ధనార్జనే ధ్యేయంగా కొందరువ్యాపారులు ఇష్టారాజ్యంగావ్యవహరిస్తున్నారు. పాల నుంచి పండ్లదాకా.. టీ పొడి నుంచి మందుల దాకా అన్నిట్లో కల్తీలుసృష్టిస్తున్నారు. తమకు ఇష్టమొచ్చిన పదార్థాలను కలిపేస్తున్నారు. వీటిని ఎంచక్కా బహిరంగ మార్కెట్లలోవిక్రయిస్తూ ప్రజల ఆరోగ్యాలతోచెలగాటమాడుతున్నారు. నిండు జీవితాల్లో నిప్పులు పోస్తున్నారు.ఇటీవల తనిఖీల్లో ఒక్కొక్కటీ వెలుగు చూస్తున్న కల్తీలను
చూసి జనంనివ్వెరపోతున్నారు.
మదనపల్లె సిటీ: జిల్లాలో పలువురు వ్యాపారులు నిబంధనలకు నీళ్లొదిలేస్తున్నారు. పాలు, టీ ప్యాకెట్ల నుంచి పండ్లు, నిత్యావసర సరుకుల వరకు అన్నిట్లోనూ కల్తీలను సృష్టిస్తున్నారు. కల్తీ ఎరువులు, విత్తనాలతో రైతుల నడ్డివిరుస్తున్నారు.
ఇవిగో కల్తీలు..
జిల్లాలో పలుచోట్ల ప్రజారోగ్య శాఖ, విజిలెన్స్ అధికారులు మెరుపుదాడులు నిర్వహిస్తున్నారు. ఇందులో వ్యాపారాల అక్రమాలు బయటపడుతున్నాయి. కొన్ని నమ్మలేని విషయాలు బహిర్గతమవుతున్నాయి.
♦ మదనపల్లె పట్టణం బుగ్గకాల్వలో ఇటీవల విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. నకిలీ టీ పొడి విక్రయాల సంఘటన బయటపడింది. దాదాపు రూ.20 లక్షలకుపైగా నకిలీ సరుకు పట్టుబడింది. నకిలీ టీపొడిని ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.
♦ పలమనేరు పట్టణంలో కందిపప్పులో లక్కపప్పు కలిపి విక్రయాలు సాగిస్తూ విజిలెన్స్ అధికారులకు పట్టుబడిన విషయం తెల్సిందే.
♦ శ్రీకాళహస్తిలోని పలు హోటళ్లు, చికెన్ సెంటర్లలో కల్తీ మాంసం అమ్ముతుండగా తనిఖీ అధికారులు బహిర్గతం చేశారు.
♦ తిరుపతి సమీపంలోని కరకంబాడిలో పాలలో యూరియా, గంజినీళ్లు కలిపి విక్రయిస్తుండగా అధికారులు గుర్తించారు. అన్ని రకాల పండ్లను రసాయనాలతో మగ్గించి విక్రయాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకున్న సంఘటనలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 87 కేసులు నమోదు చేయగా అందులో 27 కేసులు కోర్టు పరిధిలో ఉన్నాయి.
నకిలీ మందులు..
వివిధ రకాల మందులు (ట్యాబ్లెట్లు) నకిలీవి చలామణి అవుతున్నాయి. కంపెనీ మాత్రలు అదే పేరుతో నకిలీవి తయారు చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. ఇటీవల ఔషధ నియంత్రణ అధికారుల దాడుల్లో నిజాలు వెలుగు చూశాయి.
♦ నకిలీ విత్తనాలు, ఎరువులు యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. రైతుల అవసరాలను వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల మదనపల్లె మండలం బసినికొండకు చెందిన రైతుకు నాసిరకం వరివిత్తనాలు అమ్మి సొమ్ము చేసుకున్న విషయం విదితమే. పంటపెట్టిన తర్వాత మొలకెత్తకపోవడంతో రైతులు మోసపోయినట్లు తెలుసుకుంటున్నారు. ఇలా రైతులు ఏటా నకిలీలతో భారీగా మోసపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment