
ఘటనా ప్రాంతం..
సాక్షి, బెంగుళూరు: అక్రమంగా నిర్వహిస్తున్న కబేళాన్ని వెలుగులోకి తెచ్చిన ఓ జర్నలిస్టుపై కర్ణాటకలో దాడి జరిగింది. పోలీసుల ఎదుటే ఈ దాడి జరగడం గమనార్హం. సరైన బలగం లేనందున కబేళం లోనికి వెళ్లలేమని హెచ్చరించిన పోలీసులు పశువుల అక్రమ రవాణా మాఫియాకు ఉప్పదించి వారిని కాపాడేందుకు ప్రయత్నించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాలు.. రాంనగర్ జిల్లాలోని కుడూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల కొడిపాల్యా గ్రామంలో అక్రమ కబేళం నిర్వహిస్తున్నారని తెలుసుకున్న ఓ జంతు ప్రేమికుడు పోలీసులకు సమాచారమిచ్చారు.
రోజూ 200 ఆవుదూడలను వధించి, మాంసాన్ని రవాణా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తగిన పోలీసు బలగం లేనందున కబేళంలోనికి ప్రవేశించడానికి జంతు ప్రేమికుడు జాషైన్ ఆంథోని, ఓ జాతీయ పత్రికకు చెందిన రిపోర్టర్‌కు డీఎస్పీ అనుమతిన్విలేదు. మరుసటి రోజు (మంగళవారం) ఇద్దరు పోలీసులతో పాటు ఆంథోని, రిపోర్టర్ అక్కడికి చేరుకున్నారు. డీఎస్పీ ఆదేశాలతో కుడూర్ పోలీసులు ఆ కబేళంపై దాడి చేశారు.
అయితే అప్పటికే కబేళం నిర్వహిస్తున్న మాఫియాకు సమాచారం అందడంతో అక్కడ ఆవుదూడల జాడ లేకుండా చేశారనీ, ఎవరికీ అనుమానం రాకుండా వాటిని అక్కడి నుంచి వేరే చోటికి తరలించారని రిపోర్టర్ ఆరోపించారు. పరిసరాల్లో లభ్యమైన పశువుల వ్యర్థాలు, ఎముకలు, రక్తపు మరకలతో అక్కడ కబేళం నిర్వహిస్తున్నారనే నిర్ధారించుకున్న రిపోర్టర్ ఆవుదూడలు దాచిపెట్టిన స్థలాన్ని కనుగొన్నాడు.
ఘటనపై మరిన్ని వివరాలు సేకరించేందుకు ప్రయత్నించగా అక్కడే కాపుగాసిన కబేళం నిర్వహిస్తున్న కొందరు రిపోర్టరుపై దాడి చేశారని పోలీసులు తెలిపారు. 71 ఆవుదూడలను స్వాధీనం చేసుకున్న పోలీసులు రిపోర్టరుపై దాడి చేసిన గజీపీర్, ఖాసీ, సయ్యద్, ముబారఖన్, నూర్, ఇంతియాజ్, తాబ్రేజ్‌లపై కేసు నమోదు చేశారు. పశువుల అక్రమ రవాణలపై కూడా కేసులు పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment