న్యూఢిల్లీ: ప్రభుత్వ యాజమాన్యంలోని ఎంటీఎన్‌ఎల్ రుణ ఖాతాలను సబ్–స్టాండర్డ్ నాన్–పెర్ఫార్మింగ్ అసెట్స్‌గా (ఎన్‌పీఏ) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ప్రకటించింది. సెప్టెంబర్ 28వ తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుందని ఎస్‌బీఐ తెలిపింది. సంస్థ జూన్ 30 నుండి వాయిదాలు, వడ్డీని చెల్లించనందున ఎస్‌బీఐ ఈ చర్య తీసుకున్నట్లు అప్పుల ఊబిలో ఉన్న టెలికం సంస్థ ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.
ఎంటీఎన్‌ఎల్ రుణ ఖాతాలో మొత్తం బకాయిలు సెపె్టంబర్ 30 నాటికి రూ. 325.52 కోట్లని ఎస్‌బీఐ అక్టోబర్ 1న పంపిన లేఖను ఎంటీఎన్‌ఎల్ స్టాక్ ఎక్సే్ఛంజీలకు అందజేసింది. రుణ బకాయిల చెల్లింపుల వైఫల్యం 12 నెలలకన్నా తక్కువ ఉంటే, ఈ పరిస్థితిని సబ్–స్టాండర్డ్ నాన్–పెర్ఫార్మింగ్ అసెట్స్‌గా బ్యాంకుల ప్రకటిస్తాయి. రుణ బకాయిల చెల్లింపుల సామర్థ్యాన్ని ఈ స్థాయి సూచిస్తుంది.
చట్టపరమైన చర్యలకూ సిద్ధం..
రుణ బకాయిలు చెల్లించడంలో విఫలమైతే చట్టపరమైన చర్యలకు సిద్ధమని కూడా ఎస్‌బీఐ సూచించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్‌సహా బకాయిలను చెల్లించనందుకు అనేక బ్యాంకులు ఎంటీఎన్‌ఎల్‌పై చర్యలు తీసుకున్నాయి. బకాయిలు చెల్లించనందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంటీఎన్‌ఎల్ అన్ని ఖాతాలను స్తంభింపజేసింది.
నష్టాల్లో ఉన్న టెలికం సంస్థ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుండి మొత్తం రూ. 7,873.52 కోట్ల రుణాలను కలిగి ఉంది. కంపెనీ మొత్తం రుణ భారం రూ. 31,945 కోట్లుగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సావరిన్ గ్యారెంటీ బాండ్ల నుండి వచ్చే వడ్డీ చెల్లింపు కోసం ఎంటీఎన్‌ఎల్ ప్రభుత్వం నుండి రూ. 1,151.65 కోట్లను కోరింది. ఎంటీఎన్‌ఎల్ బాండ్ల ప్రధాన మొత్తం చెల్లింపు కోసం 3,669 కోట్ల రూపాయలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) కేటాయించింది.
Comments
Please login to add a commentAdd a comment