సాక్షి, సిటీబ్యూరో: ట్యాబ్ కొంటే కారు బహుమతిగా వచ్చిందట... ఆ కారు వద్దంటే దాని విలువ రూ.12 లక్షలు నగదు రూపంలో ఇస్తారట... అలా ఇవ్వడానికి ‘రిఫండబుల్ డిపాజిట్’ రూ.8 లక్షలు చెల్లించాలట... ఇది నమ్మిన ఓ ప్రభుత్వ ఉద్యోగి నిలువుగా మునిగాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ కేవీఎం ప్రసాద్ దర్యాప్తు ప్రారంభించారు. రెహ్మత్‌నగర్‌కు చెందిన అనిల్‌కుమార్ ప్రభుత్వ ఉద్యోగి. ఈయనకు మార్చ్‌లో రాజీవ్‌శర్మ అనే వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. న్యాప్‌టోల్ సంస్థ అసిస్టెంట్ అడ్మిన్ అధికారిగా పరిచయం చేసుకు న్న రాజీవ్ అసలు కథ మొదలెట్టాడు. మీరు ఇటీ వల మా సంస్థ నుంచి ఆన్‌లైన్‌లో ట్యాబ్ కొనుగోలు చేశారని, ఇలాంటి వినియోగదారుల వివరాలతో లాటరీ తీయగా మీకు లక్కీ డిప్ తగిలిం దని చెప్పాడు.
బహుమతిగా రూ.12.8 లక్షల విలువైన కారు అందిస్తున్నామని, అది వద్దనుకుంటే ఆ మొత్తం చెల్లించేస్తామంటూ ఎర వేశాడు. ఈ విషయం నిజమని నమ్మిన అనిల్ తన బ్యాం కు ఖాతా వివరాలు, గుర్తింపు కార్డును వాట్సాప్ ద్వారా రాజీవ్‌కు పంపాడు. ఆ నగదు పొందడానికి రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.12 వేలు చెల్లించాలంటూ చెప్పిన రాజీవ్ అసలు కథ ప్రారంభించాడు. నిజమేనని భావించిన బాధితుడు ఆ మొత్తాన్ని రాజీవ్ చెప్పిన ఖాతాలోకి బదిలీ చేశాడు. అనిల్‌ను పూర్తిగా నమ్మించేందుకు రాజీవ్ తన పేరుతో ఉన్న ఆధార్ కార్డు, న్యాప్‌టోల్ సంస్థ జారీ చేసినట్లు ఓ గుర్తింపుకార్డులను వాట్సాప్‌లో పంపించాడు.
‘వసూలు పరంపర’లో భాగంగా రాజీవ్ ఆదాయపుపన్ను, జీఎస్టీ, ఇన్సూరెన్స్ తదితర చార్జీల పేర్లతో 14 దఫాల్లో రూ. 8.18 లక్షలు తన బ్యాంకు ఖాతాల్లో జమ చేయించుకున్నాడు. ప్రతి సందర్భంలోనూ ఈ సొమ్మంతా రిఫండబుల్ అని చెబుతూ అనిల్‌ను నమ్మించాడు. ఈ క్రమంలో బాధితుడితో రాజీవ్‌శర్మతో పాటు అతడి అనుచరులమంటూ సునీల్ చౌదరి, షానవాజ్ అనే వ్యక్తులూ సంభాషించి డబ్బు డిపాజిట్ చేయించుకున్నారు. డబ్బు చెల్లించినా తన బహుమతి మొత్తంతో పాటు రిఫండబుల్ డిపాజిట్స్ తిరిగి రాకపోవడంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న అధికారులు బ్యాంకు ఖాతాలతో పాటు ఫోన్ నెంబర్ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment