‘లక్కీ డిప్’ ముఠా దొరికింది
‘లక్కీ డిప్’ ముఠా దొరికింది
Published Sat, Oct 29 2016 7:20 PM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
- ఐదుగురు నిందితు అరెస్ట్
– రూ.4,15,250 స్వాధీనం
– రశీదు బుక్‌లు, అకౌంట్ రిజిస్టర్, కలెక్షన్ బుక్స్, అగ్రిమెంట్ కాగితాలు సీజ్
కర్నూలు : లక్కీ డిప్‌ల పేరుతో ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా ఐదుగురు సభ్యులను నంద్యాల పోలీసులు అరెస్టు చేశారు. వారివద్ద నుంచి రూ.4,15,250 నగదుతో పాటు అగ్రిమెంట్ కాగితాలు, రశీదు బుక్‌లు, రిజిస్టర్ అకౌంట్ బుక్‌లు, నెలసరి కలెక‌్షన్ బుక్‌లు, ఇతర ఇంటి సామగ్రిని స్వాధీనం చేసుకుని ఎస్పీ ఆకే రవికృష్ణ ఎదుట హాజరుపరిచారు. నంద్యాల డీఎస్పీ హరినాథరెడ్డితో కలసి శనివారం మధ్యాహ్నం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో నిందితులను మీడియా ఎదుట హాజరుపరిచి ఎస్పీ ఆకే రవికృష్ణ వివరాలను వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా సిద్ధిపేట మండలం నర్సాపురం గ్రామానికి చెందిన గర్రిపల్లి కనకరాజు నాలుగు సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం బనగానపల్లె మండలం పలుకూరు గ్రామానికి వలస వచ్చాడు. పెట్రోల్ బంకులో కొంతకాలం పనిచేశాడు. సాయిమిత్ర హోమ్ నీడ్స్ పేరుతో ఒక దుకాణం ప్రారంభించి ఇంటికి ఉపయోగపడే వస్తువులు టీవీ, ఫ్రిడ్జ్, మంచం, ఇతర సామాన్లను నగదుకు, నెలవారి కంతులకు ఇచ్చేలా వ్యాపారం మొదలుపెట్టి ప్రజలను నమ్మించాడు. 2015 సంవత్సరం ఫిబ్రవరి నెలలో మొదటి స్కీమ్ ప్రారంభించి ఒక్కొక్క స్కీమ్ 9 నెలలు ఉండే విధంగా, నెలకు రూ.999 ప్రకారం మొదటి స్కీమ్‌లో 300 మందికి చేర్చుకుని వారికి బహుమతులు, వస్తువులు, నగదు రూపంలో చెల్లించి ప్రజలను నమ్మించాడు. రెండవ, మూడవ స్కీమ్‌ల నందు ఏజెంట్ల ద్వారా పలుకూరు, చుట్టుప్రక్కల గ్రామాల్లో సభ్యులను చేర్చుకుని సుమారు 394 మంది సభ్యులను చేర్చుకుని రూ.17,84,000 డబ్బు వసూలు చేసి బోర్డు తిప్పేసి పారిపోయేందుకు సిద్ధమైనట్లు ఎస్పీ ఆకే రవికృష్ణకు అజ్ఞాత వ్యక్తులు సమాచారం అందించారు. ఆయన ఆదేశాల మేరకు నంద్యాల పోలీసులు శుక్రవారం సాయంత్రం పలుకూరు ఆర్చి(ముఖద్వారం) వద్ద గర్రిపల్లి కనకరాజుతో పాటు పల్లపు శివరామకృష్ణ, చాకలి పెద్దయ్య, ఎర్రగొండ చిన్నకృష్ణ, జూట్ల నాగరాజు (వీరందరిదీ పలుకూరు గ్రామం)ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది.
సమాచారం ఇస్తే సుమొటో కింద కేసు నమోదు: ఎస్పీ
మనీ సర్కులేషన్ పేరుతో ప్రజల నుంచి చట్టవిరుద్ధంగా డబ్బులు వసూలు చేసేవారి సమాచారమిస్తే సుమొటో కింద కేసు నమోదు చేస్తాం. ఇలాంటి స్కీములు చట్ట వ్యతిరేకం. ఆకర్షణీయ బహుమతుల పేరుతో డబ్బులు వసూలు చేసి పారిపోతారని, ఇలాంటివారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా పేద, మధ్యతరగతి వారు ఇలాంటి స్కీముల వల్ల ఎక్కువగా నష్టపోతారు. పలుకూరులో కూడా గని కార్మికులు ఎక్కువమంది నష్టపోయారు.
Advertisement
Advertisement