lucky dip
-
వ్యాక్సిన్ వేసుకుంటే.. బిర్యానీ, బైకు, బంగారం.. ఎక్కడో తెలుసా?
చెన్నై: కోవిడ్ మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు వ్యాక్సినేషన్ కీలకమని ప్రభుత్వాలు ఆ దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి. మరో పక్క టీకా వేసుకుంటే ఏమౌతుందో అన్న అపోహ ఇంకా పలు చోట్ల ఉండడంతో వ్యాక్సినేషన్‌కు ప్రజలు ముందుకు రావడం లేదు. దీంతో తమిళనాడులో ఓ స్వచ్ఛంద సంస్థ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. వ్యాక్సిన్ వేయుంచుకున్న వారికి లక్కీ డ్రా రూపంలో విలువైన వస్తువులను అందిస్తోంది. ఈ లక్కీ డ్రాలో బిర్యానీ, మిక్సీ గ్రైండర్, 2 గ్రాముల బంగారం, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషిన్, స్కూటర్‌ను బహుమతులుగా ఇస్తామని చెప్పడంతో ప్రజలు టీకా వేయించుకోవడానికి ముందుకొస్తున్నారు. వ్యాక్సిన్ వేసుకుంటే..బైకు, బంగారం మీకే కోవలం ప్రాంతంలో సుమారు 7000 జనాభా ఉండగా, గత రెండు నెలల్లో కేవలం 58 మందికి మాత్రమే వ్యాక్సిన్ వేయించుకున్నారు. వ్యాక్సిన్ వేసుకునే వారి సంఖ్య తగ్గుతుందనే ఆందోళనతో ఆ ప్రాంతానికి చెందిన ఎస్ఎన్ రామ్‌దాస్ ఫౌండేషన్, ఎస్టిఎస్ ఫౌండేషన్, చిరాజ్ ట్రస్ట్‌కు చెందిన వలంటీర్లు చేతులు కలిపి ఓ పథకాన్ని ప్రవేశపెట్టారు. అందులో భాగంగానే వ్యాక్సిన్ వేసుకున్నావారికి ఉచిత బిర్యానీ భోజనం అందించడం ప్రారంభించారు. అనంతరం దీన్ని మరింత ఆకర్షణీయంగా మార్చడానికి, ముగ్గురు వ్యక్తులకు మిక్సీ, గ్రైండర్ , 2-గ్రాముల బంగారు నాణెలను లక్కీ డ్రా ద్వారా ఇవ్వడం ప్రారంభించారు. రాను రాను అందులో విజేతలకు బహుమతిగా రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషిన్, స్కూటర్‌ను కూడా జత చేర్చారు. ఈ నేపథ్యంలో కొత్తగా టీకా వేయించుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇలా ఈ లక్కీ డ్రా వల్ల కేవలం మూడు రోజుల్లో 345 మందికి టీకాలు వేసుకున్నారు. చదవండి: మంత్రి ప్రకటనపై ప్రజలు హర్షం, ఆ వెంటనే యూటర్న్.. -
లక్కంటూ... కిక్కిచ్చారు!
పిడుగురాళ్ల టౌన్(గుంటూరు జిల్లా): మీకు లక్కీడీప్‌లో జె–7 సెల్‌ఫోన్ వచ్చింది.. నాలుగు వేలు చెల్లిస్తే.. రూ.14వేల విలువైన సెల్‌ఫోన్ అందుకోవచ్చు’ అని ఓ కంపెనీ వారి మాయమాటలు నమ్మిన ఓ యువకుడు నిండా మోసపోయిన ఘటన మంగళవారం జరిగింది. సెల్‌ఫోన్ స్థానంలో చిన్న ఆంజనేయస్వామి విగ్రహంతోపాటు హనుమాన్ చాలీసా విజిటింగ్ కార్డును పార్శిల్లో పంపిన వైనం వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన బత్తుల వెంకటేశ్వర్లు మూడునెలల కిందట సామ్సంగ్ కంపెనీ ఫ్రిజ్‌ను కొనుగోలు చేశాడు. ఈ నేపథ్యంలో పదిరోజుల కిందట వెంకటేశ్వర్లుకు ఫోన్ వచ్చింది. “మీరు ఫ్రిజ్ కొన్నారు కదా.. ఆ లక్కీడీప్‌లో జె–7 సెల్‌ఫోన్ వచ్చింది. నాలుగువేలు చెల్లించి పోస్టాఫీస్‌లో తీసుకోవాలి అని ఫోన్లో చెప్పారు. ఆశతో వెంకటేశ్వర్లు రూ. నాలుగువేలు పోస్టాఫీస్‌లో చెల్లించి పార్శిల్‌ను అందుకున్నాడు. తీరా ఇంటికి వెళ్లి పార్శిల్ తెరవగా అందులో చిన్న ఆంజనేయస్వామి విగ్రహం, హనుమాన్ చాలీసా విజిటింగ్కార్డు ఉండడంతో అవాక్కయ్యాడు. -
‘రయ్’మన్న మోసం!
సాక్షి, కర్నూలు: ‘అదృష్టవంతులు మీరే.. చిన్న మొత్తాన్ని చెల్లించండి.. కార్లు..బైక్‌లు పొందండి..విదేశాల్లో టూర్లు వేయండి’ అంటూ అరచేతిలో స్వర్గం చూపాడు. సినీ తారలతో కార్యక్రమాలు నిర్వహించి ప్రజలందరినీ నమ్మించాడు. రూ.10 కోట్ల వరకు డబ్బు మూటగట్టుకొని ఉడాయించాడు. ఈ ఘటన సోమవారం ఆలస్యంగా నంద్యాల పట్టణంలో వెలుగు చూసింది. బాధితుల వివరాల మేరకు.. పద్మావతినగర్‌లో ఉన్న జేవీసీ బైక్ షోరూం యజమాని మనోహర్ కొంత కాలంగా లక్కీడిప్ ద్వారా ప్రజలకు బైక్‌లు అందజేసే వాడు. ఈ క్రమంలో కస్టమర్లు పెరిగిపోయారు. మరికొంత మందిని ఆకర్షించేందుకు సినీతారలను పట్టణానికి పిలిపించి వారితో లక్కీడిప్ తీయించేవాడు. కస్టమర్లు పెరగటంతో వారి నుంచి లక్షల రూపాయలు వసూలు చేశాడు. బైక్‌ల కోసం రూ.10 వేల నుంచి 20 వేల వరకూ వసూలు చేయగా కార్ల కోసం రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల మేర తీసుకున్నాడు. కొంత కాలం తర్వాత వాహనాలు ఇవ్వకపోవటంతో డబ్బు అయినా తిరిగి ఇవ్వాలని బాధితులు నిలదీసినా స్పందన కరువైంది. షోరూం యజమానులూ బాధితులే... జేవీసీ షోరూం యజమాని మనోహర్ సబ్‌డీలర్ కావటంతో ఇతర షోరూంల నుంచి బైక్‌లు కొనుగోలు చేసేవాడు. ఈ క్రమంలో ఇతర షోరూం యజమానుల వద్ద కూడా లక్షల రూపాయల్లో అప్పు చేశాడు. కస్టమర్లకు బైక్‌లు ఇచ్చే క్రమంలో జాప్యం రావటంతో వ్యాపారం కొంత తగ్గుముఖం పట్టింది. జల్సాలకు అలవాటు పడటంతో అందినకాడికి అప్పులు చేశాడు. ప్రవేటు వ్యక్తుల వద్ద చిట్టీలు వేసి నగదు చేసుకుని వారికి ఎగనామం పెట్టాడు. ఒత్తిళ్లు భరించలేకే ఉడాయించాడా? షోరూం నిర్వాహణ.. మరో వైపు కస్టమర్ల ఒత్తిడి భరించలేక అందినాడికి అప్పులు తీసుకున్నాడు. చిట్టీలు నష్టానికి పాడి ఆ డబ్బుతో సర్దుబాటు చేయటం మొదలు పెట్టాడు. పట్టణంలోని వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీకి రునం తీసుకోవటంతో నెలనెలా వడ్డీకోసం వారి ఒత్తిళ్లు ఒకవైపు ఉండేది. ఇలా రెండేళ్లుగా అప్పుల వారికి నచ్చచెబుతూ కాలం వెళ్లబుచ్చాడు. రానురాను అప్పులు కోట్లకు చేరటంతో వడ్డీలు కట్టడం కూడా కష్టంగా మారింది. ఒత్తిడి చేసే వారికి పోస్ట్‌పెయిడ్ చెక్కులు ఇచ్చి శాంతింప జేసేవాడు. పోస్ట్‌పెయిడ్ ఇచ్చాడు కదా అని సంతృప్తిపడి అప్పుల వారు వెనుదిరిగి వెళ్లిపోయేవారు. ఇదే అదనుగా అడిగిందే మొదలు అందరికి చెక్కులు ఇవ్వటం మొదలు పెట్టాడు. అందరికీ ఒక నెల గడువు అడిగి ఎవ్వరికీ తెలియకుండా ఇల్లు కూడా అమ్మేశాడు. మరికొన్ని ఆస్తులు కూడా అమ్మి నాలుగు రోజుల క్రితం చెప్పాపెట్టకుండా ఇల్లు ఖాళీ చేసి ఉడాయించాడు. నాలుగు రోజులుగా షోరూం తెరవక పోయేసరికి అనుమానం వచ్చి ఇంటి వద్ద విచారిస్తే అసలు నిజం బయటపడింది. నాలుగు రోజుల కిందట ఇంటికి తాళం వేసి Ðవెళ్లిపోయారన్న సమాచారం తెలియటంతో భాధితులు లబోదిబోమన్నారు. చెక్కులు తీసుకుని బ్యాంకుకు వెళితే బ్యాంక్ ఖాతాలో చిల్లి గవ్వలేక పోవటంతో పోలీసులను ఆశ్రయించారు. నంద్యాల పట్టణంలో బాధితులు 500 మందికి పైగానే ఉన్నారు. వీరి ఫిర్యాదు మేరకు.. చీటింగ్, చిట్‌ఫండ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి నట్లు టూటౌన్ ఎస్ఐ సుబ్బరామిరెడ్డి తెలిపారు. -
లక్కీ డ్రా పేరిట మోసం
విశాఖపట్నం, అనంతగిరి(అరకులోయ): లక్కీడ్రా పేరుతో ఫోన్ ఇసా ్తమని తెలపడం తో రూ.3,500 చెల్లించి మండలంలోని కాశీ పట్నం పంచాయతీ మండపర్తి గ్రామానికి చెందిన పాడి రామకృష్ణ అనే గిరిజన యువకుడు మోసపోయాడు. వివరాలు ఇలా గత బుధవారం అతనికి కాల్ వచ్చింది. మీ మొబైల్ నంబరుకు బ్లూటూత్, శాంసంగ్ ఫోన్ లక్కీడ్రాలో వచ్చాయని అవతలవ్యక్తి చెప్పారు. మీవివరాలు తెలి పితే పోస్టు ద్వారా వాటిని పంపింస్తామని, అయితే రూ 3,500 చెల్లించాలని తెలిపారు. మళ్లీ వారం రోజుల తరువాత పోస్టల్ కార్యాలయానికి వెళ్లి తీసుకోమని ఫోన్ వచ్చింది. దీంతో రామకృష్ణ పోస్టల్ కార్యాలయానికి వెళ్లి రూ.3,500 చెల్లించి పార్సిల్ తీసుకున్నాడు. బాక్స్ విప్పి చూడగా అందులో కూరగాయలు తరిగే సెట్ ఉంది. దీంతో తాను మోసపోయానని ఆ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. -
దర్జాగా దోచేశారు!
ప్రకాశం, పెద్దదోర్నాల: కొంత మొత్తాన్ని చెల్లిస్తే రూ. 50 వేల విలువ చేసే ప్లాస్మా టీవీలు, డబుల్ కాట్ మంచాలను అందిస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఘరానా మోసానికి పాల్పడ్డారు. ఈ మోసం మండల కేంద్రంలోని సుందరయ్య కాలనీలో కొద్ది రోజులు క్రితం చోటు చేసుకోగా మంగళవారం వెలుగు చూసింది. మోసానికి గురైన వారంతా తోపుడు బండ్ల మీద చిరు వ్యాపారాలు చేసుకునే వారు, హోటళ్లలో అంట్లు తోముకు బతికే వారు, వ్యవసాయ పనులు చేసుకుంటూ నెట్టుకొచ్చే వారే. ఇలా రోజు వారీ సంపాదనతో జీవితాలను గడుపుకుంటూ జీవనం సాగించే వీరి అవసరాలను, అమాయకత్వాన్ని అసరాగా తీసుకున్న కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నమ్మించి మోసగించారు. ఒక్కసారిగా అంత పెద్ద వస్తువులు తామెలాగూ కొనలేమని, కష్టమో, నష్టమో కొంత నగదును చెల్లిస్తే తమకు కావలిసిన వస్తువులు తీసుకొని వాయిదాల పద్ధతిలో కట్టుకోవచ్చు అనుకున్న అమాయకులు వారి మాయమాటలకు మోసపోయారు. అడిగిందే తడువుగా ఒక్కొక్కరు తాము కూలీ పనులు చేసుకుని సంపాందించిన డబ్బులను వారి చేతిలో పెట్టారు. పలానా తేదీన వచ్చి మీరు కోరుకున్న వస్తువులు ఇస్తామని చెప్పటంతో ఆ తేదీ కోసం ఆశగా ఎదురు చూశారు. తీరా చూస్తే ఆ మోసగాళ్లు పెట్టిన గడువు తీరిపోయింది. దీంతో మోసపోయామని గుర్తించిన శ్రామికులు లబోదిబోమన్నారు. నమ్మించేందుకు కుక్కర్ల అందజేత.. మండల కేంద్రంలోని సుందరయ్య కాలనీలోకి వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు తాము వాయిదాల పద్ధతిలో ప్లాస్మా టీవీలను, డబుల్ కట్ మంచాలను ఇస్తామని, అవసరమైన వారు 2700 రూపాలయలు చెల్లించాలని సూచించారు. వారికి తొలుత రైస్ కుక్కర్ ఇస్తామని చెప్పి అలాగే అందజేశారు. విజయదుర్గ హోమ్ ఫైనాస్స్, డోర్ నెం 16–19–42 శ్రీ వసంత మల్లికార్జున దేవస్థానం పక్కన, బ్రాహ్మణవీధి, విజయవాడ పేరుతో ముద్రించిన విజిటింగ్ కార్డులను అందజేశారు. దీంతో పాటు ఇదే కార్డులో పెద్దదోర్నాలలోని అమ్మవారిశాల బజారులో తమ కంపెనీకి చెందిన బ్రాంచి కార్యాలయం ఉందని సైతం ముద్రించారు. డబ్బులను చెల్లించిన వారందరికీ నవంబర్ 12వ తేదీన వారు కోరుకున్న వస్తువులు పంపిణీ చేస్తామని చెప్పిన ఆగంతకులు ఇంత వరకు తిరిగి కాలనీకి రాలేదని బాధితులు వాపోయారు. విజిటింగ్ కార్డులో అజయ్‌రెడ్డి పేరుతో ఉన్న 9502581791, 7674965197 రెండు ఫోన్ నంబర్లకు ఫోన్ చేస్తే రాంగ్ నంబర్ అంటూ పెట్టేస్తున్నారని కాలనీకి చెందిన మీనిగ రంగమ్మ, కొంగని లక్ష్మీదేవి, పోలిశెట్టి నాగరత్నమ్మ, నలగండ్ల పిచ్చమ్మ, పోలిశెట్టి వెంకటమ్మ, కోనంగి కాశమ్మ, నలబోతుల పుల్లమ్మ, షేక్ రహంతుల్లా, షాకిరా,మాటా అంజమ్మ, చాముండేశ్వరిలు వాపోయారు. గత రెండు రోజుల నుంచి ఇలాగే ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. మోసగించినవారు ఏపీ 37 ఏపీ 7079 నంబరు గల ద్విచక్రవాహనాన్ని వినియోగించారని, తమ వద్ద డబ్బులు తీసుకునే సమయంలో వారిరువురిని తామ కాలనీకి చెందిన యువకులు వీడియోలు తీశారని పేర్కొంటున్నారు. కాగా కాలనీలోని సమారు 50 మంది వద్ద వసూళ్లకు పాల్పడ్డారు. అలాగే పెద్దబొమ్మలాపురంలో 50 మంది వద్ద, యర్రగొండపాలెం మండలం తమ్మడ పల్లెలో 40 మంది వద్ద ఇదే తరహాలో వసూళ్లు చేసి మోసానికి పాల్పడ్డట్టు సమాచారం. నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ఈ ముఠా సభ్యులు లక్షల్లో వసూళ్లకు పాల్పడి ఉంటారని పలువురు భావిస్తున్నారు. -
కారు కావాలా... రూ.12 లక్షలు కావాలా..
గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): ఎవరైనా హఠాత్తుగా ఫోన్ చేసి నీకు టాటా సఫారీ కారు కావాలా... పన్నెండు లక్షలు నగదు కావాలా... అని అడిగితే ఏమంటారు... ముందూ వెనుకా ఆలోచించకుండా కచ్చితంగా ఏదో ఒకదాన్ని ఎంచుకుంటారు. అలాగే ఓ యువకుడు అపరచితుని ఫోన్ ఉచ్చులో పడి వేల రూపాయలు నష్టపోయి లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. వివరాలిలా ఉన్నాయి. గోపాలపట్నం లక్ష్మీనగర్‌కు చెందిన కుప్పా ఆనంద్ అనే యువకుడు సమోసాలు అమ్ముకుని కుటుంబానికి దన్నుగా ఉంటున్నాడు. ఆ యువకుడు సంపాదనలో కొంత మొత్తాన్ని బ్యాంకులో భద్రపరచుకుంటున్నాడు. ఇదిలా ఉండగా రెండు రోజుల క్రితం షాప్‌క్లూస్ షాపింగ్ నుంచి మాట్లాడుతున్నామంటూ ఆ యువకుడికి ఫోన్ వచ్చింది. అప్పటికే ఆ యాప్ ద్వారా పలు రకాల సామగ్రి కొంటుండడంతో ఆ యువకుడు తనకు వచ్చిన ఫోన్‌ని అనుమానించలేదు. మీరు ఇంత వరకూ కొనుగోలు చేసిన వాటికి సబంధించి మీకు కారు డ్రా పలికింది. మీకు టాటా సఫారీ కారు కావాలా..? లేక రూ.12లక్షలు నగదు కావాలా..? అని అడగడంతో ఆనంద్ ఉబ్బితబ్బిబ్బయ్యాడు. తర్వాత అదే నెంబరు నుంచి ఫోన్ వచ్చింది. మీకు కావాల్సిన డబ్బులు అంత మొత్తంలో విడుదల చేయాలంటే ముందుగా పన్నులు చెల్లించాలని చెప్పడంతో నిజమేనని నమ్మేసిన ఆనంద్ తన బ్యాంకు అకౌంట్ నుంచి వారు సూచించిన రెండు అకౌంట్ నంబర్లకు రూ28,600లు బదిలీ చేశాడు. తర్వాత అనుమానం వచ్చి ఆనంద్ సంబంధిత షాప్‌క్లూస్ నిర్వాహకులకు ఫోన్ చేస్తే తాము అలాంటి డ్రాలు తీయడం లేదని స్పష్టం చేశారు. దీంతో ఆ యువకుడు కళ్లు తేలేసేశాడు. తాను దారుణంగా మోసపోయానంటూ గోపాలపట్నం పోలీస్‌స్టేషన్ సీఐ పైడియ్య ఎదుట వాపోయాడు. మోసగాడు ఫోన్ ప్రకారం ట్రూ కాలర్ పరిశీలిస్తే లక్కీ డ్రా కాంటెస్ట్ అని చూపుతోంది. ఫోన్ జార్ఖండ్ నుంచి వచ్చినట్లుగా, అకౌంట్ నంబర్లు ఢిల్లీకి చెందినవిగా తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
12 లక్షలు ఎర... 8 లక్షలు స్వాహా!
