జీరోదాలో ఎంఎఫ్ డైరెక్ట్ ప్లాన్లు
♦ కమీషన్ లేకుండా కొనుగోలు
♦ నెలకు రూ.50 చెల్లిస్తే చాలు
కోల్‌కతా: డిస్కౌంట్ బ్రోకరేజీ సంస్థ జీరోదా... కమీషన్లు లేకుండా మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్) డైరెక్ట్ ప్లాన్లను అందించేందుకు ‘కాయిన్’ పేరిట కొత్త సేవల్ని అందుబాటులోకి తెచ్చింది. డైరెక్ట్ ప్లాన్లను అందిస్తున్న తొలి బ్రోకరేజీ సంస్థ తమదేనని జీరోదా వ్యవస్థాపకుడు, సీఈవో నితిన్ కామత్ తెలిపారు. సాధారణంగా మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి రెగ్యులర్, డైరెక్ట్ ప్లాన్లు ఉంటాయి. మధ్య వర్తులు, బ్రోకరేజీ సంస్థలు, ఏజెంట్లు, డిస్ట్రిబ్యూటర్ల ద్వారా తీసుకునేవి రెగ్యులర్ పథకాలు. వీటిలో కొంత కమిషన్ ఆయా మధ్యవర్తులకు వెళుతుంటుంది. డైరెక్ట్ ప్లాన్లలో ఇలా కమిషన్ల చెల్లింపు ఉండదు.
ఈ సదుపాయం గురించి నితిన్ కామత్ వివరిస్తూ... నెలకు రూ.5,000 చొప్పున సిప్ విధానంలో 25 ఏళ్ల పాటు డైరెక్ట్ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేస్తే కమిషన్ల రూపంలో రూ.28 లక్షలు మిగులుతాయని తెలిపారు. డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ డీమ్యాట్‌లో ఉంటే ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్ పోర్ట్‌ఫోలియో అంతా ఒకే చోట చూసుకోవచ్చన్నారు. కాయిన్ ప్లాట్ ఫామ్‌పై డైరెక్ట్ పథకాల కొనుగోలుకు నెలవారీ రూ.50 ఫిక్స్‌డ్ సబ్‌స్క్రిప్షన్ ఫీజు ఉంటుంది. ఎన్ని పథకాలైనా, ఎంత విలువ మేర కొనుగోలు చేసిన ఇదే వర్తిస్తుంది. అది కూడా రూ.25,000 పెట్టుబడి దాటిన తర్వాత నుంచే ఈ చార్జీని నెలవారీగా వసూలు చేయనున్నట్టు జీరోదా తెలిపింది.