meat mafia
-
స్టోరీ రాస్తావా..! అంటూ రిపోర్టర్‌పై దాడి
-
స్టోరీ రాస్తావా..! అంటూ మాఫియా దాడి
సాక్షి, బెంగుళూరు: అక్రమంగా నిర్వహిస్తున్న కబేళాన్ని వెలుగులోకి తెచ్చిన ఓ జర్నలిస్టుపై కర్ణాటకలో దాడి జరిగింది. పోలీసుల ఎదుటే ఈ దాడి జరగడం గమనార్హం. సరైన బలగం లేనందున కబేళం లోనికి వెళ్లలేమని హెచ్చరించిన పోలీసులు పశువుల అక్రమ రవాణా మాఫియాకు ఉప్పదించి వారిని కాపాడేందుకు ప్రయత్నించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాలు.. రాంనగర్ జిల్లాలోని కుడూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల కొడిపాల్యా గ్రామంలో అక్రమ కబేళం నిర్వహిస్తున్నారని తెలుసుకున్న ఓ జంతు ప్రేమికుడు పోలీసులకు సమాచారమిచ్చారు. రోజూ 200 ఆవుదూడలను వధించి, మాంసాన్ని రవాణా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తగిన పోలీసు బలగం లేనందున కబేళంలోనికి ప్రవేశించడానికి జంతు ప్రేమికుడు జాషైన్ ఆంథోని, ఓ జాతీయ పత్రికకు చెందిన రిపోర్టర్‌కు డీఎస్పీ అనుమతిన్విలేదు. మరుసటి రోజు (మంగళవారం) ఇద్దరు పోలీసులతో పాటు ఆంథోని, రిపోర్టర్ అక్కడికి చేరుకున్నారు. డీఎస్పీ ఆదేశాలతో కుడూర్ పోలీసులు ఆ కబేళంపై దాడి చేశారు. అయితే అప్పటికే కబేళం నిర్వహిస్తున్న మాఫియాకు సమాచారం అందడంతో అక్కడ ఆవుదూడల జాడ లేకుండా చేశారనీ, ఎవరికీ అనుమానం రాకుండా వాటిని అక్కడి నుంచి వేరే చోటికి తరలించారని రిపోర్టర్ ఆరోపించారు. పరిసరాల్లో లభ్యమైన పశువుల వ్యర్థాలు, ఎముకలు, రక్తపు మరకలతో అక్కడ కబేళం నిర్వహిస్తున్నారనే నిర్ధారించుకున్న రిపోర్టర్ ఆవుదూడలు దాచిపెట్టిన స్థలాన్ని కనుగొన్నాడు. ఘటనపై మరిన్ని వివరాలు సేకరించేందుకు ప్రయత్నించగా అక్కడే కాపుగాసిన కబేళం నిర్వహిస్తున్న కొందరు రిపోర్టరుపై దాడి చేశారని పోలీసులు తెలిపారు. 71 ఆవుదూడలను స్వాధీనం చేసుకున్న పోలీసులు రిపోర్టరుపై దాడి చేసిన గజీపీర్, ఖాసీ, సయ్యద్, ముబారఖన్, నూర్, ఇంతియాజ్, తాబ్రేజ్‌లపై కేసు నమోదు చేశారు. పశువుల అక్రమ రవాణలపై కూడా కేసులు పెట్టారు. -
నాణ్యతకు పాతర.. కల్తీల జాతర
