకు చేరుకున్నాయి. ఆర్థిక సంవత్సరంలో ఇవి 23.2 శాతం ఎగసి రూ.4,214 కోట్లుగా ఉన్నాయి. కాగా, మొత్తం వ్యాపారం 9.3 శాతం పెరిగి రూ.3,39,673 కోట్లను తాకింది. మొత్తం డిపాజిట్లు 12.1 శాతం అధికమై రూ.1,95,441 కోట్లకు చేరుకున్నాయి.