‘యువాన్’ ప్రభావానికి త్వరలో చికిత్స: ఆర్థిక శాఖ
న్యూఢిల్లీ: చైనా కరెన్సీ ‘యువాన్’ విలువ తగ్గింపు(డీవేల్యూ) ప్రభావాన్ని ఎదుర్కోవడంపై ప్రభుత్వం దృష్టిపెడుతోందని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి చెప్పారు. త్వరలోనే తగిన విధానపరమైన చర్యలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన విషయాన్ని వెల్లడించారు. కాగా, ఆర్థిక వ్యవస్థ మందగమనం, ఎగుమతుల క్షీణతకు అడ్డుకట్టవేయడం కోసం చైనా కేంద్ర బ్యాంక్.. డాలరుతో యువాన్ మారకం విలువను ఇటీవల 4 శాతం వరకూ తగ్గించిన సంగతి తెలిసిందే. దీంతో భారత్‌లోకి వచ్చే పెట్టుబడులతో పాటు ఎగుమతులపై కూడా ప్రతికూల ప్రభావం ఉంటుందన్న ఆందోళనలు నెల కొన్నాయి.
కాగా, ద్రవ్యోల్బణం భారీగా దిగొచ్చిన నేపథ్యంలో తయారీ రంగం, ఎగుమతులకు చేయూతనిచ్చేందుకు వీలుగా ఆర్‌బీఐ వడ్డీరేట్లను మరింతగా తగ్గించాల్సిన అవసరం ఉందని మహర్షి అభిప్రాయపడ్డారు. తాజాగా జూలై నెలలోనూ(వరుసగా 8వ నెల) దేశ ఎగుమతులు క్షీణించిన విషయం విదితమే. యువాన్ డీవేల్యూ నేపథ్యంలో రూపాయి కూడా తీవ్ర కుదుపులకు గురవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రెండేళ్ల కనిష్టానికి(65) పడిపోయింది. అయితే, దేశీ కరెన్సీ విలువ క్షీణతకు సంబంధించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మహర్షి వ్యాఖ్యానించారు. ఆర్థిక వ్యవస్థ మెరుగైన పనితీరు, పారిశ్రామికోత్పత్తి పుంజు కుంటున్న నేపథ్యంలో రూపాయి స్థిరీకరణకు అవకాశాలున్నాయని కూడా ఆయన పేర్కొన్నారు.