సాక్షి, సిటీబ్యూరో: ట్యాబ్ కొంటే కారు బహుమతిగా వచ్చిందట... ఆ కారు వద్దంటే దాని విలువ రూ.12 లక్షలు నగదు రూపంలో ఇస్తారట... అలా ఇవ్వడానికి ‘రిఫండబుల్ డిపాజిట్’ రూ.8 లక్షలు చెల్లించాలట... ఇది నమ్మిన ఓ ప్రభుత్వ ఉద్యోగి నిలువుగా మునిగాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ కేవీఎం ప్రసాద్ దర్యాప్తు ప్రారంభించారు. రెహ్మత్‌నగర్‌కు చెందిన అనిల్‌కుమార్ ప్రభుత్వ ఉద్యోగి. ఈయనకు మార్చ్‌లో రాజీవ్‌శర్మ అనే వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. న్యాప్‌టోల్ సంస్థ అసిస్టెంట్ అడ్మిన్ అధికారిగా పరిచయం చేసుకు న్న రాజీవ్ అసలు కథ మొదలెట్టాడు. మీరు ఇటీ వల మా సంస్థ నుంచి ఆన్లైన్లో ట్యాబ్ కొనుగోలు చేశారని, ఇలాంటి వినియోగదారుల వివరాలతో లాటరీ తీయగా మీకు లక్కీ డిప్ తగిలిం దని చెప్పాడు. బహుమతిగా రూ.12.8 లక్షల విలువైన కారు అందిస్తున్నామని, అది వద్దనుకుంటే ఆ మొత్తం చెల్లించేస్తామంటూ ఎర వేశాడు. ఈ విషయం నిజమని నమ్మిన అనిల్ తన బ్యాం కు ఖాతా వివరాలు, గుర్తింపు కార్డును వాట్సాప్ ద్వారా రాజీవ్‌కు పంపాడు. ఆ నగదు పొందడానికి రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.12 వేలు చెల్లించాలంటూ చెప్పిన రాజీవ్ అసలు కథ ప్రారంభించాడు. నిజమేనని భావించిన బాధితుడు ఆ మొత్తాన్ని రాజీవ్ చెప్పిన ఖాతాలోకి బదిలీ చేశాడు. అనిల్‌ను పూర్తిగా నమ్మించేందుకు రాజీవ్ తన పేరుతో ఉన్న ఆధార్ కార్డు, న్యాప్‌టోల్ సంస్థ జారీ చేసినట్లు ఓ గుర్తింపుకార్డులను వాట్సాప్‌లో పంపించాడు. ‘వసూలు పరంపర’లో భాగంగా రాజీవ్ ఆదాయపుపన్ను, జీఎస్టీ, ఇన్సూరెన్స్ తదితర చార్జీల పేర్లతో 14 దఫాల్లో రూ. 8.18 లక్షలు తన బ్యాంకు ఖాతాల్లో జమ చేయించుకున్నాడు. ప్రతి సందర్భంలోనూ ఈ సొమ్మంతా రిఫండబుల్ అని చెబుతూ అనిల్‌ను నమ్మించాడు. ఈ క్రమంలో బాధితుడితో రాజీవ్‌శర్మతో పాటు అతడి అనుచరులమంటూ సునీల్ చౌదరి, షానవాజ్ అనే వ్యక్తులూ సంభాషించి డబ్బు డిపాజిట్ చేయించుకున్నారు. డబ్బు చెల్లించినా తన బహుమతి మొత్తంతో పాటు రిఫండబుల్ డిపాజిట్స్ తిరిగి రాకపోవడంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న అధికారులు బ్యాంకు ఖాతాలతో పాటు ఫోన్ నెంబర్ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. -
అడ్డంగా వాడేశారు..
సాక్షి, సిటీబ్యూరో:నగరానికి చెందిన మాజీ సైనికోద్యోగికి వల వేసిన సైబర్ నేరగాళ్లు బహుమతులు, టర్కీ ట్రిప్ గెలుచుకున్నారంటూ రూ.87 లక్షలు కాజేశారు. ఆ తర్వాత అదే ముఠాకు చెందిన మరో బృందం పోగొట్టుకున్న డబ్బు తిరిగి ఇప్పిస్తామంటూ మరో రూ.29 లక్షలు స్వాహా చేసింది. మొత్తమ్మీద నాలుగేళ్లలో రూ.1.16 కోట్లు కోల్పోయిన బాధితుడు శుక్రవారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకు న్న అధికారులు బ్యాంక్ ఖాతాల వివరాలు, సాంకేతిక ఆధారాలను బట్టి దర్యాప్తు చేస్తున్నారు. ట్రిప్పు నుంచి నగదు అంటూ... సికింద్రాబాద్ లోతుకుంట ప్రాంతానికి చెందిన మాజీ సైనికోద్యోగి విఠల్ మోహన్‌రావు రైల్వే కాంట్రాక్టులు చేస్తున్నాడు. అతడికి 2014లో ‘షాప్ చెర్రీస్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ పేరుతో ఓ ఈ–మెయిల్ వచ్చింది. మీరు కొన్ని బహుమతులతో పాటు టర్కీ వెళ్లి వచ్చేందుకు ట్రిప్ గెలుచుకున్నారని, అవి క్లైమ్ చేసుకునేందుకు పూర్తి వివరాలను పంపాల్సిందిగా కోరారు. దీంతో విఠల్ తన ఫోన్ నెంబర్‌తో పాటు ఇతర వివరాలు పంపారు. ఆ తర్వాత రాహిల్ కపూర్ పేరుతో ఫోన్ చేసిన వ్యక్తి ట్రిప్‌తో పాటు బహుమతులను క్లైమ్ చేసుకునేందుకు రూ.2.4 లక్షలు చెల్లించాలంటూ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయించుకున్నాడు. కొన్ని రోజులకు రూ.25 వేలు విలువైన బహుమతులను విఠల్ చిరునామాకు పంపిన సైబర్ నేరగాళ్లు అతడికి నమ్మకం కలిగేలా చేశారు. ఆపై మరోసారి ఫోన్ చేసిన రాహిల్ టర్కీ ట్రిప్‌కు బదులుగా మీకు రూ.17 లక్షల నగదు బహుమతి ఇస్తున్నామంటూ చెప్పి రూ.3 లక్షలు జమ చేయించుకున్నాడు. ఇలా బహుమతి మొత్తాన్ని రూ.60 లక్షల వరకు పెంచేయడంతో పాటు మరో రెండు బోగస్ సంస్థలను రంగంలోకి దింపి విఠల్ నుంచి భారీ మొత్తం కాజేశారు. అనంతరం ఆర్బీఐ అధికారిగా చెప్పుకున్న రాధాకృష్ణ నాయర్ అనే వ్యక్తి బహుమతి మొత్తం రూ.80 లక్షలకు పెరిగిందని, అది క్లైమ్ కోసం తమ వద్దకు వచ్చిందంటూ నమ్మించి మరికొంత తమ ఖాతాల్లో జమ చేయించుకున్నాడు. బెంగళూరుకు ఫైల్ వచ్చిందంటూ... విఠల్‌ను మరోసారి సంప్రదించిన నాయర్ బహుమతి మొత్తం రూ.1.2 కోట్లకు పెంచడంతో పాటు క్లైమ్కు సంబంధించిన ఫైల్ బెంగళూరులోని ఆర్బీఐ కార్యాలయానికి చేరిందని, నగదు మీ ఖాతాలోకి ట్రాన్స్ఫర్ కావాలంటే పది శాతం ఇంటర్‌పోల్ చార్జెస్ చెల్లించాలంటూ చెప్పి మరికొంత డబ్బు గుంజాడు. ఈ లావాదేవీలు జరుగుతుండగానే 2016 నవంబర్‌లో డీమానిటైజేషన్ అమలులోకి రావడంతో నగదు ట్రాన్స్ఫర్ ఆలస్యం అవుతుందంటూ విఠల్‌కు చెప్పిన సైబర్ నేరగాళ్లు మరో రూ.3.2 లక్షలు కాజేశారు. ఆపై జీఎస్టీ పేరుతో మరో రూ.5.6 లక్షలు డిపాజిట్ చేయించుకున్నారు. ఓ దశలో విఠల్‌ను సంప్రదించిన ఎస్ఎం సవ్వాల్, ఆర్ఎన్ కంహార్ అనే వ్యక్తులు తాము షాప్ చెర్రీస్ సంస్థ అధిపతులమని, రాహిల్ కపూర్ పొరపాటు వల్లే నగదు చెల్లింపు ఆలస్యమైందంటూ ఆ డబ్బు తిరిగి సంస్థ ఖాతాలోకి మళ్లించి, మీకు చెల్లిస్తామంటూ ఎర వేశారు. ఇందుకుగాను రివర్ట్ చార్జీల పేరుతో మరో రూ.1.5 లక్షలు వసూలు చేశారు. ఇలా 2014–16 వరకు ఎనిమిది సంస్థల పేరుతో సంభాషించిన 18 మంది రూ.87 లక్షలు బ్యాంకు ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ చేయించుకుని కాజేశారు. ఆపై వీరిలో కొందరి ఫోన్లు స్విచ్ఛాప్ కాగా.. మరికొందరు స్పందించడం మానేశారు. ‘ఇండియా టుడే’ అంటూ మరో టీమ్... ఆ తర్వాత కొన్ని రోజులకు విఠల్‌ను సంప్రదించిన మరో ముఠా తాము ‘ఇండియా టుడే’ సంస్థ నుంచి మాట్లాడుతున్నామంటూ పరిచయం చేసుకున్నారు. రాహుల్ తదితరులు టర్కీ ట్రిప్, నగదు బహుమతి పేరు చెప్పి మీ నుంచి రూ.87 లక్షలు కాజేసిన విషయం తమ దృష్టికి వచ్చిందని, అదో భారీ స్కామ్‌గా గుర్తించామని, ఆ మొత్తం మీకు తిరిగి ఇప్పిస్తామంటూ ఎర వేశారు. గతంలో తనను సంప్రదించిన వ్యక్తుల పేర్లతో పాటు ఆ సమయంలో వారు ఏఏ కంపెనీల పేర్లు చెప్పారో చెప్పడంతో విఠల్ పూర్తిగా నమ్మాడు. ఆపై మరో ఎపిసోడ్ ప్రారంభించిన ఈ బృందం 2016–17 మధ్యలో వివిధ ట్యాక్స్‌లు, పెట్టుబడుల పేరుతో రూ.29 లక్షలు కాజేసింది. ఇలా సైబర్ నేరగాళ్లకు రూ.1.16 కోట్లు చెల్లించిన విఠల్ ఓ దశలో తీవ్ర నిరాశకు లోనై ఆత్మహత్య చేసుకునే వరకు వెళ్లాడు. సంబంధీకులు భరోసా ఇవ్వడంతో శుక్రవారం సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. అదనపు డీసీపీ కేసీఎస్ రఘువీర్ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ కేవీఎం ప్రసాద్ దర్యాప్తు చేపట్టారు. దుండగులు వినియోగించిన 37 బ్యాంకు ఖాతాలతో పాటు వారు వాడిన సెల్‌ఫోన్ నెంబర్ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ స్కామ్ మొత్తం ఢిల్లీ కేంద్రంగా సాగినట్లు ప్రాథమికంగా నిర్థారిస్తూ త్వరలో అక్కడకు ఓ ప్రత్యేక బృందాన్ని పంపాలని భావిస్తున్నారు. -
మరో మోసం!
విజయనగరం ,తెర్లాం రూరల్ :జిల్లాలోని సాలూరు, పాచిపెంట మండలాల్లోని గిరిజనులను ‘సమ్మక్క–సారక్క’ లక్కీడిప్ పేరిట మోసం చేసిన సంఘటన మరువక ముందే అదే తరహాలో తెర్లాం మండలం తమ్మయ్యవలస గ్రామానికి చెందిన పలువురు మోసానికి గురైన సంఘటన వెలుగు చూసింది. సాలూరు, పాచిపెంట మండలాల్లో ‘సమక్క–సారక్క’ పేరుతో లక్కీడిప్ లాటరీ నిర్వహించగా, తెర్లాం మండలంలో అదే వ్యక్తులు ‘శ్రీ శ్రీనివాస ఫర్నీచర్స్’ పేరుతో లక్కీడిప్ నిర్వహిస్తున్నామని ప్రజలను నమ్మబలికారు. రెండు చోట్ల వేర్వేరు పేర్లతో, వేర్వేరు లక్కీ డీప్లతో, ఒకే ఫోన్ నంబర్లతో బ్రోచర్లు ముద్రించి ప్రజలను మోసానికి గురి చేశారు. వివరాల్లోకి వెళ్తే... తెర్లాం మండలం తమ్మయ్యవలస గ్రామానికి కొన్ని వారాల క్రితం బొబ్బిలి నుంచి రాజేష్, రఘురామ్ అనే వ్యక్తులు వచ్చి తాము బొబ్బిలికి చెందిన వారమని, శ్రీ శ్రీనివాస ఫర్నీచర్స్ పేరుతో లక్కీడిప్ నిర్వహిస్తున్నామని చెప్పినట్టు బాధితులు తెలిపారు. లక్కీడిప్‌లో మొదటి వారానికి రూ.10రూపాయలు, తరువాత వాయిదాలకు డబ్బులు పెంచుకుంటూ 18 వారాల పాటు వాయిదాలు చెల్లించాలని, ఆఖరి వారం రూ.500లు చెల్లించి విలువైన బహుమతులు లాటరీ ద్వారా గెలుచుకోవాలని నమ్మబలికారన్నారు. దీంతో గ్రామానికి చెందిన సుమారు 60 నుంచి 70 మంది వరకు లక్కీడిప్‌లో చేరారు. కొన్ని వారాల పాటు నిర్వాహకులు వచ్చి డబ్బులు వసూలు చేసి వెళ్లిపోయేవారని, ఏదో ఒక గ్రామంలో లాటరీ నిర్వహించినట్లు నమ్మబలికి, తమ పేర్లకు బహుమతులు(తక్కువ ధర పలికే)వచ్చాయని, వాటిని తమకు తెచ్చి అందజేసేవారని తెలిపారు. తరువాత లక్కీడిప్ నిర్వాహకులు గ్రామానికి రావడం మానేశారన్నారు. దీంతో తాము బొబ్బిలి వెళ్లి విచారించినా వారి ఆచూకీ లేదని, బ్రోచర్లో ఉన్న నంబర్లకు ఫోన్ చేసినా పని చేయడం లేదని గ్రామానికి చెందిన బొత్స రాంబాబు తదితరులు తెలిపారు. మంగళవారం సాక్షి దినపత్రికలో సాలూరు నుంచి వచ్చిన కథనాన్ని చదవడం, అందులో ఉన్న ఫోన్ నంబర్, తమ వద్ద ఉన్న బ్రోచర్లోని ఫోన్ నంబర్ ఒకటే కావడంతో తాము మోసపోయామని గ్రహించామని వారంతా గొల్లుమన్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని గుర్తించి న్యాయం చేయాలని తమ్మయ్యవలస గ్రామస్తులు కోరుతున్నారు. -
కొంపముంచిన లక్కీడిప్
సాలూరు: వారానికి 10 రూపాయల నుంచి రూ. 500 వరకు కట్టండి.. లక్కీడిప్ లాటరీలో విలువైన వస్తువులను గెలుచుకోండని ప్రచారం చేసి గిరిజనులను మోసం చేసిన సంఘటన సాలూరు, పాచిపెంట మండలాల్లో వెలుగు చూసింది. గిరిజన గ్రామాలను లక్ష్యంగా చేసుకుని ఈ మోసానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఇద్దరు యువకులు తాము బొబ్బిలి పట్టణానికి చెందిన వారమని ‘సమ్మక్క–సారక్క’ పేరుతో లక్కీడిప్ లాటరీ నిర్వహిస్తున్నట్లు చెబుతూ గత నెలలో సాలూరు, పాచిపెంట మండలాల్లో పర్యటించారు. ఆకర్షణీయమైన బ్రోచర్లను చూపి లాటరీ ద్వారా తక్కువ మొత్తంలో విలువైన బహుమతులు గెలుచుకోవచ్చని నమ్మించారు. దీంతో చాలామంది గిరిజనులు వారి బుట్టలో పడిపోయారు. తొలివారం కేవలం 10 రూపాయలే చెల్లించాలి.. ఆ తర్వాత వారం రూ. 20.. ఇలా ప్రతి వారం పెంచుకుంటూ 18 వారాలు కట్టాల్సి ఉంటుందని మోసగాళ్లు ప్రచారం చేశారు. 200 సభ్యులకు కూడా ప్రతి వారం ఏదో ఒక బహుమతి వస్తుందని ఆశ కల్పించారు. స్టీల్ బిందెలు, టేబుల్ ఫ్యాన్లు, స్మార్ట్ఫోన్లు, డబుల్‌కాట్, బీరువాలు, ఫ్రిజ్‌లు, కుక్కర్లు, మిక్సీలు గెలుచుకోవాలని ఊదరగొట్టారు. వారానికో గ్రామంలో లాటరీ తీసి విజేతల ఇళ్లకు తీసుకువచ్చి బహుమతులు అందజేస్తామని, అలాగే లాటరీలో గెలిచిన వారు ఇకపై డబ్బులు కట్టనవసరం లేదని ప్రచారం చేయడంతో అయామక గిరిజనులు ఆకర్షితులై డబ్బులు చెల్లించారు. సాలూరు మండలంలోని నిమ్మలపాడు, గునికొండవలస, తాడిలోవ, నక్కడవలస, పెద్దవలస, నార్లవలస, చెల్లివలస, బాగువలస, బర్నికవలస, పెదపథం, గాదెవలస, పునికిలవలస, గెర్రపువలస, తదితర గ్రామాల్లో దాదాపు అన్ని కుటుంబాలూ ఈ స్కీమ్‌లో చేరారు. మొదట్లో ఒకటి, రెండు వారాలు లాటరీలు తీసి బహుమతులు అందజేసిన మోసగాళ్లు రెండు వారాలుగా కనిపించకుండా పోయారు. సాలూరు, పాచిపెంట మండలాల్లో పలు గ్రామాల బాధితుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసగాళ్లు పరారయ్యారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. రూ. 6 వేలు కట్టాను స్కీమ్‌లో భాగంగా ఆరు వేల రూపాయల వరకు కట్టాను. నాలాగే మా ఊర్లో పలువురి నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి పరారయ్యారు. ఫోన్ చేస్తే దొరకడంలేదు. బొబ్బిలి వెళ్లి వెతికినా ఫలితం లేకపోయింది. పాచిపెంటలో కూడా ఇదే తరహాలో మోసం చేసినట్లు తెలిసింది. – జన్ని సుబ్బారావు, సీతందొరవలస మోసం చేశారు బొబ్బిలి పట్టణానికి చెందిన రోహిత్, శివగా పరిచయం చేసుకుని 7416505787 ఫోన్ నంబర్ ఇచ్చి స్కీమ్‌లో చేర్పించారు. వారం, వారం డబ్బులు కట్టాను. ఇలా 8,500 రూపాయల వరకు చెల్లించాను. లాటరీ తగల్లేదని నమ్మించి, ఇప్పుడేమో కనబడకుండా పోయారు. ఫోన్ చేస్తే రాంగ్‌నంబర్ అని చెబుతున్నారు. – గడబారి శ్రీను, పెదదవలస, సాలూరు మండలం -
అదృష్టం ‘బారులా’ తెరుచుకుంది!
– ఆళ్లగడ్డ బార్‌కు అత్యధికంగా 22 మంది పోటీ – డోన్‌కు ఒక్కరే దరఖాస్తు – ఎమ్మిగనూరులో రెండు షాపులకు ఒక్క దరఖాస్తు రాని వైనం కర్నూలు (కొండారెడ్డి ఫోర్టు): జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేయనున్న బార్ లైసెన్స్‌ల ఎంపిక కోసం శుక్రవారం సునయన ఆడిటోరియంలో జాయింట్ కలెక్టర్–2 రామస్వామి, ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్చార్జ్ డిప్యూటీ కమిషనర్ సీ.శ్రీరాములు ఆధ్వర్యంలో లక్కీ డిప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మొత్తం 11 బార్ లైసెన్స్‌ల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వగా ఎనిమిదింటికి లక్కీ డిప్ ద్వారా లైసెన్స్‌లను అధికారులు ఎంపిక చేశారు. జిల్లాలోని ఆదోనిలో మూడు, ఎమ్మిగనూరులో మూడు, గూడూరు, డోన్, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, నందికొట్కూరు మునిసిపాలిటీల్లో నూతనంగా ఒక్కో బార్ ఏర్పాటు కోసం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు అన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించారు. మొత్తం 11 బార్లకు ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానించగా 9 బార్లకు మొత్తం 72 దరఖాస్తులు వచ్చాయి. - ఎమ్మిగనూరులో మొత్తం మూడు బార్లకు అనుమతి రాగా, కేవలం ఒక్కదానికే మాత్రమే మూడు దరఖాస్తులు రాగా వాల్మీకి శంకరయ్యను అదృష్టం వరిచింది. మిగిలిన రెండింటికి ఒక్క దరఖాస్తు రాలేదు. - అత్యధికంగా ఆళ్లగడ్డలో ఏర్పాటు కానున్న బార్‌కు 22 దరఖాస్తులు వచ్చాయి. ఇక్కడ లక్కీడిప్‌లో పి.తుకారం అనే వ్యక్తిని లక్కు వరించింది. - నందికొట్కూరులో 16 మందిలో ఒంకారేశ్వరెడ్డికి దక్కింది. - ఆదోని మూడింటిలో మొదటి దానికి కే.రామన్న, రెండో దానికి కేపీరాజు, మూడోదానికి రాంపుల్లయ్యకు లక్కు కలసి వచ్చింది. - ఆత్మకూరులో ఏడుగురులో విజయరవీంద్ర నాయక్, డోన్‌లో ఏకైక దరఖాస్తు దారుడు బీ.శ్రీనివాసులుగౌడ్‌ను ఎంపిక చేసినట్లు జేసీ–2 రామస్వామి ప్రకటించారు. మహిళలను వరించని విజయం.. బార్ లైసెన్స్‌లను దక్కించుకునేందుకు ముగ్గురు మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. ఆత్మకూరులో వీ.హరిత, ఆళ్లగడ్డలో వెంకటలక్ష్మీ, నందికొట్కూరు నుంచి మానస అనే మహిళలు లక్కీడిప్‌లో పాల్గొన్నారు. అయితే ముగ్గురిలో ఒకరిని కూడా లక్కు వరించలేదు. మరోవైపు బార్‌లైసెన్స్‌ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఎక్కువగా యువకులు ఉండడం గమనార్హం. దరఖాస్తులతోనే 1.42 లక్షల ఆదాయం... బార్ లైసెన్స్‌ల దరఖాస్తుల ఫీజు ప్రభుత్వానికి రూ. 1.42 లక్షల ఆదాయాన్ని సమకూర్చింది. మొత్తం 71 దరఖాస్తుల నుంచి ఒక్కో దానికి రూ. రెండు లక్షల ప్రకారం చలానాలను స్వీకరించారు. లక్కీ డిప్ ద్వారా ఎంపికైనా, ఎంపిక కాకపోయినా దరఖాస్తు కోసం చెల్లించిన రూ.2లక్షలను వెనక్కి ఇవ్వరు. డోన్‌లో చక్రం తిప్పిన డిప్యూటీ సీఎం అనుచరులు డోన్‌లో డిప్యూటీ సీఎం అనుచరులు చక్రం తిప్పడంతో బార్ లైసెన్స్ కోసం కేవలం ఒక్క దరఖాస్తు మాత్రమే రావడం గమనార్హం. దరఖాస్తు చేసుకున్నా బి.శ్రీనివాసులు గౌడ్‌కు అధికారులు లైసెన్స్‌ను మంజూరు చేశారు. – వివాదాస్పదమైన గూడూరు బార్ ఎంపిక బార్ లైసెన్స్‌లను దక్కించుకునేందుకు టీడీపీ నేతలు పోటీ పడ్డారు. గూడూరు బార్ లైసెన్స్‌ను దక్కించుకునేందుకు కోడుమూరు నియోజకవర్గ ఇన్చారీ విష్ణువర్దన్‌రెడ్డి, ఎమ్మెల్యే మణిగాంధీ ఎత్తుకు పైఎత్తులు వేశారు. ఇక్కడ బార్ ఏర్పాటు కోసం ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానించగా మొత్తం నలుగురు దరఖాస్తులు చేసుకున్నారు. అయితే దరఖాస్తుకు లోకల్ బాడీ అథారిటీ జారీ చేసే ట్రేడ్ లైసెన్స్ సర్టిఫికెట్‌ను జత చేయకపోవడంతో మణిగాంధీ అనుచరుల దరఖాస్తులన్నీ రిజెక్ట్ అయ్యాయి. విష్ణువర్దన్‌రెడ్డి అనుచరుడు కరుణాకర్‌కు మాత్రం నగర కమిషనర్ ట్రేడ్ లైసెన్స్‌ను జారీ చేయడంతో ఆయన దరఖాస్తును అధికారులు ఒకే చేశారు. అయితే కమిషనర్ తమ వాళ్లకు ట్రేడ్ లైసెన్స్‌లను జారీ చేయడంలో నిర్లక్ష్యం చేశారని ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ స్పందించి గూడూరులో ఏర్పాటు చేయనున్న బార్ లైసెన్స్ లక్కీడిప్ విజేత ఎంపిక వాయిదా వేయించారు. అయితే ఈ విషయంపై కోర్టుకు వెళ్తానని కరుణాకర్ ప్రకటించారు. డోన్‌లో ఒక దరఖాస్తు వచ్చినా లైసెన్స్ ఇచ్చారని, గూడూరులో ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. -
లక్కీడిప్‌ను అడ్డుకున్న టీఎస్ఎఫ్
కర్నూలు(అర్బన్): బెస్ట్ అవేలబుల్స్ స్కూల్్సలో గిరిజన విద్యార్థులకు సీట్లు పెంచాలని ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు ఆర్ చంద్రప్ప డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో గిరిజన చిన్నారులకు 3,5,8 తరగతుల్లో ప్రవేశం కల్పించేందుకు లక్కీడిప్ నిర్వహించారు. సీట్లు పెంచిన తర్వాత డిప్ నిర్వహించాలంటూ టీఎస్ఎఫ్ నాయకులు అడ్డుకున్నారు. విద్యార్థుల ఆవేదనను ప్రభుత్వానికి తెలియజేస్తామని, ప్రవేశాలకు ఆటంకం కలిగించవద్దని జేసీ–2 ఎస్ రామస్వామి కోరారు. ఈ సందర్భంగా చంద్రప్ప మాట్లాడుతూ 2015–16లో 115 సీట్లు కేటాయించిన ప్రభుత్వం ప్రస్తుతం 56 సీట్లతో సరిపెట్టడం దారుణమన్నారు. గతేడాది మిగిలిపోయిన 21 సీట్లు, 10వ తరగతి పూర్తి చేసిన 19 మంది విద్యార్థుల సీట్లను కలుపుకొని 56 సీట్లను కేటాయించడం గిరిజన చిన్నారులను మోసం చేయడమేనన్నారు. బీఏఎస్‌లో గిరిజన విద్యార్థులకు సీట్లు పెంచేంతవరకు పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. టీఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పీ వెంకటేష్, ఉపాధ్యక్షుడు ఆర్ రామరాజు, అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర పాల్గొన్నారు. -
పుల్లమ్మకు రూ.లక్ష బహుమతి
- నగదు రహిత లావాదేవీల్లో భాగంగా ప్రోత్సాహకం కర్నూలు(అగ్రికల్చర్): ప్రజాపంపిణీలో నగదు రహిత లవాదేవీలు నిర్వహించిన మహిళకు రూ.లక్ష రూపాయల నగదు బహుమతి లభించింది. ప్రజాపంపిణీలో నగదు రహితాన్ని ప్రోత్సహించేందుకు పౌరసరఫరాల శాఖ ప్రతి నెలా ప్రోత్సాహక బహుమతులను ప్రకటిస్తోంది. డిప్ ద్వారా కార్డుదారులను ఎంపిక చేస్తోంది. మార్చి నెలలో నగదు రహిత లావాదేవీలు నిర్వహించిన వారిలో లాటరీ ద్వారా విజయవాడలో శనివారం కార్డుదారులను ఎంపిక చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో నందికొట్కూరు మండలం కొనిదెల గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ చందమాల పుల్లమ్మ( కార్డు నెంబరు డబ్ల్యూఏపీ 130802000313)కు రూ.లక్ష నగదు బహుమతి లభించిందని అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్రం మొత్తం మీద 5వేల మంది కార్డుదారులు స్మార్ట్ఫోన్లకు ఎంపిక కాగా ఇందులో జిల్లాకు సంబంధించి 330 మంది ఉన్నారని అధికారులు తెలిపారు. నగదు రహితంలో కర్నూలు జిల్లా ఫస్ట్ ప్రజాపంపణీలో నగదు రహిత లావాదేవీలు నిర్వహించడంలో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. శనివారం సాయంత్రానికి 19,046వేల కార్డులకు సరుకులు ఇవ్వగా నగదు రహితంపై 4,797 కార్డులకు సరుకులు పంపిణీ చేశారు. -
లక్కీడిప్ నిర్వాహకుల అరెస్టు
– రూ.1.25 లక్షల నగదు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం ఓర్వకల్లు ఎస్ఐ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఓర్వకల్లు: సామాన్య ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని లక్కీడిప్ నిర్వహిస్తున్న నలుగురిని పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. వీరు ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారో ఇన్చార్జ్ డీఎస్పీ వినోద్‌కుమార్, తాలుకా రూరల్ సీఐ నాగరాజు యాదవ్ బుధవారం ఓర్వకల్లు పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మండలంలోని సోమయాజులపల్లె పరిసర ప్రాంతాల్లో గత కొన్ని నెలల నుంచి లక్ష్మీసాయి ఎంటర్ ప్రైజేస్ పేరుతో లక్ష్మి బంపర్ డ్రాను ఏర్పాటు చేశారు. డ్రాలో పేరు వచ్చిన వారికి విలువైన బహుమతులు ఇస్తామని ఆశపెట్టి ప్రజల నుంచి నెలవారి కంతుల రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారమందింది. దీంతో ఓర్వకల్లు ఎస్ఐ చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఉల్లిందకొండ, నాగలాపురం ఎస్ఐలు వెంకటేశ్వరరావు, మల్లికార్జున ప్రత్యేక బృందాలుగా ఏర్పడి మండలంలోని సోమయాజులపల్లె, ఓర్వకల్లు గ్రామాల్లో దాడులు నిర్వహించారు. దాడుల్లో లక్కీ డిప్ నిర్వహణకు సంబంధించిన పలు రికార్డులు, ఆధారాలు లభించాయి. సోమయాజులపల్లె గ్రామానికి చెందిన డిప్ నిర్వాహకులు వీరభద్రాచారి అలియాస్ భద్రి, మహేశ్వరరెడ్డి, చెన్నంచెట్టిపల్లి గ్రామానికి చెందిన నరసింహులు, తిప్పాయిపల్లె శంకర్, ఆ సంస్థ ఓర్వకల్లు ఏజెంట్ గోపాల్‌ను అదుపులోకి తీసుకోవడంతో పాటు వారి నుంచి రూ. 1.25 లక్షల నగదు, మూడు సెల్ఫోన్లు సా్వధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. ఇదిలా ఉంటే మండలంలో ప్రాతిని«ధ్యం వహిస్తున్న అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్య నాయకుడి అండదండలతో ఈ లక్కీడిప్ నడుస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. -
‘లక్కీ డిప్’ ముఠా దొరికింది
- ఐదుగురు నిందితు అరెస్ట్ – రూ.4,15,250 స్వాధీనం – రశీదు బుక్‌లు, అకౌంట్ రిజిస్టర్, కలెక్షన్ బుక్స్, అగ్రిమెంట్ కాగితాలు సీజ్ కర్నూలు : లక్కీ డిప్ల పేరుతో ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా ఐదుగురు సభ్యులను నంద్యాల పోలీసులు అరెస్టు చేశారు. వారివద్ద నుంచి రూ.4,15,250 నగదుతో పాటు అగ్రిమెంట్ కాగితాలు, రశీదు బుక్‌లు, రిజిస్టర్ అకౌంట్ బుక్‌లు, నెలసరి కలెక్షన్ బుక్‌లు, ఇతర ఇంటి సామగ్రిని స్వాధీనం చేసుకుని ఎస్పీ ఆకే రవికృష్ణ ఎదుట హాజరుపరిచారు. నంద్యాల డీఎస్పీ హరినాథరెడ్డితో కలసి శనివారం మధ్యాహ్నం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో నిందితులను మీడియా ఎదుట హాజరుపరిచి ఎస్పీ ఆకే రవికృష్ణ వివరాలను వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా సిద్ధిపేట మండలం నర్సాపురం గ్రామానికి చెందిన గర్రిపల్లి కనకరాజు నాలుగు సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం బనగానపల్లె మండలం పలుకూరు గ్రామానికి వలస వచ్చాడు. పెట్రోల్ బంకులో కొంతకాలం పనిచేశాడు. సాయిమిత్ర హోమ్ నీడ్స్ పేరుతో ఒక దుకాణం ప్రారంభించి ఇంటికి ఉపయోగపడే వస్తువులు టీవీ, ఫ్రిడ్జ్, మంచం, ఇతర సామాన్లను నగదుకు, నెలవారి కంతులకు ఇచ్చేలా వ్యాపారం మొదలుపెట్టి ప్రజలను నమ్మించాడు. 2015 సంవత్సరం ఫిబ్రవరి నెలలో మొదటి స్కీమ్ ప్రారంభించి ఒక్కొక్క స్కీమ్ 9 నెలలు ఉండే విధంగా, నెలకు రూ.999 ప్రకారం మొదటి స్కీమ్‌లో 300 మందికి చేర్చుకుని వారికి బహుమతులు, వస్తువులు, నగదు రూపంలో చెల్లించి ప్రజలను నమ్మించాడు. రెండవ, మూడవ స్కీమ్‌ల నందు ఏజెంట్ల ద్వారా పలుకూరు, చుట్టుప్రక్కల గ్రామాల్లో సభ్యులను చేర్చుకుని సుమారు 394 మంది సభ్యులను చేర్చుకుని రూ.17,84,000 డబ్బు వసూలు చేసి బోర్డు తిప్పేసి పారిపోయేందుకు సిద్ధమైనట్లు ఎస్పీ ఆకే రవికృష్ణకు అజ్ఞాత వ్యక్తులు సమాచారం అందించారు. ఆయన ఆదేశాల మేరకు నంద్యాల పోలీసులు శుక్రవారం సాయంత్రం పలుకూరు ఆర్చి(ముఖద్వారం) వద్ద గర్రిపల్లి కనకరాజుతో పాటు పల్లపు శివరామకృష్ణ, చాకలి పెద్దయ్య, ఎర్రగొండ చిన్నకృష్ణ, జూట్ల నాగరాజు (వీరందరిదీ పలుకూరు గ్రామం)ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. సమాచారం ఇస్తే సుమొటో కింద కేసు నమోదు: ఎస్పీ మనీ సర్కులేషన్ పేరుతో ప్రజల నుంచి చట్టవిరుద్ధంగా డబ్బులు వసూలు చేసేవారి సమాచారమిస్తే సుమొటో కింద కేసు నమోదు చేస్తాం. ఇలాంటి స్కీములు చట్ట వ్యతిరేకం. ఆకర్షణీయ బహుమతుల పేరుతో డబ్బులు వసూలు చేసి పారిపోతారని, ఇలాంటివారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా పేద, మధ్యతరగతి వారు ఇలాంటి స్కీముల వల్ల ఎక్కువగా నష్టపోతారు. పలుకూరులో కూడా గని కార్మికులు ఎక్కువమంది నష్టపోయారు. -
లక్కు ఎవరిదో!
ఎంత పెట్టుబడి పెట్టినా నష్టం రానిది మద్యం వ్యాపారం. అందుకే షాపులకోసం అన్ని వేల మంది పోటీ పడుతుంటారు. జిల్లాలో 410 మద్యం దుకాణాల నిర్వహ ణ కోసం ఏకంగా మూడువేల మందికి పైగా దరఖాస్తులు వేశారంటే ఎంత ఆదా యం ఉందో అర్థమయిపోతోంది. దరఖాస్తులు వేసిన వారందరికీ దుకాణాలు రావు. కాస్త అదృష్టం కూడా ఉండాలి. ఈ అదృష్టం ఎవరిని వరిస్తుందో సోమవారం తేలనుంది. లక్కీడిప్ పద్ధతిలో దుకాణాలు కేటాయిస్తారు. ఇందుకోసం ఎక్సైజ్ అధికారులు ఏర్పాట్లు చేశారు. - నేడు మద్యం దుకాణాల కేటాయింపు - పీవీకేఎన్ కళాశాలలో ఏర్పాట్లు పూర్తి - తొలి విడతలో 320దుకాణాలకే దరఖాస్తులు - 90 దుకాణాలకు పడని టెండర్లు - దరఖాస్తు రుసుంతో రూ.12 కోట్ల ఆదాయం చిత్తూరు (అర్బన్): జిల్లాలోని మద్యం దుకాణాల కోసం నిర్వహించే లక్కీడిప్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. చిత్తూరు నగరంలోని పీవీకేఎన్ డిగ్రీ కళాశాలలో లాటరీ పద్ధతిలో దుకాణాల కేటాయిస్తారు. కలెక్టర్, ఎక్సైజ్ అధికారుల సమక్షంలో ఈ వ్యవహారం జరుగుతుంది. ఉదయం 10.30 గం టల నుంచి సర్కిళ్ల వారీగా దుకాణాలకు లాటరీ తీస్తారు. దరఖాస్తులన్నింటినీ టెండరు బాక్సుల్లోంచి బయటకు తీసి, వాటికి టోకెన్ నంబర్లు కేటాయిస్తారు. వీటిని ఒక డబ్బాలో వేసి ప్రతి దుకాణానికీ మూడు టోకెన్లు బయటకు తీస్తారు. ఇందులో తొలిగా వచ్చిన టోకెన్ నంబర్ వారికి దుకాణం కేటాయిస్తారు. ఇతను ఆ దుకాణం లెసైన్సు ఫీజులో 1/3 వంతు నగదును సాయంత్రం లోపు అధికారులకు చెల్లిస్తే, మంగళవారం ప్రొవిజన్ లెసైన్సు జారీ చేస్తారు. అలా చెల్లించకున్నా, తనకు దుకాణం వద్దని చెప్పినా, రెండోసారి వచ్చిన టోకెను నెంబరు ఆధారంగా మరో వ్యక్తికి, అతనూవద్దనుకుంటే మూడోసారి వచ్చిన వ్యక్తికి కేటాయిస్తారు. అతను వద్దనుకుంటే సం బంధిత దుకాణానికి రీ-టెండరు నిర్వహిస్తారు. 90 దుకాణాలకు నిల్... జిల్లాలో 410 మద్యం దుకాణాల్లో 320 దుకాణాలకు మాత్రమే టెండర్లు పడ్డాయి. 90 దుకాణాలకు ఒక్క టెండరు కూడా పడలేదు. ఈ ప్రాం తాల్లో వ్యాపారం జరగదనే ఉద్దేశంతోనే ఎవరూ ముందుకురాలేదని తెలుస్తోంది. 320 దుకాణాలకు 3,048 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు రుసుం ద్వారా జిల్లాలో తొలి విడతగా ప్రభుత్వానికి రూ.12 కోట్ల ఆదాయం లభించింది. దరఖాస్తులు పడని దుకాణాలు ఇవే.. దరఖాస్తులు పడని దుకాణాల్లో చిత్తూరు ఎక్సైజ్ పరిధిలో చిత్తూరు అర్బన్ స్టేషన్‌లోని 4, రూరల్‌లో 4, కార్వేటినగరంలో 3, మదనపల్లెలో 3, మొలకలచెరువులో 4, పుంగనూరులో 7, పలమనేరులో 9, వాల్మీకిపురంలో 4, పీలేరులో 4 ఉన్నాయి. మిగిలిన 147 దుకాణాలకు 1,418 దరఖాస్తులు వచ్చాయి. తిరుపతి ఎక్సైజ్ పరిధిలో దరఖాస్తులు రానివి తిరుపతి అర్బన్‌లో 3, రూరల్‌లో 4, పాకాలలో 13, పుత్తూరులో 8, శ్రీకాళహస్తిలో 2, సత్యవేడులో 7, నగరిలో 10 ఉన్నాయి. మిగిలిన 173 దుకాణాలకు 1,556 దరఖాస్తులు వచ్చాయి. గత ఏడాది జిల్లాలో 458 దుకాణాల్లో 70తీసుకోవడానికి ఎవరూ ముందురాలేదు. ఈ సారి 70 దుకాణాలతో పాటు అదనంగా మరో 20కి దరఖాస్తులు పడకపోవడంతో రీ-టెండర్ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. అప్పటికీ ఎవరూ రానిపక్షంలో వీటి స్థానంలో ప్రభుత్వ మద్యం దుకాణాలు వెలుస్తాయి. -
లక్కీ డిప్ పద్దతిని తప్పుపడుతున్న భక్తులు
-
లక్కీడిప్‌లో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కేటాయింపు
సాక్షి, తిరుమల: శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను లక్కీడిప్ (కంప్యూటర్ ర్యాండమ్)లో కేటాయించే పద్ధతిని శనివారం తిరుమల జేఈవో కె.ఎస్.శ్రీనివాసరాజు ప్రారంభించారు. 2010 నుంచి ఇప్పటివరకు ఇదే లక్కీడిప్ పద్ధతిలో తోమాల, అర్చన, అభిషేకం, మేల్‌ఛాట్ వస్త్రం వంటి అరుదైన ఆర్జిత సేవా టికెట్లు కేటాయిస్తున్నారు. తాజాగా నిత్యసేవలైన సుప్రభాతం (100 టికెట్లు), కల్యాణోత్సవం (80), వారపు సేవలైన విశేషపూజ (సోమవారం- 125), సహస్ర కలశాభిషేకం (మంగళవారం-25), తిరుప్పావడసేవ (గురువారం-25), నిజపాద దర్శనం ( శుక్రవారం-100) టికెట్లు కేటాయించారు. టికెట్లను పారదర్శకంగా కేటాయించడంతోపాటు గంటల తరబడి క్యూలో నిలబడకుండా ఉండేందుకు లక్కీడిప్ పద్ధతిని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు జేఈవో శ్రీనివాసరాజు, డిప్యూటీ ఈవో వేణుగోపాల్ చెప్పారు. -
జోయాలుక్కాస్ బంగారు ఉత్సవాల విజేతలు
తిరుపతి కల్చరల్/చిత్తూరు (సిటీ): తిరుప తి, చిత్తూరు నగరాల్లోని జోయాలుక్కాస్ బంగారు ఆభరణాల విక్రయ షోరూమ్‌లలో విడివిడిగా నిర్వహించిన బంగారు ఉత్సవాల్లో భాగంగా శనివారం లక్కీడిప్ విజేతలను ఎంపికచేశారు. మొదటి బహుమతి 8 గ్రాముల బంగారు, ద్వితీయ, తృతీ య, నాలుగో బహుమతులు పొందిన వారికి ఒక్కొక్కరికి నాలుగు గ్రాముల బంగారు చొప్పున అందజేస్తారు. జోయాలుక్కాస్ షోరూమ్‌లలో గత నెల 2 నుంచి ఈనెల 20వ తేదీ వరకు వినియోగదారుల సౌకర్యార్థం బంగారు ఉత్సవాలు నిర్వహిం చారు. ఇందులో భాగంగా వినియోగదారు లు అందించిన కూపన్ల ద్వారా తిరుపతి, చిత్తూరు షోరూంలలో లక్కీడిప్‌లు నిర్వహించారు. తిరుపతిలో ట్రాఫిక్ డీఎస్పీ సుబ్బన్న ముఖ్య అతిథిగా పాల్గొని లక్కీడిప్ తీసి విజేతలను ప్రకటించారు. బిఆర్.చంద్రవేలు(రేణిగుంట) ప్రథమ బహుమ తి, ఎస్.రత్నమ్మ(తిరుపతి), దామోదర్ హసీ(పుత్తూరు), కె.హేమాద్రి(తిరుపతి) ద్వితీయ, తృతీయ, నాలుగో బహుమతు లు గెలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ టిజె.రఫీ పాల్గొన్నారు. చిత్తూరు హైరోడ్డులోని షోరూంలో నగరపాలక సంస్థ కమిషనర్ రాజేంద్రప్రసాద్ డ్రా తీసి విజేతలను ఎంపిక చేశారు. కే.వేణుగోపాల్(చిత్తూరు) మొదటి బహుమతి, ద్వితీయ, తృతీయ, నాలుగో బహుమతులను పి.హి తేష్(చిత్తూరు), పీ.శశికళ(చిత్తూరు), ఎస్.ఈశ్వరరావు(మదనపల్లె) గెలుచుకున్నారు. ఈ సందర్భంగా షోరూమ్ మేనేజర్ దేవదాసన్ మాట్లాడుతూ ఈనెల 28న తమ సంస్థ బ్రాండ్ అంబాసిడర్, నటుడు అల్లు అర్జున్ హైదరాబాదులోని షోరూమ్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలోని షోరూమ్‌లలో మిగిలిన కూపన్ల నుంచి గ్రాండ్ డ్రా తీసి ఒకరిని ఎంపిక చేస్తారని వెల్లడించారు. ఇలా ఎంపికైన వారికి బీఎండబ్ల్యూ-3 సీరీస్ కారును బహూకరిస్తామని తెలి పారు. ఈ కార్యక్రమంలో షోరూమ్ అసిస్టెంట్ మేనేజర్ జీసింట్, పీఆర్వో ఢిల్లీబాబు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ రాజేష్, సిబ్బంది పాల్గొన్నారు. విజేతలు తమ కూపన్లను మేనేజర్‌కు చూపించి బహుమతులను తీసుకుపోవచ్చని సూచించారు. -
408 మద్యం షాపులకు లెసైన్స్
- 154 షాపులకు దరఖాస్తులు నిల్ - 80 షాపులకు ఒకే ఒక్క దరఖాస్తు - దరఖాస్తు రుసుం ద్వారా రూ. 14.89 కోట్ల ఆదాయం కాకినాడ క్రైం : జిల్లాలో 562 మద్యం షాపులకు గాను 408 షాపులకు మాత్రమే లెసైన్స్‌లు మంజూరయ్యాయి. లక్కీడిప్ ద్వారా వ్యాపారులకు ఈ షాపులను కేటాయించారు. జిల్లాలో 555 మద్యంషాపులు ఉండగా రాష్ట్ర విభజన నేపథ్యంలో భద్రాచలం డివిజన్లోని 7 షాపులు కొత్తగా చేరాయి. దాంతో వీటి సంఖ్య 562కు చేరింది. 154 షాపులకు దరఖాస్తులేవీ అందలేదు. రెండేళ్ల క్రితం జారీ చేసిన మద్యంషాపుల లెసైన్స్‌ల గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుండడంతో కొత్తగా లెసైన్స్‌ల మంజూరుకు ఈ నెల 23 నుంచి 27వ తేదీ వరకూ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు దరఖాస్తులను స్వీకరించిన సంగతి తెలిసిందే. గతసారి 555 షాపులకు దరఖాస్తులు ఆహ్వానించగా 434 షాపులకు 4500 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ దఫా 562 షాపులకుగాను 408 షాపులకు మాత్రమే 5,957 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాజమండ్రి డివిజన్లో 96 షాపులకు 1,654, కాకినాడ డివిజన్లో 149 షాపులకు 2,563, అమలాపురం డివిజన్లో 163 షాపులకు 1,740 దరఖాస్తులు అందాయి. కాకినాడ నార్త్ స్టేషన్ పరిధిలోని ఒక షాపునకు అత్యధికంగా 117 దరఖాస్తులు వచ్చాయి. రాజమండ్రి డివిజన్లో15 షాపులకు, కాకినాడ డివిజన్లో 23 షాపులకు, అమలాపురం డివిజన్లో 42 షాపులకు ఒక్కో దరఖాస్తు మాత్రమే వచ్చాయి. భద్రాచలంలోని ఏడు షాపులకు గాను రెండు షాపులకు మాత్రమే దరఖాస్తులు అందాయి. మిగిలిన 154 షాపులకు మరోమారు దరఖాస్తులు ఆహ్వానించవచ్చని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది కేవలం మద్యంషాపుల దరఖాస్తుల ద్వారానే ప్రభుత్వానికి రూ. 14.89 కోట్ల ఆదాయం లభించింది. లక్కీడిప్ ద్వారా కేటాయింపు మద్యం షాపుల లెసైన్స్‌లను లక్కీడిప్ ద్వారా వ్యాపారులకు కేటాయించారు. కాకినాడ అంబేద్కర్ భవన్లో భారీ ఏర్పాట్ల మధ్య శనివారం డీఆర్ఓ బి. యాదగిరి రాజమండ్రి డివిజన్లోని షాపులకు లక్కీ డ్రా తీశారు. అలాగే కాకినాడ డివిజన్‌కు కాకినాడ ఆర్డీఓ అంబేద్కర్, అమలాపురం డివిజన్‌కు జెడ్పీ సీఈఓ భగవాన్ లక్కీడిప్ తీశారు. లక్కీ డిప్లో షాపులు దక్కించుకున్న వారికి ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ లెసైన్స్‌లు అందజేశారు. భారీ బందోబస్తు జిల్లా నలుమూలల నుంచి సుమారు ఆరు వేల మంది వ్యాపారులు, వారి అనుచరులు కాకినాడ అంబేద్కర్ భవన్‌కు చేరుకోవడంతో డీఎస్పీ రామిరెడ్డి విజయభాస్కర రెడ్డి నేతృత్వంలో సీఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పాతబస్టాండు సెంటర్ నుంచి వార్ఫు రోడ్డు మీదుగా ట్రాఫిక్ మళ్లించారు. -
మోడల్ స్కూళ్లకు విద్యార్థుల ఎంపిక
కర్నూలు(ఓల్డ్‌సిటి), న్యూస్‌లైన్ : కల్లూరు మండలంలోని పెద్దపాడు గ్రామ సమీపంలో ఉన్న ఏపీ మోడల్ స్కూల్లో మంగళవారం విద్యార్థుల ఎంపికకు సంబంధించి లక్కీడిప్ తీశారు. జిల్లాలోని 32 మండలాల్లో ఏపీ మోడల్ స్కూల్స్ ఉన్నాయి. అందులో మంగళవారం 16 పాఠశాలలకు సంబంధించి విద్యార్థులను, బుధవారం 16 పాఠశాలలకు చెందిన విద్యార్థులను ఎంపిక చేయనున్నట్లు ముందే ప్రకటించారు. దీంతో మంగళవారం ఉదయం సి.బెళగల్, కల్లూరు, గూడూరు, మిడ్తూరు, ఓర్వకల్లు, బనగానపల్లి, ఆస్పరి, మంత్రాలయం, మండలాల పాఠశాలల ఎంపిక చేపట్టారు. ఒక్కో మండలం ఎంపికను ఒక్కో గదిలో నిర్వహించారు. మధ్యాహ్నం నందవరం, పత్తికొండ, పెద్దకడబూరు, ఎమ్మిగనూరు, ఆలూరు, కోడుమూరు, మద్దికెర, గోనెగండ్ల మండలాల విద్యార్థులకు లక్కీడిప్ నిర్వహించారు. సి.బెళగల్ మండల మోడల్ స్కూల్ లక్కీడిప్ కార్యక్రమాన్ని అదనపు జాయింగ్ కలెక్టర్ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మోడల్ స్కూల్‌కూ 80 సీట్లు కేటాయించగా 16 మందిని వెయిటింగ్ లిస్టులో ఉంచినట్లు తెలిపారు. 80 మందిలో అనివార్యకారణాలతో ఎవరైనా హాజరు కాకపోతే వెయిటింగ్ లిస్టులో ఉన్న 16 మందికి అవకాశం కల్పిస్తారన్నారు. సెలెక్ట్ అయిన విద్యార్థులు ఈ నెల 30 నుంచి వచ్చే నెల 6 లోపు పాఠశాలలో ఒరిజినల్ సర్టిఫికెట్స్ అందజేయాలని లేక పోతే ఆ విద్యార్థి సీటు క్యాన్సిల్ అవుతుందని తెలిపారు. ఏపీ మోడల్ స్కూళ్లు గతేడాది ప్రారంభించగా అప్పుడు తక్కువ దరఖాస్తులు వచ్చాయని అన్నారు. ఈ సంవత్సరం ప్రతి మండలానికి 80 సీట్లు ఉండగా 200కుపైగా అప్లికేషన్స్ రావడం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఈ సంవత్సరం ఏపీ మోడల్స్కూల్లో వచ్చిన ఫలితాలు పట్లా అశోక్‌కుమార్ ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పెద్దపాడు ఏపీ మోడల్ స్కూలు పాఠశాల ప్రిన్సిపాల్ జాస్మిన్, తదితరులు పాల్గొన్నారు. తల్లిదండ్రులు, విద్యార్థులకు తప్పని తిప్పలు కౌన్సెలింగ్ నిర్వహించే ఏపీ మోడల్ స్కూలు నగరశివారులో ఉండడం వ ల్ల జిల్లా నలుమూలల నుంచి వచ్చిన తల్లిదండ్రులు, పిల్లలు ఇబ్బందులు పడ్డారు. ప్రధాన రహదారికి కిలోమీటర్ దూరంలో స్కూల్ ఉండడంతో చిన్న పిల్లలు ఎండలో నడవలేక తీవ్ర అవస్థలు పడ్డారు. జిల్లాలో మొత్తం 52 మండలాలు ఉండగా కేవలం 32 మండలాలకే మోడల్ స్కూళ్లు పెట్టారని, మిగిలిన మండలాల్లోనూ ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. కల్లూరు మండలానికి సంబంధించిన లక్కీడిప్‌లో స్వల్ప గందరగోళం చోటు చేసుకుంది. బాలికల జనరల్‌లో ఒకే నంబర్ రెండు సార్లు రిపీట్ కావడంతో గుర్తించిన తల్లిదండ్రలు ఆందోళనకు దిగారు. వెంటనే అదనపు సంయుక్త కలెక్టర్ అశోక్‌కుమార్ చొరవ తీసుకుని పరిస్థితిని చక్కదిద్దారు.