ధనార్జనే ధ్యేయంగా కొందరువ్యాపారులు ఇష్టారాజ్యంగావ్యవహరిస్తున్నారు. పాల నుంచి పండ్లదాకా.. టీ పొడి నుంచి మందుల దాకా అన్నిట్లో కల్తీలుసృష్టిస్తున్నారు. తమకు ఇష్టమొచ్చిన పదార్థాలను కలిపేస్తున్నారు. వీటిని ఎంచక్కా బహిరంగ మార్కెట్లలోవిక్రయిస్తూ ప్రజల ఆరోగ్యాలతోచెలగాటమాడుతున్నారు. నిండు జీవితాల్లో నిప్పులు పోస్తున్నారు.ఇటీవల తనిఖీల్లో ఒక్కొక్కటీ వెలుగు చూస్తున్న కల్తీలను చూసి జనంనివ్వెరపోతున్నారు. మదనపల్లె సిటీ: జిల్లాలో పలువురు వ్యాపారులు నిబంధనలకు నీళ్లొదిలేస్తున్నారు. పాలు, టీ ప్యాకెట్ల నుంచి పండ్లు, నిత్యావసర సరుకుల వరకు అన్నిట్లోనూ కల్తీలను సృష్టిస్తున్నారు. కల్తీ ఎరువులు, విత్తనాలతో రైతుల నడ్డివిరుస్తున్నారు. ఇవిగో కల్తీలు.. జిల్లాలో పలుచోట్ల ప్రజారోగ్య శాఖ, విజిలెన్స్ అధికారులు మెరుపుదాడులు నిర్వహిస్తున్నారు. ఇందులో వ్యాపారాల అక్రమాలు బయటపడుతున్నాయి. కొన్ని నమ్మలేని విషయాలు బహిర్గతమవుతున్నాయి. ♦ మదనపల్లె పట్టణం బుగ్గకాల్వలో ఇటీవల విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. నకిలీ టీ పొడి విక్రయాల సంఘటన బయటపడింది. దాదాపు రూ.20 లక్షలకుపైగా నకిలీ సరుకు పట్టుబడింది. నకిలీ టీపొడిని ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ♦ పలమనేరు పట్టణంలో కందిపప్పులో లక్కపప్పు కలిపి విక్రయాలు సాగిస్తూ విజిలెన్స్ అధికారులకు పట్టుబడిన విషయం తెల్సిందే. ♦ శ్రీకాళహస్తిలోని పలు హోటళ్లు, చికెన్ సెంటర్లలో కల్తీ మాంసం అమ్ముతుండగా తనిఖీ అధికారులు బహిర్గతం చేశారు. ♦ తిరుపతి సమీపంలోని కరకంబాడిలో పాలలో యూరియా, గంజినీళ్లు కలిపి విక్రయిస్తుండగా అధికారులు గుర్తించారు. అన్ని రకాల పండ్లను రసాయనాలతో మగ్గించి విక్రయాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకున్న సంఘటనలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 87 కేసులు నమోదు చేయగా అందులో 27 కేసులు కోర్టు పరిధిలో ఉన్నాయి. నకిలీ మందులు.. వివిధ రకాల మందులు (ట్యాబ్లెట్లు) నకిలీవి చలామణి అవుతున్నాయి. కంపెనీ మాత్రలు అదే పేరుతో నకిలీవి తయారు చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. ఇటీవల ఔషధ నియంత్రణ అధికారుల దాడుల్లో నిజాలు వెలుగు చూశాయి. ♦ నకిలీ విత్తనాలు, ఎరువులు యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. రైతుల అవసరాలను వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల మదనపల్లె మండలం బసినికొండకు చెందిన రైతుకు నాసిరకం వరివిత్తనాలు అమ్మి సొమ్ము చేసుకున్న విషయం విదితమే. పంటపెట్టిన తర్వాత మొలకెత్తకపోవడంతో రైతులు మోసపోయినట్లు తెలుసుకుంటున్నారు. ఇలా రైతులు ఏటా నకిలీలతో భారీగా మోసపోతున్నారు. -
ఒంటెలు సరఫరా చేస్తుందెవరు..?
