పీ-నోట్లకు ఫేవరెట్లు ‘ఫండ్’లే!! | Mutual funds top on use of P-Notes; Top-10 FPIs have 73% share | Sakshi
Sakshi News home page

పీ-నోట్లకు ఫేవరెట్లు ‘ఫండ్’లే!!

Published Tue, May 24 2016 1:18 AM | Last Updated on Mon, Sep 4 2017 12:46 AM

పీ-నోట్లకు ఫేవరెట్లు ‘ఫండ్’లే!!

పీ-నోట్లకు ఫేవరెట్లు ‘ఫండ్’లే!!

మన మార్కెట్లో 60% పీ-నోట్లు ఎంఎఫ్‌లవే
టాప్-10 ఎఫ్‌పీఐల ద్వారా 73 శాతం నిధులు..
కఠిన నిబంధనలపై మార్కెట్లో ప్రకంపనలు...

 న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్లో పీ-నోట్ల తేనెతుట్టె మరోసారి కదిలింది. పీ-నోట్ల మార్గంలో నల్లధనం దేశంలోకి వస్తోందని, మనీ లాండరింగ్‌కు అవకాశం ఉందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన నిబంధనలను సెబీ కఠినతరం చేయడం మార్కెట్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. అయితే, భారత్‌లో పెట్టుబడులకు పీ-నోట్‌లను అత్యధికంగా ఉపయోగించుకుంటున్నవి మ్యూచువల్ ఫండ్(ఎంఎఫ్) సంస్థలే కావడం గమనార్హం. ఈ రూట్‌లో వస్తున్న మొత్తం ఇన్వెస్ట్‌మెంట్స్‌లో ఎంఎఫ్‌ల వాటా 60 శాతానికి పైగా ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మొత్తం పీ-నోట్ పెట్టుబడులు రూ.2.2 లక్షల కోట్లుగా అంచనా. వీటిలో సెబీ వద్ద నమోదైన టాప్-10 విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఏ) ద్వారా వచ్చినవే 73 శాతం ఉన్నాయని తాజా నివేదిక ఒకటి వెల్లడించింది.

 ఏమిటీ పీ-నోట్లు...?
సాధారణంగా భారత మార్కెట్లోకి ప్రత్యక్షంగా వచ్చే విదేశీ పెట్టుబడులకు ప్రధాన ఆధారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ). మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ వద్ద ఎఫ్‌పీఐలు కచ్చితంగా తమ వివరాలను నమోదు చేసుకోవాలి. వీరు ఇలా నేరుగా రిజిస్టర్ చేసుకోవడం వల్ల వీరి నుంచి అనుమతి పత్రాలు తీసుకుని, ఇతర విదేశీ ఇన్వెస్టర్లు ఎవరైనా వాటి ద్వారా భారత్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేందుకు వీలుంది. ఈ ఆఫ్‌షోర్ డెరివేటివ్ సాధనాలనే(ఓడీఐ) పార్టిసిపేటరీ నోట్స్ లేదా పీ- నోట్స్‌గా వ్యవహరిస్తున్నారు. సెబీ కొన్ని విభాగాలకు చెందిన ఎఫ్‌పీఐలకు మాత్రమే పీ-నోట్స్ జారీ చేసేందుకు అనుమతిస్తుంది.

అయితే, ఈ విధానంలో పెట్టుబడులను కొందరు ఇన్వెస్టర్లు నల్లధనాన్ని తరలించేందుకు, మనీలాండరింగ్ వంటి కార్యకలాపాలకు దుర్వినియోగం చేస్తున్నారంటూ... నల్లధనం అంశంపై సుప్రీం కోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఆందోళనలు వ్యక్తం చేసింది. దీంతో సెబీ రంగంలోకి దిగింది. పీ-నోట్‌ల ద్వారా పెట్టుబడులు చేసే ఇన్వెస్టర్ల పూర్తి వివరాలను(కేవైసీ) వెల్లడించడం, పీ-నోట్ల జారీకి సబంధించి మదింపు ఇతరత్రా నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ ఇటీవలే నిర్ణయం తీసుకుంది.

సెబీ గణాంకాల ప్రకారం ఈ ఏడాది మార్చి నాటికి సెబీ వద్ద రిజిస్టర్ అయిన ఎఫ్‌పీఐల సంఖ్య 4,311. అయితే, వ్యక్తిగత విదేశీ ఇన్వెస్టర్లకు పీ-నోట్‌లను జారీ చేయడానికి సెబీ అనుమతించడం లేదు. కాగా, ఇప్పుడు సెబీ నిబంధనల కఠినతరం కారణంగా భారత్‌లో పీ-నోట్ పెట్టుబడులకు సంబంధించి వ్యయాలు పెరిగేం దుకు దారితీస్తుందని.. ఇది ఇన్వెస్టర్లపై ప్రతికూల ప్రభావం చూపొచ్చని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

 ఫండ్స్ జోరు...
భారత్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల కోసం ఎఫ్‌పీఐల నుంచి పీ-నోట్‌లను సబ్‌స్క్రయిబ్ చేసిన సంస్థలు దాదాపు 2,500 వరకూ ఉన్నట్లు అంచనా. వీటిలో సుమారు 1,500 వరకూ (60 శాతం) మ్యూచువల్ ఫండ్స్ ఉన్నట్లు సెబీ వెల్లడించింది. ఇంకా 300 వరకూ ఇతర కంపెనీలు, 50 ట్రస్టులు, 100 బ్యాంకులు, 50 సావరీన్ వెల్త్ ఫండ్స్, 200కు పైగా హెడ్జ్ ఫండ్స్, 60 పెన్షన్ ఫండ్స్ ఉన్నాయి. ఈ జాబితాలో కొన్ని యూనివర్సిటీ ఫండ్‌స, ఎండోమెంట్ ఫండ్స్, స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ఉండటం గమనార్హం. సెబీ చెబుతున్న దానిప్రకారం భారత్‌లో నమోదైన వాటిలో 37 ఎఫ్‌పీఐలు మాత్రమే ప్రస్తుతం ఈ పీ-నోట్‌లను జారీ చేస్తున్నాయి. ఈ ఏడాది మార్చి చివరినాటికి పీ-నోట్ పెట్టుబడులు రూ.2,23,077 కోట్లుగా నమోదయ్యాయి.

భారత్‌లో రిజిస్టర్ అయిన మొత్తం ఎఫ్‌పీఐల నిర్వహణలో ఉన్న అస్తుల్లో ఈ మొత్తం విలువ 10% మాత్రమే.  కాగా, ప్రస్తుత పెట్టుబడుల్లో 73% టాప్-10 ఎఫ్‌పీఐలు జారీ చేసిన పీ-నోట్‌ల ద్వారానే వచ్చాయి. ఈ దిగ్గజ ఎఫ్‌పీఐల్లో మోర్గాన్ స్టాన్లీ ఏషియా(సింగపూర్) పీటీఈ వాటా 14%, కాప్‌థాల్ మారిషస్ ఇన్వెస్ట్‌మెంట్ 12%, గోల్డ్‌మన్ శాక్స్(సింగపూర్) 7%, హెచ్‌ఎస్‌బీసీ బ్యాంక్(మారిషస్) 6% ఉన్నాయి. మిగతా వాటిలో మెరిల్ లించ్ క్యాపిటల్ మార్కెట్స్(స్పెయిన్), సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ మారిషస్, స్విస్ ఫైనాన్షియల్(మారిషస్), జేపీ మోర్గాన్ చేజ్ బ్యాంక్, నేషనల్ అసోసియేషన్(యూఎస్‌ఏ), సిటీకార్ప్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్‌ల వాటా 4-6% ఉంది.

కేమన్ ఐలాండ్స్ టాప్...
పీ-నోట్‌ల ద్వారా భారత్‌లో పెట్టుబడి పెడుతున్న సంస్థలు అత్యధికంగా కేమన్ ఐలాండ్స్ కేంద్రంగానే ఉండటం గమనార్హం. ఇప్పుడున్న పెట్టుబడుల్లో 93 శాతం టాప్-10 దేశాల నుంచే వస్తున్నాయి. ఈ జాబితాలో మారిషస్, యూకే, యూఎస్‌ల్లోని సంస్థలు 11 శాతం చొప్పున వాటాలను దక్కించుకున్నాయి. ఇక ఐర్లాండ్, ఫ్రాన్స్, లగ్జెంబర్గ్, సింగపూర్, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, దక్షిణ కొరియాలకు చెందిన సంస్థల వాటా 1-6%.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement