ఏడాది చివరికల్లా రేటింగ్ అప్‌గ్రేడ్?
ఆర్థిక శాఖ అంచనా
న్యూఢిల్లీ: విధానపరమైన చర్యలు, ద్రవ్యోల్బణం.. ఆర్థిక స్థితిగతులు మెరుగుపడుతుండటం తదితర అంశాల నేపథ్యంలో ఏడాది ఆఖరు నాటికి భారత రేటింగ్ అప్‌గ్రేడ్ కావొచ్చని భావిస్తున్నట్లు ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి తెలిపారు. విధానపరమైన చర్యల ప్రభావం ఏడాది ఆఖరు నాటికి కనిపించడం మొదలు కాగలదన్నారు. అలాగే, ముడి చమురు ధరల తగ్గుదల 2015-16లోనూ కొనసాగవచ్చని, ఫలితంగా మిగతా అన్నింటి ధరలూ తగ్గవచ్చని మహర్షి తెలిపారు.
గడిచిన ఏడాది కాలంగా తీసుకుంటున్న చర్యల కారణంగా కరెంటు అకౌంటు లోటు, ద్రవ్య లోటు కొంత మెరుగైన స్థాయికి వచ్చాయని, ఇన్వెస్టర్లలో విశ్వాసం పెంపొందించడంతో విదేశీ పెట్టుబడుల రాక కూడా పెరిగిందని ఆయన చెప్పారు. గత నెల 9న భారత క్రెడిట్ రేటింగ్ అవుట్‌లుక్‌ను ‘సానుకూల’ స్థాయికి అప్‌గ్రేడ్ చేసిన రేటింగ్ ఏజెన్సీ మూడీస్.. వచ్చే 12-18 నెలల్లో సార్వభౌమ రేటింగ్‌ను కూడా పెంచవచ్చని పేర్కొన్న నేపథ్యంలో మహర్షి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.