నిర్భయ నిధుల పరిస్థితేంటి? | National Human Rights Commission Notice To Centre, State governaments | Sakshi
Sakshi News home page

నిర్భయ నిధుల పరిస్థితేంటి?

Dec 3 2019 4:08 AM | Updated on Dec 3 2019 4:08 AM

National Human Rights Commission Notice To Centre, State governaments - Sakshi

న్యూఢిల్లీ: మహిళలపై లైంగిక వేధింపుల ఘటనలపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఆందోళన వ్యక్తం చేసింది. లైంగిక వేధింపుల కేసుల విషయంలో ఏ విధంగా స్పందిస్తున్నారు? నిర్భయ నిధుల వినియోగం ఎలా ఉంది? అనే వివరాలు కోరుతూ కేంద్ర ప్రభుత్వం, అన్ని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల(యూటీ) ప్రభుత్వాలకు సోమవారం నోటీసులు జారీ చేసింది. మహిళలపై లైంగిక వేధింపుల ఘటనలు పెరుగుతుండటంపై మీడియాలో వచ్చిన కథనాలను సుమోటోగా తీసుకున్న ఎన్‌హెచ్‌ఆర్‌సీ.. గత మూడేళ్లలో నిర్భయ నిధులను వినియోగించిన తీరును, ప్రస్తుతం ఆ నిధులు ఏ మేరకు ఉన్నాయనే విషయాన్ని తెలుపుతూ ఆరు వారాల్లోగా తమకు నివేదిక అందించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్‌ సెక్రటరీలకు నోటీసులు జారీ చేసింది.

తమ పిల్లలో, ఇంట్లోని మహిళలో కనిపించడం లేదని, వారి ఆచూకీ తెలుసుకోవాలని ఎవరైనా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్తే.. ఎవరితోనైనా వెళ్లిపోయిందేమోనన్న నిర్లక్ష్యపూరిత జవాబే ఎక్కువగా పోలీసుల నుంచి వస్తోందని ఎన్‌హెచ్‌ఆర్‌సీ వ్యాఖ్యానించింది. ఇలాంటి ఆలోచన తీరును మార్చుకోవాలని సూచించింది. ‘హైదరాబాద్‌లో వెటర్నరీ డాక్టర్‌ను నలుగురు రేప్‌చేసి, చంపేసి, మృతదేహాన్ని కాల్చేశారు. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదేమో’ అని ఎన్‌హెచ్‌ఆర్‌సీ అభిప్రాయపడింది. నిర్భయ నిధి సహా మహిళల రక్షణ కోసం కేంద్రం తీసుకున్న నిర్ణయాలు, నిబంధనలను.. రాష్ట్రాలు, యూటీల్లో వాటి అమలును సమగ్ర నివేదిక రూపంలో తమకు అందించాలని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిని ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశించింది.
కేంద్రం, రాష్ట్రాలు, యూటీలకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement