MF
-
చివరి దశకు ఐడీబీఐ ఎంఎఫ్ విలీనం
ముంబై: ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్(ఎంఎఫ్), ఐడీబీఐ ఎంఎఫ్ విలీనం చివరి దశకు చేరుకుంది. విలీన ప్రాసెస్ జరుగుతున్నట్లు ఎల్ఐసీ ఎంఎఫ్ ఎండీ, సీఈవో టీఎస్ రామకృష్ణన్ పేర్కొన్నారు. కీలకమైన చివరి దశకు చేరుకున్నట్లు వెల్లడించారు. విలీనానికి కట్టుబడి ఉన్నట్లు తెలియజేశారు. ఐడీబీఐ ఎంఎఫ్ మాతృ సంస్థ ఐడీబీఐ బ్యాంకులో పీఎస్‌యూ దిగ్గజం ఎల్ఐసీ మెజారిటీ వాటా కలిగి ఉన్న సంగతి తెలిసిందే. రెండు ఎంఎఫ్‌లలో ఒకే ప్రమోటర్‌కు 10 శాతానికి మించి వాటాకు నిబంధనలు అంగీకరించవంటూ ఇటీవల వెలువడుతున్న వార్తల నేపథ్యంలో విలీనానికి ప్రాధాన్యత ఏర్పడింది. రూ. 18,000 కోట్ల విలువైన నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) కలిగి ఉన్న ఎల్ఐసీ ఎంఎఫ్ విలీనానికి అత్యంత ప్రాధా న్యతను ఇస్తున్నట్లు రామకృష్ణన్ వెల్లడించారు. -
ఫండ్స్‌లో పోటీ పెరగాలి
ముంబై: మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలో మరింత పోటీ అవసరమని సెబీ చైర్మన్ అజయ్ త్యాగి చెప్పారు. ఫండ్స్ టోటల్ ఎక్స్పెన్స్ రేషియోలో (టీఈఆర్/ మొత్తం వ్యయ నిష్పత్తి) మరింత హేతుబద్ధీకరణ అవసరమని, తాము దీనిపైనే దృష్టి పెట్టామని చెప్పారు. యాంఫి వార్షిక సదస్సు సందర్భంగా విలేకరులతో అజయ్‌త్యాగి మాట్లాడుతూ... అగ్ర స్థాయి ఏడు ఫండ్స్ సంస్థలు 60–70 శాతం మార్కెట్ వాటాను కైవసం చేసుకున్న విషయాన్ని ప్రస్తావించారు. మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ మొత్తం లాభంలో 60 శాతం ఈ ఏడు సంస్థల చేతుల్లోనే ఉందన్నారు. ‘‘పరిశ్రమలో మరింత పోటీ అవసరం. టీఈఆర్ హేతుబద్ధీకరణ జరగాలి. దీన్నే మేం పరిశీలిస్తున్నాం’’ అని చెప్పారాయన. టీఈఆర్ అన్నది ఓ పథకం నిర్వహణలోని నిధుల మొత్తం నుంచి మినహాయించుకునే వ్యయాల శాతం. పరిపాలన, నిర్వహణ తదితర చార్జీలన్నీ కలిపి టీఈఆర్ రూపంలో వసూలు చేస్తుంటాయి. ‘‘టీఈఆర్ విధానం 1990ల చివర్లో మొదలైంది. అప్పట్లో ఫండ్స్ నిర్వహణ ఆస్తులు రూ.50,000 కోట్లుగా ఉంటే, అవి నేడు రూ.23 లక్షల కోట్ల స్థాయికి చేరాయి. కనుక కొన్ని చర్యలు అవసరం. హేతుబద్ధీకరణను పరిశీలిస్తున్నాం’’ అని త్యాగి తెలిపారు. దేశ జీడీపీలో 11 శాతం మేరకే మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని ఆస్తులు ఉన్నాయన్న ఆయన, వృద్ధికి అపార అవకాశాలున్నాయని గుర్తు చేశారు. క్లోజ్ ఎండెడ్ పథకాలపై త్వరలో విధానం.. పొదుపు పుంజుకుందని, డీమోనిటైజేషన్ తర్వాత బ్యాంకుల్లోకి నగదు రాక పెరిగిందని అజయ్‌త్యాగి పేర్కొన్నారు. పెట్టుబడులన్నీ కేవలం కొన్ని స్టాక్స్‌లోకే వెళుతున్నాయన్న త్యాగి... పెట్టుబడులకు మంచి స్టాక్స్ ఎంపిక అనేది మ్యూచువల్ ఫండ్స్ ముందున్న సవాల్ అని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. క్లోజ్ ఎండెడ్ పథకాలపై త్వరలోనే ఓ విధానాన్ని తీసుకొస్తామని ఆయన తెలిపారు. డెట్ ఫండ్ మేనేజర్లు పెట్టుబడుల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎక్కువ శాతం నిధులు ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల నుంచి వస్తున్నాగానీ, విశ్వసనీయత కలిగిన డెట్ సాధనాల్లోనే ఆ డబ్బులను పెట్టుబడి పెట్టాల్సి ఉందని, క్రెడిట్ రిస్క్ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. డెట్ ఫండ్స్ నిర్వహణలో రూ.12.3 లక్షల కోట్ల ఆస్తులు ఉంటే, అందులో రూ.11.5 లక్షల కోట్లు నాన్ రిటైల్ ఇన్వెస్టర్లవేనని త్యాగి తెలియజేశారు. కమోడిటీ మార్కెట్లోకి మ్యూచువల్ ఫండ్స్‌ను అనుమతించే అంశంపై మాట్లాడుతూ... కమోడిటీ మార్కెట్లు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయని, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు లిక్విడిటీని అందించలేవన్నారు. కమోడిటీ మార్కెట్లో ఫిజికల్ డెలివరీ అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. -
చిన్న నగరాల్లో జోరుగా ‘సిప్’
మెట్రో కంటే మెట్రోయేతర నగరాల్లోనే అధికంగా ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ క్రిసిల్ తాజా నివేదిక వెల్లడి ముంబై: మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్) ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సంబంధించి సిప్(సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్)లు చిన్న(మెట్రోయేతర) నగరాల్లోనే జోరుగా ఉన్నాయని రేటింగ్ సంస్థ క్రిసిల్ వెల్లడించింది. రిటైల్ ఇన్వెస్టర్లు సిప్ల ద్వారా జోరుగా పెట్టుబడులు పెడుతుండడం పెన్షన్ సొమ్ములను పలువురు మ్యూచువల్ ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్ చేయడం, సంపద సృష్టికి మ్యూచువల్ ఫండ్ చక్కటి మార్గమన్న భావన ఇన్వెస్టర్లలో పెరుగుతోందని క్రిసిల్ ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అషు సుయాష్ పేర్కొన్నారు. దీంతో భవిష్యత్తులో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ జోరుగా వృద్ధి సాధించగలదని ఆమె పేర్కొన్నారు. టైర్ టూ, టైర్ త్రి నగరాల్లో రిటైర్మెంట్ ఆధారిత ఫండ్స్ మంచి వృద్ధిని సాధించగలవని ఆమె అంచనా వేస్తున్నారు. ఆర్థిక సంక్షోభం కారణంగా తగ్గిన రిటైల్ ఇన్వెస్టర్ల ఫోలియోలు గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో బాగా పెరిగాయని ఈ క్రిసిల్ తాజా నివేదిక పేర్కొంది. కొన్ని ముఖ్యాంశాలు... æచిన్న నగరాల నుంచి ఫండ్స్‌లో సిప్ల ద్వారా ఇన్వెస్ట్ చేసే రిటైల్ ఇన్వెస్ట్మెంట్స్ బాగా పెరిగాయి. ఎంఎఫ్ పరిశ్రమ ఆస్తులు రూ.20 లక్షల కోట్ల స్థాయికి చేరడానికి ఈ చిన్న నగరాల్లో సిప్ల జోరు పెరగడం కూడా ఒక కారణం. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో మెట్రో నగరాల్లో సిప్ ఇన్వెస్ట్మెంట్స్ 27% చొప్పున చక్రగతిన వృద్ధి చెందాయి. అదే చిన్న నగరాల్లో సిప్ ఇన్వెస్ట్మెంట్స్ 30% చక్రగతిన వృద్ధి చెందాయి. వ్యక్తిగత ఇన్వెస్టర్ల(రిటైల్, హైనెట్వర్త్ ఇండివిడ్యువల్స్–హెచ్ఎన్ఐ) ఇన్వెస్ట్మెంట్స్ విలువ చిన్న నగరాల్లో 35 శాతం వృద్ధి చెందగా, మెట్రో నగరాల్లో మాత్రం 28 శాతమే వృద్ధి చెందింది. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో రిటైల్ ఇన్వెస్టర్ల ఫోలియోల సంఖ్య బాగా పెరిగింది. ప్రస్తుతం వీటి సంఖ్య 5.23 కోట్లుగా ఉంది. -
జీరోదాలో ఎంఎఫ్ డైరెక్ట్ ప్లాన్లు
♦ కమీషన్ లేకుండా కొనుగోలు ♦ నెలకు రూ.50 చెల్లిస్తే చాలు కోల్‌కతా: డిస్కౌంట్ బ్రోకరేజీ సంస్థ జీరోదా... కమీషన్లు లేకుండా మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్) డైరెక్ట్ ప్లాన్లను అందించేందుకు ‘కాయిన్’ పేరిట కొత్త సేవల్ని అందుబాటులోకి తెచ్చింది. డైరెక్ట్ ప్లాన్లను అందిస్తున్న తొలి బ్రోకరేజీ సంస్థ తమదేనని జీరోదా వ్యవస్థాపకుడు, సీఈవో నితిన్ కామత్ తెలిపారు. సాధారణంగా మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి రెగ్యులర్, డైరెక్ట్ ప్లాన్లు ఉంటాయి. మధ్య వర్తులు, బ్రోకరేజీ సంస్థలు, ఏజెంట్లు, డిస్ట్రిబ్యూటర్ల ద్వారా తీసుకునేవి రెగ్యులర్ పథకాలు. వీటిలో కొంత కమిషన్ ఆయా మధ్యవర్తులకు వెళుతుంటుంది. డైరెక్ట్ ప్లాన్లలో ఇలా కమిషన్ల చెల్లింపు ఉండదు. ఈ సదుపాయం గురించి నితిన్ కామత్ వివరిస్తూ... నెలకు రూ.5,000 చొప్పున సిప్ విధానంలో 25 ఏళ్ల పాటు డైరెక్ట్ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేస్తే కమిషన్ల రూపంలో రూ.28 లక్షలు మిగులుతాయని తెలిపారు. డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ డీమ్యాట్‌లో ఉంటే ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్ పోర్ట్‌ఫోలియో అంతా ఒకే చోట చూసుకోవచ్చన్నారు. కాయిన్ ప్లాట్ ఫామ్‌పై డైరెక్ట్ పథకాల కొనుగోలుకు నెలవారీ రూ.50 ఫిక్స్డ్ సబ్స్క్రిప్షన్ ఫీజు ఉంటుంది. ఎన్ని పథకాలైనా, ఎంత విలువ మేర కొనుగోలు చేసిన ఇదే వర్తిస్తుంది. అది కూడా రూ.25,000 పెట్టుబడి దాటిన తర్వాత నుంచే ఈ చార్జీని నెలవారీగా వసూలు చేయనున్నట్టు జీరోదా తెలిపింది. -
5 కోట్లకు చేరువలో ఎంఎఫ్ ఖాతాలు
ముంబై: దేశంలో మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్) ఇన్వెస్టర్ ఖాతాలు 5 కోట్లకు చేరువలో ఉన్నాయి. జూన్ త్రైమాసికం చివరకి ఎంఎఫ్ ఖాతాల సంఖ్య కొత్తగా 12.61 లక్షలు పెరిగింది. దీంతో మొత్తం ఖాతాల సంఖ్య 4.89 కోట్లకు ఎగసింది. ఈ వివరాలను మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ సమాఖ్య యాంఫీ వెల్లడించింది. -
పీ-నోట్లకు ఫేవరెట్లు ‘ఫండ్’లే!!
– మన మార్కెట్లో 60% పీ-నోట్లు ఎంఎఫ్లవే – టాప్-10 ఎఫ్‌పీఐల ద్వారా 73 శాతం నిధులు.. – కఠిన నిబంధనలపై మార్కెట్లో ప్రకంపనలు... న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్లో పీ-నోట్ల తేనెతుట్టె మరోసారి కదిలింది. పీ-నోట్ల మార్గంలో నల్లధనం దేశంలోకి వస్తోందని, మనీ లాండరింగ్‌కు అవకాశం ఉందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన నిబంధనలను సెబీ కఠినతరం చేయడం మార్కెట్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. అయితే, భారత్‌లో పెట్టుబడులకు పీ-నోట్లను అత్యధికంగా ఉపయోగించుకుంటున్నవి మ్యూచువల్ ఫండ్(ఎంఎఫ్) సంస్థలే కావడం గమనార్హం. ఈ రూట్లో వస్తున్న మొత్తం ఇన్వెస్ట్‌మెంట్స్‌లో ఎంఎఫ్‌ల వాటా 60 శాతానికి పైగా ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మొత్తం పీ-నోట్ పెట్టుబడులు రూ.2.2 లక్షల కోట్లుగా అంచనా. వీటిలో సెబీ వద్ద నమోదైన టాప్-10 విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఏ) ద్వారా వచ్చినవే 73 శాతం ఉన్నాయని తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. ఏమిటీ పీ-నోట్లు...? సాధారణంగా భారత మార్కెట్లోకి ప్రత్యక్షంగా వచ్చే విదేశీ పెట్టుబడులకు ప్రధాన ఆధారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ). మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ వద్ద ఎఫ్‌పీఐలు కచ్చితంగా తమ వివరాలను నమోదు చేసుకోవాలి. వీరు ఇలా నేరుగా రిజిస్టర్ చేసుకోవడం వల్ల వీరి నుంచి అనుమతి పత్రాలు తీసుకుని, ఇతర విదేశీ ఇన్వెస్టర్లు ఎవరైనా వాటి ద్వారా భారత్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేందుకు వీలుంది. ఈ ఆఫ్‌షోర్ డెరివేటివ్ సాధనాలనే(ఓడీఐ) పార్టిసిపేటరీ నోట్స్ లేదా పీ- నోట్స్‌గా వ్యవహరిస్తున్నారు. సెబీ కొన్ని విభాగాలకు చెందిన ఎఫ్‌పీఐలకు మాత్రమే పీ-నోట్స్ జారీ చేసేందుకు అనుమతిస్తుంది. అయితే, ఈ విధానంలో పెట్టుబడులను కొందరు ఇన్వెస్టర్లు నల్లధనాన్ని తరలించేందుకు, మనీలాండరింగ్ వంటి కార్యకలాపాలకు దుర్వినియోగం చేస్తున్నారంటూ... నల్లధనం అంశంపై సుప్రీం కోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఆందోళనలు వ్యక్తం చేసింది. దీంతో సెబీ రంగంలోకి దిగింది. పీ-నోట్ల ద్వారా పెట్టుబడులు చేసే ఇన్వెస్టర్ల పూర్తి వివరాలను(కేవైసీ) వెల్లడించడం, పీ-నోట్ల జారీకి సబంధించి మదింపు ఇతరత్రా నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ ఇటీవలే నిర్ణయం తీసుకుంది. సెబీ గణాంకాల ప్రకారం ఈ ఏడాది మార్చి నాటికి సెబీ వద్ద రిజిస్టర్ అయిన ఎఫ్‌పీఐల సంఖ్య 4,311. అయితే, వ్యక్తిగత విదేశీ ఇన్వెస్టర్లకు పీ-నోట్లను జారీ చేయడానికి సెబీ అనుమతించడం లేదు. కాగా, ఇప్పుడు సెబీ నిబంధనల కఠినతరం కారణంగా భారత్‌లో పీ-నోట్ పెట్టుబడులకు సంబంధించి వ్యయాలు పెరిగేం దుకు దారితీస్తుందని.. ఇది ఇన్వెస్టర్లపై ప్రతికూల ప్రభావం చూపొచ్చని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఫండ్స్ జోరు... భారత్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల కోసం ఎఫ్‌పీఐల నుంచి పీ-నోట్లను సబ్స్క్రయిబ్ చేసిన సంస్థలు దాదాపు 2,500 వరకూ ఉన్నట్లు అంచనా. వీటిలో సుమారు 1,500 వరకూ (60 శాతం) మ్యూచువల్ ఫండ్స్ ఉన్నట్లు సెబీ వెల్లడించింది. ఇంకా 300 వరకూ ఇతర కంపెనీలు, 50 ట్రస్టులు, 100 బ్యాంకులు, 50 సావరీన్ వెల్త్ ఫండ్స్, 200కు పైగా హెడ్జ్ ఫండ్స్, 60 పెన్షన్ ఫండ్స్ ఉన్నాయి. ఈ జాబితాలో కొన్ని యూనివర్సిటీ ఫండ్స, ఎండోమెంట్ ఫండ్స్, స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ఉండటం గమనార్హం. సెబీ చెబుతున్న దానిప్రకారం భారత్‌లో నమోదైన వాటిలో 37 ఎఫ్‌పీఐలు మాత్రమే ప్రస్తుతం ఈ పీ-నోట్లను జారీ చేస్తున్నాయి. ఈ ఏడాది మార్చి చివరినాటికి పీ-నోట్ పెట్టుబడులు రూ.2,23,077 కోట్లుగా నమోదయ్యాయి. భారత్‌లో రిజిస్టర్ అయిన మొత్తం ఎఫ్‌పీఐల నిర్వహణలో ఉన్న అస్తుల్లో ఈ మొత్తం విలువ 10% మాత్రమే. కాగా, ప్రస్తుత పెట్టుబడుల్లో 73% టాప్-10 ఎఫ్‌పీఐలు జారీ చేసిన పీ-నోట్ల ద్వారానే వచ్చాయి. ఈ దిగ్గజ ఎఫ్‌పీఐల్లో మోర్గాన్ స్టాన్లీ ఏషియా(సింగపూర్) పీటీఈ వాటా 14%, కాప్‌థాల్ మారిషస్ ఇన్వెస్ట్మెంట్ 12%, గోల్డ్‌మన్ శాక్స్(సింగపూర్) 7%, హెచ్ఎస్బీసీ బ్యాంక్(మారిషస్) 6% ఉన్నాయి. మిగతా వాటిలో మెరిల్ లించ్ క్యాపిటల్ మార్కెట్స్(స్పెయిన్), సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ మారిషస్, స్విస్ ఫైనాన్షియల్(మారిషస్), జేపీ మోర్గాన్ చేజ్ బ్యాంక్, నేషనల్ అసోసియేషన్(యూఎస్ఏ), సిటీకార్ప్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్ల వాటా 4-6% ఉంది. కేమన్ ఐలాండ్స్ టాప్... పీ-నోట్ల ద్వారా భారత్‌లో పెట్టుబడి పెడుతున్న సంస్థలు అత్యధికంగా కేమన్ ఐలాండ్స్ కేంద్రంగానే ఉండటం గమనార్హం. ఇప్పుడున్న పెట్టుబడుల్లో 93 శాతం టాప్-10 దేశాల నుంచే వస్తున్నాయి. ఈ జాబితాలో మారిషస్, యూకే, యూఎస్‌ల్లోని సంస్థలు 11 శాతం చొప్పున వాటాలను దక్కించుకున్నాయి. ఇక ఐర్లాండ్, ఫ్రాన్స్, లగ్జెంబర్గ్, సింగపూర్, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, దక్షిణ కొరియాలకు చెందిన సంస్థల వాటా 1-6%.