చిన్న నగరాల్లో జోరుగా ‘సిప్’
మెట్రో కంటే మెట్రోయేతర నగరాల్లోనే అధికంగా ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్
క్రిసిల్ తాజా నివేదిక వెల్లడి
ముంబై: మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్) ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సంబంధించి సిప్(సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్)లు చిన్న(మెట్రోయేతర) నగరాల్లోనే జోరుగా ఉన్నాయని రేటింగ్ సంస్థ క్రిసిల్ వెల్లడించింది. రిటైల్ ఇన్వెస్టర్లు సిప్‌ల ద్వారా జోరుగా పెట్టుబడులు పెడుతుండడం పెన్షన్ సొమ్ములను పలువురు మ్యూచువల్ ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్ చేయడం, సంపద సృష్టికి మ్యూచువల్ ఫండ్ చక్కటి మార్గమన్న భావన ఇన్వెస్టర్లలో పెరుగుతోందని క్రిసిల్ ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అషు సుయాష్ పేర్కొన్నారు. దీంతో భవిష్యత్తులో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ జోరుగా వృద్ధి సాధించగలదని ఆమె పేర్కొన్నారు. టైర్ టూ, టైర్ త్రి నగరాల్లో రిటైర్మెంట్ ఆధారిత ఫండ్స్ మంచి వృద్ధిని సాధించగలవని ఆమె అంచనా వేస్తున్నారు. ఆర్థిక సంక్షోభం కారణంగా తగ్గిన రిటైల్ ఇన్వెస్టర్ల ఫోలియోలు గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో బాగా పెరిగాయని ఈ క్రిసిల్ తాజా నివేదిక పేర్కొంది. కొన్ని ముఖ్యాంశాలు...
æచిన్న నగరాల నుంచి ఫండ్స్‌లో సిప్‌ల ద్వారా ఇన్వెస్ట్ చేసే రిటైల్ ఇన్వెస్ట్‌మెంట్స్ బాగా పెరిగాయి. ఎంఎఫ్ పరిశ్రమ ఆస్తులు రూ.20 లక్షల కోట్ల స్థాయికి చేరడానికి ఈ చిన్న నగరాల్లో సిప్‌ల జోరు పెరగడం కూడా ఒక కారణం.
గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో మెట్రో నగరాల్లో సిప్ ఇన్వెస్ట్‌మెంట్స్ 27% చొప్పున చక్రగతిన వృద్ధి చెందాయి. అదే చిన్న నగరాల్లో సిప్ ఇన్వెస్ట్‌మెంట్స్ 30% చక్రగతిన వృద్ధి చెందాయి.
వ్యక్తిగత ఇన్వెస్టర్ల(రిటైల్, హైనెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్–హెచ్‌ఎన్‌ఐ) ఇన్వెస్ట్‌మెంట్స్ విలువ చిన్న నగరాల్లో 35 శాతం వృద్ధి చెందగా, మెట్రో నగరాల్లో మాత్రం 28 శాతమే వృద్ధి చెందింది.
గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో రిటైల్ ఇన్వెస్టర్ల ఫోలియోల సంఖ్య బాగా పెరిగింది. ప్రస్తుతం వీటి సంఖ్య 5.23 కోట్లుగా ఉంది.