ప్రజలు మాంసాహారం తీసుకోవడాన్ని బాగా ఇష్టపడుతున్నారు. ప్రజల డిమాండ్‌కి తగినట్లుగా స్థానికంగా మాంసం లభించకపొవడంతో ఆ వ్యాపారం చేసే వారు.. అక్రమ పద్ధతుల ద్వారా మాంసం సేకరిస్తున్నారు. ఇలా సేకరించిన మాంసాన్ని స్టార్ హోటల్స్, రెస్టారెంట్లతో పాటు మాంసం ప్రియులకు వివిధ రకాల జంతువుల పేర్లు చెప్పి విక్రయిస్తూ రూ.లక్షలు సంపాధిస్తున్నారు. గతంలో అడవి పందులు, జింకలను కొసి విక్రయించే వ్యాపారులు డిమాండ్ పెరగడంతో భారీ జంతువులపై కన్నెశారు. మునుగోడు : భారీ జంతువుల్లో ఒకటైన ఒంటెని కొస్తే అధిక మొత్తంలో మాంసం వస్తుందని వ్యాపారులు భావించారు. ఎడారి ప్రాంతాలైయినా హర్యానా, గుజరాత్, రాజాస్థాన్ ప్రాంతాల నుంచి వయస్సు మీదపడిన ఒంటెలను కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకొచ్చి మాంసంగా మార్చుతున్నారు. ఒంటెలను అక్కడ నుంచి ఇక్కడికి ఎవరు రవాణా చేస్తున్నారు. ఎంతకు విక్రయిస్తున్నారు.. రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఉన్నా అవి ఎలా హైదరాబాద్‌కి వస్తున్నాయనే సందేహలు వ్యక్తమవుతున్నాయి. ఊకొండిలో ఒంటెలను కొస్తూ పట్టుబడిన దుండగులు సైతం ఆ ప్రాంతాలకు వెళ్లకుండానే హైదరాబాద్ నుంచి ఫోన్లలో బేరాలు చేసుకుని.. డబ్బు ఆన్లెన్ ద్వారా వారి ఖాతాల్లో జమచేసి ఒంటెలు తీసుకుంటున్నట్లు సమచారం. కానీ ఈ దందా ఎప్పటి నుంచి సాగుతోంది.. అలా అమ్మేవాళ్లు ఎవరు.. అనే విషయాలను పోలీసులు రాబట్టలేక పోయారు. పోలీసులు లోతుగా విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. మాంసం విక్రయించేదెక్కడో? ఒక ఒంటెను కోస్తే 350 నుంచి 400ల కేజీల మాంసం వస్తుంది. ఇక్కడ ఒకేసారి 25 నుంచి 30కిపైగా ఒంటెలను కోస్తుండడంతో దాదాపు 10 నుంచి 15 టన్నుల మాంసం ఉత్పత్తి అవుతుంది. ఈ మాంసాని ఎక్కడా విక్రయిస్తారు. ఎంతకు విక్రయిస్తారనేది ఇప్పటికీ తేలలేదు. హైదరాబాద్‌లో అమ్ముతున్నట్లు నిందితులు చెబుతున్నా అందులో నిజం లేదనిపిస్తోంది. హైదరాబాద్‌లో ఒకే రోజు 10 టన్నుల మాంసాని విక్రయించడం చాలా కష్టం. ఆ మాంసం మొత్తం ఇతర రాష్ట్ర, దేశాలకు సరఫరా చేస్తున్నారనే.. ఆరోపణలు అనేకం ఉన్నాయి. మాంసాన్ని ఎక్కడకు సరఫరా చేస్తున్నారు.. ఎలా చేస్తున్నారనే విషయంపై విచారిస్తే.. వ్యాపారంలో ఉన్న బడా బాబుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఒంటెల సరఫరా, మాంసం విక్రయంపై నిఘా పెడితే దందా గుట్టు రట్టు అయ్యే అవకాశాలు ఉన్నాయి. 25మంది రిమాండ్ మునుగోడు: నల్లగొండ జిల్లా మునుగోడు మండలం ఊకొండిలో ఒంటెల వధ కేసులో 25మందిని స్థానిక పోలీసులు శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. చండూరు సీఐ రమేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరబాద్‌కు చెందినా మహ్మ ద్ ఖాజ కురేష్, అబ్జల్ కురేష్లు..