మోసపోయిన తమ్మయ్యవలస గ్రామస్తులు
విజయనగరం ,తెర్లాం రూరల్ :జిల్లాలోని సాలూరు, పాచిపెంట మండలాల్లోని గిరిజనులను ‘సమ్మక్క–సారక్క’ లక్కీడిప్ పేరిట మోసం చేసిన సంఘటన మరువక ముందే అదే తరహాలో తెర్లాం మండలం తమ్మయ్యవలస గ్రామానికి చెందిన పలువురు మోసానికి గురైన సంఘటన వెలుగు చూసింది. సాలూరు, పాచిపెంట మండలాల్లో ‘సమక్క–సారక్క’ పేరుతో లక్కీడిప్ లాటరీ నిర్వహించగా, తెర్లాం మండలంలో అదే వ్యక్తులు ‘శ్రీ శ్రీనివాస ఫర్నీచర్స్’ పేరుతో లక్కీడిప్ నిర్వహిస్తున్నామని ప్రజలను నమ్మబలికారు. రెండు చోట్ల వేర్వేరు పేర్లతో, వేర్వేరు లక్కీ డీప్‌లతో, ఒకే ఫోన్ నంబర్లతో బ్రోచర్‌లు ముద్రించి ప్రజలను మోసానికి గురి చేశారు.
వివరాల్లోకి వెళ్తే...
తెర్లాం మండలం తమ్మయ్యవలస గ్రామానికి కొన్ని వారాల క్రితం బొబ్బిలి నుంచి రాజేష్, రఘురామ్ అనే వ్యక్తులు వచ్చి తాము బొబ్బిలికి చెందిన వారమని, శ్రీ శ్రీనివాస ఫర్నీచర్స్ పేరుతో లక్కీడిప్ నిర్వహిస్తున్నామని చెప్పినట్టు బాధితులు తెలిపారు. లక్కీడిప్‌లో మొదటి వారానికి రూ.10రూపాయలు, తరువాత వాయిదాలకు డబ్బులు పెంచుకుంటూ 18 వారాల పాటు వాయిదాలు చెల్లించాలని, ఆఖరి వారం రూ.500లు చెల్లించి విలువైన బహుమతులు లాటరీ ద్వారా గెలుచుకోవాలని నమ్మబలికారన్నారు. దీంతో గ్రామానికి చెందిన సుమారు 60 నుంచి 70 మంది వరకు లక్కీడిప్‌లో చేరారు. కొన్ని వారాల పాటు నిర్వాహకులు వచ్చి డబ్బులు వసూలు చేసి వెళ్లిపోయేవారని, ఏదో ఒక గ్రామంలో లాటరీ నిర్వహించినట్లు నమ్మబలికి, తమ పేర్లకు బహుమతులు(తక్కువ ధర పలికే)వచ్చాయని, వాటిని తమకు తెచ్చి అందజేసేవారని తెలిపారు.
తరువాత లక్కీడిప్ నిర్వాహకులు గ్రామానికి రావడం మానేశారన్నారు. దీంతో తాము బొబ్బిలి వెళ్లి విచారించినా వారి ఆచూకీ లేదని, బ్రోచర్‌లో ఉన్న నంబర్లకు ఫోన్ చేసినా పని చేయడం లేదని గ్రామానికి చెందిన బొత్స రాంబాబు తదితరులు తెలిపారు. మంగళవారం సాక్షి దినపత్రికలో సాలూరు నుంచి వచ్చిన కథనాన్ని చదవడం, అందులో ఉన్న ఫోన్ నంబర్, తమ వద్ద ఉన్న బ్రోచర్‌లోని ఫోన్ నంబర్ ఒకటే కావడంతో తాము మోసపోయామని గ్రహించామని వారంతా గొల్లుమన్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని గుర్తించి న్యాయం చేయాలని తమ్మయ్యవలస గ్రామస్తులు కోరుతున్నారు.