Finance Secretary Rajiv Maharshi
-
‘యువాన్’ ప్రభావానికి త్వరలో చికిత్స: ఆర్థిక శాఖ
న్యూఢిల్లీ: చైనా కరెన్సీ ‘యువాన్’ విలువ తగ్గింపు(డీవేల్యూ) ప్రభావాన్ని ఎదుర్కోవడంపై ప్రభుత్వం దృష్టిపెడుతోందని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి చెప్పారు. త్వరలోనే తగిన విధానపరమైన చర్యలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన విషయాన్ని వెల్లడించారు. కాగా, ఆర్థిక వ్యవస్థ మందగమనం, ఎగుమతుల క్షీణతకు అడ్డుకట్టవేయడం కోసం చైనా కేంద్ర బ్యాంక్.. డాలరుతో యువాన్ మారకం విలువను ఇటీవల 4 శాతం వరకూ తగ్గించిన సంగతి తెలిసిందే. దీంతో భారత్‌లోకి వచ్చే పెట్టుబడులతో పాటు ఎగుమతులపై కూడా ప్రతికూల ప్రభావం ఉంటుందన్న ఆందోళనలు నెల కొన్నాయి. కాగా, ద్రవ్యోల్బణం భారీగా దిగొచ్చిన నేపథ్యంలో తయారీ రంగం, ఎగుమతులకు చేయూతనిచ్చేందుకు వీలుగా ఆర్బీఐ వడ్డీరేట్లను మరింతగా తగ్గించాల్సిన అవసరం ఉందని మహర్షి అభిప్రాయపడ్డారు. తాజాగా జూలై నెలలోనూ(వరుసగా 8వ నెల) దేశ ఎగుమతులు క్షీణించిన విషయం విదితమే. యువాన్ డీవేల్యూ నేపథ్యంలో రూపాయి కూడా తీవ్ర కుదుపులకు గురవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రెండేళ్ల కనిష్టానికి(65) పడిపోయింది. అయితే, దేశీ కరెన్సీ విలువ క్షీణతకు సంబంధించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మహర్షి వ్యాఖ్యానించారు. ఆర్థిక వ్యవస్థ మెరుగైన పనితీరు, పారిశ్రామికోత్పత్తి పుంజు కుంటున్న నేపథ్యంలో రూపాయి స్థిరీకరణకు అవకాశాలున్నాయని కూడా ఆయన పేర్కొన్నారు. -
ఆర్బీఐతో ఆర్థికశాఖ సంప్రదింపులు..
గ్రీస్ సంక్షోభం నేపథ్యంలో పెట్టుబడులు దేశం నుంచి బయటకువెళ్లే పరిస్థితులు ఉన్నాయన్న ఆందోళనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఆర్థిక మంత్రిత్వశాఖ నిరంతరంగా ఈ సమస్యపై చర్చిస్తోంది. ఫైనాన్స్ సెక్రటరీ రాజీవ్ మహర్షి సోమవారం ఈ విషయం చెప్పారు. ప్రభుత్వం సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు అన్నీ తీసుకుంటోందని ఆయన పేర్కొన్నారు. ఆర్బీఐ కూడా భారత్ ఈ ప్రభావానికి గురికాకుండా చేయాల్సిందంతా చేస్తుందని అన్నారు. అయితే గ్రీస్ సంక్షోభం ప్రత్యక్షంగా భారత్‌పై ఎటువంటి ప్రభావం చూపబోదని ఆయన అంటూ... క్యాపిటల్ ఇన్‌ఫ్లోస్-అవుట్ఫ్లోస్కు సంబంధించి యూరోప్ ద్వారా దేశంపై ప్రభావం పడే అవకాశం ఉందని వివరించారు. ముఖ్యంగా యూరో బాండ్లు పతనమైతే (ఈల్డ్స్ పెరగడం) ఈ ప్రభావం భారత్ క్యాపిటల్ ఇన్‌ఫ్లోస్-అవుట్ఫ్లోస్పై ఉంటుందని అన్నారు. పరిస్థితి ఎటువైపు దారితీస్తుందో ఎవ్వరూ చెప్పలేరని సైతం అన్నారు. భారత్ కంపెనీ దేనికైనా గ్రీస్‌తో వ్యాపార సంబంధాలు ఏవైనా ఉన్నాయా..? అని అడిగిన ప్రశ్నకు ‘నాకు తెలియదు’ అని అన్నారు. అయితే ఈ విపరిణామాలు యూరోపియన్ యూనియన్‌పై పడితే, అది భారత్‌కూ మైనస్ అవుతుందని వాణిజ్య కార్యదర్శి రాజీవ్ ఖేర్ అన్నారు. భారత్ దాదాపు 320 బిలియన్ డాలర్ల ఎగుమతుల్లో (2014-15) దాదాపు 130 బిలియన్ డాలర్ల వాటా ఈయూదే కావడం గమనార్హం. ఆందోళన అక్కర్లేదు-ఈసీఏ: కాగా ఈ విషయంపై చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ (ఈసీఏ) అరవింద్ సుబ్రమణ్యం మాట్లాడుతూ.. గ్రీక్ సంక్షోభంపై ఇతర దేశాల స్పందన ఎలా ఉంటుందో. భారత్ స్పందనా అదే రీతిలో ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఈ పరిణామాలపై ఆందోళన అక్కర్లేదని చెప్పారు. -
ఏడాది చివరికల్లా రేటింగ్ అప్‌గ్రేడ్?
ఆర్థిక శాఖ అంచనా న్యూఢిల్లీ: విధానపరమైన చర్యలు, ద్రవ్యోల్బణం.. ఆర్థిక స్థితిగతులు మెరుగుపడుతుండటం తదితర అంశాల నేపథ్యంలో ఏడాది ఆఖరు నాటికి భారత రేటింగ్ అప్‌గ్రేడ్ కావొచ్చని భావిస్తున్నట్లు ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి తెలిపారు. విధానపరమైన చర్యల ప్రభావం ఏడాది ఆఖరు నాటికి కనిపించడం మొదలు కాగలదన్నారు. అలాగే, ముడి చమురు ధరల తగ్గుదల 2015-16లోనూ కొనసాగవచ్చని, ఫలితంగా మిగతా అన్నింటి ధరలూ తగ్గవచ్చని మహర్షి తెలిపారు. గడిచిన ఏడాది కాలంగా తీసుకుంటున్న చర్యల కారణంగా కరెంటు అకౌంటు లోటు, ద్రవ్య లోటు కొంత మెరుగైన స్థాయికి వచ్చాయని, ఇన్వెస్టర్లలో విశ్వాసం పెంపొందించడంతో విదేశీ పెట్టుబడుల రాక కూడా పెరిగిందని ఆయన చెప్పారు. గత నెల 9న భారత క్రెడిట్ రేటింగ్ అవుట్‌లుక్‌ను ‘సానుకూల’ స్థాయికి అప్‌గ్రేడ్ చేసిన రేటింగ్ ఏజెన్సీ మూడీస్.. వచ్చే 12-18 నెలల్లో సార్వభౌమ రేటింగ్‌ను కూడా పెంచవచ్చని పేర్కొన్న నేపథ్యంలో మహర్షి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.