పశుమాంసం వ్యాపారులు. ప్రస్తుతం ఒంటె మాంసానికి బాగా డిమాండ్ ఉండటంతో వాటిని అప్పుడప్పుడు కొస్తూ ఉండేవారు. ఇటీవల హైదరాబాద్‌లో ఒంటెల మాంసం విక్రయాలపై పోలీసులు దాడులు చేయడంతో..సదరు వ్యాపారులు మునుగోడుకు చెందిన మాంసం వ్యాపారి ఖయ్యూంతో పరిచయం ఏర్పర్చుకున్నారు. ఒంటెలను కోసేందుకు నిర్మానుష్యమైన వ్యవసాయ భూమి కావాలని అడగగా, ఊకొండి గ్రామానికి చెందినా మాజీ సర్పంచ్ నిమ్మ ల స్వామిని సంప్రదించాడు. అతను తన భూమిని నెలకు రూ.2500 చొప్పున లీజుకు ఇచ్చాడు. దీంతో వ్యాపారులు బుధవారం రాత్రి 28 ఒంటెలని తీసుకొని ఊకొండికి వచ్చారు. వాటిని కోసేందుకు 19 మంది కూలీలను వెంటతెచ్చుకున్నారు. ఒంటెలను కోస్తుండగా గ్రామస్తుల సమాచారంతో పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. నిందితులను పోలీసులు విచారించి శుక్రవారం కోర్టులో హాజరుపర్చారు. -
మానవ రక్తంతో తడుస్తున్న ‘గోమాంసం’
న్యూఢిల్లీ: గోమాంసాన్ని తరలిస్తున్నారనే ఆరోపణలపై అమాయకులను కొట్టి చంపుతున్న గోరక్షకులపై కఠిన చర్యలు తీసుకుంటామని సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించినా దాడులు ఆగడం లేదు. నకిలీ గోరక్షకులు, మీట్ మాఫియా దాడులకు అమాయకులైన ముస్లింలు, దళితులే కాకుండా భారత జంతు సంక్షేమ బోర్డు అధికారులు, పర్యాటకులు, జంతు ప్రేమికులు, నిజమైన గోరక్షకులు బలవుతున్నారు. ఇలాంటి కేసులు ఎక్కువగా బయటకు రావడం లేదు. బాధితులు మరణించిన సందర్భాలు మాత్రమే వెలుగులోకి వస్తున్నాయి. గుర్తుతెలియని దుండగుల పేరిట కేసులు నమోదవుతున్నాయి. తదుపరి చర్యలు కనిపించడం లేదు. గోమాంసం నిషేధం అమల్లో ఉన్న గుజరాత్ నుంచి మహారాష్ట్రకు గోమాంసం, పశువులు పెద్ద ఎత్తున అక్రమ రవాణా కొన్నేళ్లుగా నిరాటంకంగా కొనసాగుతోంది. ‘మీట్ మాఫియా’ దీనిలో కీలక పాత్ర వహిస్తోంది. ఈ మాఫియాను ఛేదించేందుకు ‘ఇండియా టుడే’ ఇటీవల నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగుచూశాయి. గోమాంసం రవాణాను అడ్డుకుంటామన్న నెపంతో రోడ్డుపక్కన వెలసిన శివసేన, భజరంగ్ దళ్ కేంద్రాలకు చెందిన కార్యకర్తలే మీట్ మాఫియాకు అన్ని విధాలుగా అండదండలుగా ఉంటున్నారు. గోమాంసం లేదా పశువులను తరలించే ఒక్కో వాహనానికి కనీసంగా వారు 20వేల రూపాయలను వసూలు చేస్తున్నారు. డబ్బులిస్తే తాము వాహనం వెంట వస్తామని, ఏ పోలీసు అధికారి కూడా తమను చూస్తే వాహనాన్ని ఆపరని భరోసా ఇస్తున్నారు. డబ్బులివ్వకపోతే రాళ్లతోకొట్టి చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఒక్క గోవులేకాదు, ఎద్దులు, బర్రెలు వేటిని తరలించినా డబ్బులు ముట్టజెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మొదటి నుంచి అహ్మదాబాద్, పుణె జాతీయ రహదారిలో ఈ దందా కొనసాగుతున్నప్పటికీ పశువుల విక్రయంపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించిన నాటి నుంచి ఎక్కువైందని పశువుల ఎగుమతిదారులు చెబుతున్నారు. కేంద్రం ఆంక్షలపై కోర్టులు స్టే ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెల్సిందే. ప్రస్తుతం గోమాంస నిషేధం అమల్లో ఉన్న ప్రతి రాష్ట్రంలో గోరక్షకుల పేరిట దాడులు చేస్తున్నారు. పశువులను తరలించే వాహనాల నుంచి దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇవ్వకపోతే గోమాంసం కలిగి ఉన్నారనో, కబేళాలకు గోవులను తరలిస్తున్నారనే ఆరోపణలపై కొడుతున్నారు. ఇలా దెబ్బలుతిన్న అమాయకులు ఎందరో ఉన్నారు. వారు ఫిర్యాదులు చేసినా కొంత మంది నాయకుల ఒత్తిళ్లకు లొంగి పోలీసులు కేసులు నమోదు చేయడం లేదు. జూలై 14వ తేదీన సాఫ్ట్వేర్ ఇంజనీరు అజయ్ (ఆయన విజ్ఞప్తిపై పేరు మారింది) తన భార్యా, మిత్రులతో కలసి పర్యాటక ప్రాంతానికి వెళ్లగా వారిపై మీట్ మాఫియా దాడి చేసింది. అజయ్ చెప్పిన వివరాల ప్రకారం వారు ఒడిశాలోని రాయగఢ జిల్లా, ఛాందిలీ ప్రాంతం పర్యటనకు వెళ్లారు. అక్కడ బహిరంగ ప్రదేశంలో బలమైన కర్రలు, గొడ్డళ్లతో పశువులను బాదుతూ ఎక్కడికో తీసుకెళుతున్నారు. నోరులేని జీవులను ఎందుకయ్యా ! అలా హింసిస్తున్నారని అజయ్ బృందం ప్రశ్నించగా, అవే కర్రలు, గొడ్డళ్లతో వారిని చితకబాదారు. అజయ్ భార్యను లైంగికంగా వేధించారు. వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందినట్లు ధ్రువీకరణ పత్రాలు కూడా ఉన్నాయి. పోలీసులు కేసును నమోదు చేయడానికి తొలుత నిరాకరించారు. సంఘటనకు సంబంధించి రికార్డు చేసిన కొన్ని మొబైల్ వీడియో దశ్యాలను సాక్ష్యంగా చూపడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కానీ ఇంతవరకు నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కర్ణాటకలోని హసన్ జిల్లాలో జూన్ నెలలో భారత జంతు సంక్షేమ బోర్డు అధికారి తిమ్మరాజుపై పోలీసుల సమక్షంలోనే మీట్ మాఫియా దాడి చేయడంతో తలకు బలమైన గాయం అయింది. ఇతర రాష్ట్రాల్లో భారత జంతు సంక్షేమ బోర్డుకు చెందిన అధికారులు కవితా జైన్, జోషిన్ ఆంటోనిలకు కూడా దాడుల్లో తలలపై తీవ్ర గాయాలయ్యాయి. హర్యానాలోని రేవరి జిల్లా, ఖోల్లో జూలై పదవ తేదీన పశువులను అక్రమంగా తరలిస్తున్న మీట్ మాఫియా పోలీసులపైకే కాల్పులు జరిపింది. పలు రాష్ట్రాల్లో గోమాంసం నిషేధం అమల్లోకి వచ్చినప్పటి నుంచి మీట్ మాఫియా ఆగడాలు మితిమీరిపోయాయని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. గోమాంసానికి డిమాండ్ పెరగడంతో మీట్ మాఫియా ఎంతకైనా తెగిస్తోందని వారన్నారు. మరోవైపు డబ్బుల కోసం మీట్ మాఫియాకు సహకరిస్తున్న గోరక్షకుల దాడులు కూడా పెరిగిపోతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.