ఘటనా స్థలి వద్ద విలపిస్తున్న కుటుంబ సభ్యులు (అంతరచిత్రం) కరీమ (ఫైల్)
తోపుడు బండి ఇస్తున్నారు.. వెళ్లి తీసుకువద్దామని అత్తకు చిన్న అల్లుడు ఫోన్ చేసి పిలిచాడు. కొద్దిసేపటి తర్వాత అత్త ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. రాత్రి అయినా జాడ లేకపోవడంతో ఆమె కుటుంబీకులు కంగారు పడ్డారు. తెల్లారేసరికి నైనవరం ఫ్లై ఓవర్ దిగువన రైల్వే ట్రాక్ వద్ద శవమై కనిపించింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కొత్తపేట పోలీసులు రంగంలోకి దిగారు. వివరాలివీ..
చిట్టినగర్ (విజయవాడ పశ్చిమ) : వించిపేట ఫోర్‌మెన్ బంగ్లా ప్రాంతానికి చెందిన షేక్ కరీమ, ఇస్మాయిల్ భార్యాభర్తలు. కరీమ (47) వంట చేస్తుండగా, ఇస్మాయిల్ తాపీ పనికి వెళ్తుంటాడు. వీరికి నలుగురు సంతానం. ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు, చిన్న కుమార్తె భర్త టిప్పుసుల్తాన్. కొద్ది కాలంగా టిప్పుకి కరీమకు గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కరీమ తోపుడు బండి పెట్టుకుని వ్యాపారం చేయాలని నిర్ణయించుకుంది. స్థానిక ప్రజా ప్రతినిధి వద్ద తోపుడు బండి కోసం దరఖాస్తు చేసుకున్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో టిప్పుసుల్తాన్ అత్త కరీమకు ఫోన్ చేసి తోపుడు బండ్లు ఇస్తున్నారు. తారాపేట వెళ్లాలని చెప్పాడు. దీంతో ఇంట్లో ఉన్న ఆధార్ కార్డు, ఇతర జిరాక్స్ కాపీలను కవరులో పెట్టుకుని బయలుదేరింది. అయితే ఏం జరిగిందో గానీ కొద్దిసేపటి తర్వాత కరీమ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండటంతో ఇంట్లో వారు కంగారుపడ్డారు. రాత్రి అయినా కరీమ ఇంటికి రాకపోవడంతో తెలిసిన వారి ఇంట విచారించారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో రాత్రి 12 గంటల సమయంలో కొత్తపేట పోలీసులకు సమాచారం అందించారు.
రైల్వే ట్రాక్ వద్ద మృతదేహం!..
బుధవారం ఉదయం నైనవరం ఫ్లై ఓవర్ దిగువన రైల్వే ట్రాక్‌కు పక్కగా కంకర రాళ్ల వద్ద ఓ మహిళ మృతదేహాన్ని గమనించిన ట్రాక్‌మ్యాన్ వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో అటు కొత్తపేట పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ ఎండీ. ఉమర్, ఎస్‌ఐలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మహిళ ముఖంపై రాయితో కొట్టి చంపినట్లు గుర్తించిన పోలీసులు వెంటనే క్లూస్‌టీం, డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దింపారు. సమాచారం అందుకున్న ఏడీసీపీ నవాబ్‌జాన్, వెస్ట్ ఏసీపీ సుధాకర్ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంతలో మహిళ మృతదేహాన్ని చూసిన ఓ యువకుడు కరీమ కుటుంబీకులకు సమాచారం ఇచ్చాడు. దీంతో వారు వచ్చి మృతదేహాన్ని గుర్తించి కన్నీటి పర్యంతమయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు జాగిలం రైల్వే ట్రాక్ వెంబడి కొంత దూరం వెళ్లి మళ్లీ మృతదేహం వద్దకు చేరుకుంది. క్లూస్ టీం ఆధారాలను సేకరించింది. కుటుంబీకుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు కరీమ చిన్న అల్లుడు టిప్పు సుల్తాన్‌ను అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment