మానవ రక్తంతో తడుస్తున్న ‘గోమాంసం’ | Meat mafia terror: How law enforcers overlook attack on animal activists | Sakshi
Sakshi News home page

మానవ రక్తంతో తడుస్తున్న ‘గోమాంసం’

Published Thu, Jul 20 2017 2:05 PM | Last Updated on Tue, Sep 5 2017 4:29 PM

Meat mafia terror: How law enforcers overlook attack on animal activists



న్యూఢిల్లీ: గోమాంసాన్ని తరలిస్తున్నారనే ఆరోపణలపై అమాయకులను కొట్టి చంపుతున్న గోరక్షకులపై కఠిన చర్యలు తీసుకుంటామని సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించినా దాడులు ఆగడం లేదు. నకిలీ గోరక్షకులు, మీట్‌ మాఫియా దాడులకు అమాయకులైన ముస్లింలు, దళితులే కాకుండా భారత జంతు సంక్షేమ బోర్డు అధికారులు, పర్యాటకులు, జంతు ప్రేమికులు, నిజమైన గోరక్షకులు బలవుతున్నారు. ఇలాంటి కేసులు ఎక్కువగా బయటకు రావడం లేదు. బాధితులు మరణించిన సందర్భాలు మాత్రమే వెలుగులోకి వస్తున్నాయి. గుర్తుతెలియని దుండగుల పేరిట కేసులు నమోదవుతున్నాయి. తదుపరి చర్యలు కనిపించడం లేదు.

గోమాంసం నిషేధం అమల్లో ఉన్న గుజరాత్‌ నుంచి మహారాష్ట్రకు గోమాంసం, పశువులు పెద్ద ఎత్తున అక్రమ రవాణా కొన్నేళ్లుగా నిరాటంకంగా కొనసాగుతోంది. ‘మీట్‌ మాఫియా’ దీనిలో కీలక పాత్ర వహిస్తోంది. ఈ మాఫియాను ఛేదించేందుకు ‘ఇండియా టుడే’ ఇటీవల నిర్వహించిన స్టింగ్‌ ఆపరేషన్‌లో ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగుచూశాయి. గోమాంసం రవాణాను అడ్డుకుంటామన్న నెపంతో రోడ్డుపక్కన వెలసిన శివసేన, భజరంగ్‌ దళ్‌ కేంద్రాలకు చెందిన కార్యకర్తలే మీట్‌ మాఫియాకు అన్ని విధాలుగా అండదండలుగా ఉంటున్నారు. గోమాంసం లేదా పశువులను తరలించే ఒక్కో వాహనానికి కనీసంగా వారు 20వేల రూపాయలను వసూలు చేస్తున్నారు. డబ్బులిస్తే తాము వాహనం వెంట వస్తామని, ఏ పోలీసు అధికారి కూడా తమను చూస్తే వాహనాన్ని ఆపరని భరోసా ఇస్తున్నారు. డబ్బులివ్వకపోతే రాళ్లతోకొట్టి చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఒక్క గోవులేకాదు, ఎద్దులు, బర్రెలు వేటిని తరలించినా డబ్బులు ముట్టజెప్పాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.


మొదటి నుంచి అహ్మదాబాద్, పుణె జాతీయ రహదారిలో ఈ దందా కొనసాగుతున్నప్పటికీ పశువుల విక్రయంపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించిన నాటి నుంచి ఎక్కువైందని పశువుల ఎగుమతిదారులు చెబుతున్నారు. కేంద్రం ఆంక్షలపై కోర్టులు స్టే ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెల్సిందే. ప్రస్తుతం గోమాంస నిషేధం అమల్లో ఉన్న ప్రతి రాష్ట్రంలో గోరక్షకుల పేరిట దాడులు చేస్తున్నారు. పశువులను తరలించే వాహనాల నుంచి దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇవ్వకపోతే గోమాంసం కలిగి ఉన్నారనో, కబేళాలకు గోవులను తరలిస్తున్నారనే ఆరోపణలపై కొడుతున్నారు. ఇలా దెబ్బలుతిన్న అమాయకులు ఎందరో ఉన్నారు. వారు ఫిర్యాదులు చేసినా కొంత మంది నాయకుల ఒత్తిళ్లకు లొంగి పోలీసులు కేసులు నమోదు చేయడం లేదు.

జూలై 14వ తేదీన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరు అజయ్‌ (ఆయన విజ్ఞప్తిపై పేరు మారింది) తన భార్యా, మిత్రులతో కలసి పర్యాటక ప్రాంతానికి వెళ్లగా వారిపై మీట్‌ మాఫియా దాడి చేసింది. అజయ్‌ చెప్పిన వివరాల ప్రకారం వారు ఒడిశాలోని రాయగఢ జిల్లా, ఛాందిలీ ప్రాంతం పర్యటనకు వెళ్లారు. అక్కడ బహిరంగ ప్రదేశంలో బలమైన కర్రలు, గొడ్డళ్లతో పశువులను బాదుతూ ఎక్కడికో తీసుకెళుతున్నారు. నోరులేని జీవులను ఎందుకయ్యా ! అలా హింసిస్తున్నారని అజయ్‌ బృందం ప్రశ్నించగా, అవే కర్రలు, గొడ్డళ్లతో వారిని చితకబాదారు.

అజయ్‌ భార్యను లైంగికంగా వేధించారు. వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందినట్లు ధ్రువీకరణ పత్రాలు కూడా ఉన్నాయి. పోలీసులు కేసును నమోదు చేయడానికి తొలుత నిరాకరించారు. సంఘటనకు సంబంధించి రికార్డు చేసిన కొన్ని మొబైల్‌ వీడియో దశ్యాలను సాక్ష్యంగా చూపడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కానీ ఇంతవరకు నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

కర్ణాటకలోని హసన్‌ జిల్లాలో జూన్‌ నెలలో భారత జంతు సంక్షేమ బోర్డు అధికారి తిమ్మరాజుపై పోలీసుల సమక్షంలోనే మీట్‌ మాఫియా దాడి చేయడంతో తలకు బలమైన గాయం అయింది. ఇతర రాష్ట్రాల్లో భారత జంతు సంక్షేమ బోర్డుకు చెందిన అధికారులు కవితా జైన్, జోషిన్‌ ఆంటోనిలకు కూడా దాడుల్లో తలలపై తీవ్ర గాయాలయ్యాయి.  హర్యానాలోని రేవరి జిల్లా, ఖోల్‌లో జూలై పదవ తేదీన పశువులను అక్రమంగా తరలిస్తున్న మీట్‌ మాఫియా పోలీసులపైకే కాల్పులు జరిపింది.

పలు రాష్ట్రాల్లో గోమాంసం నిషేధం అమల్లోకి వచ్చినప్పటి నుంచి మీట్‌ మాఫియా ఆగడాలు మితిమీరిపోయాయని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. గోమాంసానికి డిమాండ్‌ పెరగడంతో మీట్‌ మాఫియా ఎంతకైనా తెగిస్తోందని వారన్నారు. మరోవైపు డబ్బుల కోసం మీట్‌ మాఫియాకు సహకరిస్తున్న గోరక్షకుల దాడులు కూడా పెరిగిపోతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement