సాలూరు: వారానికి 10 రూపాయల నుంచి రూ. 500 వరకు కట్టండి.. లక్కీడిప్ లాటరీలో విలువైన వస్తువులను గెలుచుకోండని ప్రచారం చేసి గిరిజనులను మోసం చేసిన సంఘటన సాలూరు, పాచిపెంట మండలాల్లో వెలుగు చూసింది. గిరిజన గ్రామాలను లక్ష్యంగా చేసుకుని ఈ మోసానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఇద్దరు యువకులు తాము బొబ్బిలి పట్టణానికి చెందిన వారమని ‘సమ్మక్క–సారక్క’ పేరుతో లక్కీడిప్ లాటరీ నిర్వహిస్తున్నట్లు చెబుతూ గత నెలలో సాలూరు, పాచిపెంట మండలాల్లో పర్యటించారు. ఆకర్షణీయమైన బ్రోచర్లను చూపి లాటరీ ద్వారా తక్కువ మొత్తంలో విలువైన బహుమతులు గెలుచుకోవచ్చని నమ్మించారు.
దీంతో చాలామంది గిరిజనులు వారి బుట్టలో పడిపోయారు. తొలివారం కేవలం 10 రూపాయలే చెల్లించాలి.. ఆ తర్వాత వారం రూ. 20.. ఇలా ప్రతి వారం పెంచుకుంటూ 18 వారాలు కట్టాల్సి ఉంటుందని మోసగాళ్లు ప్రచారం చేశారు. 200 సభ్యులకు కూడా ప్రతి వారం ఏదో ఒక బహుమతి వస్తుందని ఆశ కల్పించారు. స్టీల్ బిందెలు, టేబుల్ ఫ్యాన్లు, స్మార్ట్‌ఫోన్లు, డబుల్‌కాట్, బీరువాలు, ఫ్రిజ్‌లు, కుక్కర్లు, మిక్సీలు గెలుచుకోవాలని ఊదరగొట్టారు. వారానికో గ్రామంలో లాటరీ తీసి విజేతల ఇళ్లకు తీసుకువచ్చి బహుమతులు అందజేస్తామని, అలాగే లాటరీలో గెలిచిన వారు ఇకపై డబ్బులు కట్టనవసరం లేదని ప్రచారం చేయడంతో అయామక గిరిజనులు ఆకర్షితులై డబ్బులు చెల్లించారు. సాలూరు మండలంలోని నిమ్మలపాడు, గునికొండవలస, తాడిలోవ, నక్కడవలస, పెద్దవలస, నార్లవలస, చెల్లివలస, బాగువలస, బర్నికవలస, పెదపథం, గాదెవలస, పునికిలవలస, గెర్రపువలస, తదితర గ్రామాల్లో దాదాపు అన్ని కుటుంబాలూ ఈ స్కీమ్‌లో చేరారు. మొదట్లో ఒకటి, రెండు వారాలు లాటరీలు తీసి బహుమతులు అందజేసిన మోసగాళ్లు రెండు వారాలుగా కనిపించకుండా పోయారు. సాలూరు, పాచిపెంట మండలాల్లో పలు గ్రామాల బాధితుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసగాళ్లు పరారయ్యారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.
రూ. 6 వేలు కట్టాను
స్కీమ్‌లో భాగంగా ఆరు వేల రూపాయల వరకు కట్టాను. నాలాగే మా ఊర్లో పలువురి నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి పరారయ్యారు. ఫోన్ చేస్తే దొరకడంలేదు. బొబ్బిలి వెళ్లి వెతికినా ఫలితం లేకపోయింది. పాచిపెంటలో కూడా ఇదే తరహాలో మోసం చేసినట్లు తెలిసింది.
– జన్ని సుబ్బారావు, సీతందొరవలస
మోసం చేశారు
బొబ్బిలి పట్టణానికి చెందిన రోహిత్, శివగా పరిచయం చేసుకుని 7416505787 ఫోన్ నంబర్ ఇచ్చి స్కీమ్‌లో చేర్పించారు. వారం, వారం డబ్బులు కట్టాను. ఇలా 8,500 రూపాయల వరకు చెల్లించాను. లాటరీ తగల్లేదని నమ్మించి, ఇప్పుడేమో కనబడకుండా పోయారు. ఫోన్ చేస్తే రాంగ్‌నంబర్ అని చెబుతున్నారు.
– గడబారి శ్రీను, పెదదవలస, సాలూరు మండలం