ఆగంతులకు డబ్బులు చెల్లించిన బాధితులు
ప్రకాశం, పెద్దదోర్నాల: కొంత మొత్తాన్ని చెల్లిస్తే రూ. 50 వేల విలువ చేసే ప్లాస్మా టీవీలు, డబుల్ కాట్ మంచాలను అందిస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఘరానా మోసానికి పాల్పడ్డారు. ఈ మోసం మండల కేంద్రంలోని సుందరయ్య కాలనీలో కొద్ది రోజులు క్రితం చోటు చేసుకోగా మంగళవారం వెలుగు చూసింది. మోసానికి గురైన వారంతా తోపుడు బండ్ల మీద చిరు వ్యాపారాలు చేసుకునే వారు, హోటళ్లలో అంట్లు తోముకు బతికే వారు, వ్యవసాయ పనులు చేసుకుంటూ నెట్టుకొచ్చే వారే. ఇలా రోజు వారీ సంపాదనతో జీవితాలను గడుపుకుంటూ జీవనం సాగించే వీరి అవసరాలను, అమాయకత్వాన్ని అసరాగా తీసుకున్న కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నమ్మించి మోసగించారు. ఒక్కసారిగా అంత పెద్ద వస్తువులు తామెలాగూ కొనలేమని, కష్టమో, నష్టమో కొంత నగదును చెల్లిస్తే తమకు కావలిసిన వస్తువులు తీసుకొని వాయిదాల పద్ధతిలో కట్టుకోవచ్చు అనుకున్న అమాయకులు వారి మాయమాటలకు మోసపోయారు. అడిగిందే తడువుగా ఒక్కొక్కరు తాము కూలీ పనులు చేసుకుని సంపాందించిన డబ్బులను వారి చేతిలో పెట్టారు. పలానా తేదీన వచ్చి మీరు కోరుకున్న వస్తువులు ఇస్తామని చెప్పటంతో ఆ తేదీ కోసం ఆశగా ఎదురు చూశారు. తీరా చూస్తే ఆ మోసగాళ్లు పెట్టిన గడువు తీరిపోయింది. దీంతో మోసపోయామని గుర్తించిన శ్రామికులు లబోదిబోమన్నారు.
నమ్మించేందుకు కుక్కర్ల అందజేత..
మండల కేంద్రంలోని సుందరయ్య కాలనీలోకి వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు తాము వాయిదాల పద్ధతిలో ప్లాస్మా టీవీలను, డబుల్ కట్ మంచాలను ఇస్తామని, అవసరమైన వారు 2700 రూపాలయలు చెల్లించాలని సూచించారు. వారికి తొలుత రైస్ కుక్కర్ ఇస్తామని చెప్పి అలాగే అందజేశారు. విజయదుర్గ హోమ్ ఫైనాస్స్, డోర్ నెం 16–19–42 శ్రీ వసంత మల్లికార్జున దేవస్థానం పక్కన, బ్రాహ్మణవీధి, విజయవాడ పేరుతో ముద్రించిన విజిటింగ్ కార్డులను అందజేశారు. దీంతో పాటు ఇదే కార్డులో పెద్దదోర్నాలలోని అమ్మవారిశాల బజారులో తమ కంపెనీకి చెందిన బ్రాంచి కార్యాలయం ఉందని సైతం ముద్రించారు. డబ్బులను చెల్లించిన వారందరికీ నవంబర్ 12వ తేదీన వారు కోరుకున్న వస్తువులు పంపిణీ చేస్తామని చెప్పిన ఆగంతకులు ఇంత వరకు తిరిగి కాలనీకి రాలేదని బాధితులు వాపోయారు. విజిటింగ్ కార్డులో అజయ్‌రెడ్డి పేరుతో ఉన్న 9502581791, 7674965197 రెండు ఫోన్ నంబర్లకు ఫోన్ చేస్తే రాంగ్ నంబర్ అంటూ పెట్టేస్తున్నారని కాలనీకి చెందిన మీనిగ రంగమ్మ, కొంగని లక్ష్మీదేవి, పోలిశెట్టి నాగరత్నమ్మ, నలగండ్ల పిచ్చమ్మ, పోలిశెట్టి వెంకటమ్మ, కోనంగి కాశమ్మ, నలబోతుల పుల్లమ్మ, షేక్ రహంతుల్లా, షాకిరా,మాటా అంజమ్మ, చాముండేశ్వరిలు వాపోయారు. గత రెండు రోజుల నుంచి ఇలాగే ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. మోసగించినవారు ఏపీ 37 ఏపీ 7079 నంబరు గల ద్విచక్రవాహనాన్ని వినియోగించారని, తమ వద్ద డబ్బులు తీసుకునే సమయంలో వారిరువురిని తామ కాలనీకి చెందిన యువకులు వీడియోలు తీశారని పేర్కొంటున్నారు. కాగా కాలనీలోని సమారు 50 మంది వద్ద వసూళ్లకు పాల్పడ్డారు. అలాగే పెద్దబొమ్మలాపురంలో 50 మంది వద్ద, యర్రగొండపాలెం మండలం తమ్మడ పల్లెలో 40 మంది వద్ద ఇదే తరహాలో వసూళ్లు చేసి మోసానికి పాల్పడ్డట్టు సమాచారం. నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ఈ ముఠా సభ్యులు లక్షల్లో వసూళ్లకు పాల్పడి ఉంటారని పలువురు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment