అడ్డంగా వాడేశారు.. | Cyber Criminal Cheating With Lucky Trips | Sakshi
Sakshi News home page

అడ్డంగా వాడేశారు..

Published Sat, Apr 7 2018 1:16 PM | Last Updated on Sat, Apr 7 2018 1:16 PM

Cyber Criminal Cheating With Lucky Trips - Sakshi

సాక్షి, సిటీబ్యూరో:నగరానికి చెందిన మాజీ సైనికోద్యోగికి వల వేసిన సైబర్‌ నేరగాళ్లు  బహుమతులు, టర్కీ ట్రిప్‌ గెలుచుకున్నారంటూ రూ.87 లక్షలు కాజేశారు. ఆ తర్వాత అదే ముఠాకు చెందిన మరో బృందం పోగొట్టుకున్న డబ్బు తిరిగి ఇప్పిస్తామంటూ మరో రూ.29 లక్షలు స్వాహా చేసింది. మొత్తమ్మీద నాలుగేళ్లలో రూ.1.16 కోట్లు కోల్పోయిన బాధితుడు  శుక్రవారం హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకు న్న అధికారులు బ్యాంక్‌ ఖాతాల వివరాలు, సాంకేతిక ఆధారాలను బట్టి దర్యాప్తు చేస్తున్నారు.

ట్రిప్పు నుంచి నగదు అంటూ...
సికింద్రాబాద్‌ లోతుకుంట ప్రాంతానికి చెందిన మాజీ సైనికోద్యోగి విఠల్‌ మోహన్‌రావు రైల్వే కాంట్రాక్టులు చేస్తున్నాడు. అతడికి 2014లో ‘షాప్‌ చెర్రీస్‌ మార్కెటింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ సంస్థ పేరుతో ఓ ఈ–మెయిల్‌ వచ్చింది. మీరు కొన్ని బహుమతులతో పాటు టర్కీ వెళ్లి వచ్చేందుకు ట్రిప్‌ గెలుచుకున్నారని, అవి క్‌లైమ్‌ చేసుకునేందుకు పూర్తి వివరాలను పంపాల్సిందిగా కోరారు. దీంతో విఠల్‌ తన ఫోన్‌ నెంబర్‌తో పాటు ఇతర వివరాలు పంపారు. ఆ తర్వాత రాహిల్‌ కపూర్‌ పేరుతో ఫోన్‌ చేసిన వ్యక్తి ట్రిప్‌తో పాటు బహుమతులను క్‌లైమ్‌ చేసుకునేందుకు రూ.2.4 లక్షలు చెల్లించాలంటూ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్‌ చేయించుకున్నాడు. కొన్ని రోజులకు రూ.25 వేలు విలువైన బహుమతులను విఠల్‌ చిరునామాకు పంపిన సైబర్‌ నేరగాళ్లు అతడికి నమ్మకం కలిగేలా చేశారు. ఆపై మరోసారి ఫోన్‌ చేసిన రాహిల్‌ టర్కీ ట్రిప్‌కు బదులుగా మీకు రూ.17 లక్షల నగదు బహుమతి ఇస్తున్నామంటూ చెప్పి రూ.3 లక్షలు జమ చేయించుకున్నాడు. ఇలా బహుమతి మొత్తాన్ని రూ.60 లక్షల వరకు పెంచేయడంతో పాటు మరో రెండు బోగస్‌ సంస్థలను రంగంలోకి దింపి విఠల్‌ నుంచి భారీ మొత్తం కాజేశారు. అనంతరం ఆర్‌బీఐ అధికారిగా  చెప్పుకున్న రాధాకృష్ణ నాయర్‌ అనే వ్యక్తి బహుమతి మొత్తం రూ.80 లక్షలకు పెరిగిందని, అది క్లైమ్‌ కోసం తమ వద్దకు వచ్చిందంటూ నమ్మించి మరికొంత తమ ఖాతాల్లో జమ చేయించుకున్నాడు. 

బెంగళూరుకు ఫైల్‌ వచ్చిందంటూ...
విఠల్‌ను మరోసారి సంప్రదించిన నాయర్‌ బహుమతి మొత్తం రూ.1.2 కోట్లకు పెంచడంతో పాటు క్‌లైమ్‌కు సంబంధించిన ఫైల్‌ బెంగళూరులోని ఆర్బీఐ కార్యాలయానికి చేరిందని, నగదు మీ ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్‌ కావాలంటే పది శాతం ఇంటర్‌పోల్‌ చార్జెస్‌ చెల్లించాలంటూ చెప్పి మరికొంత డబ్బు గుంజాడు. ఈ లావాదేవీలు జరుగుతుండగానే 2016 నవంబర్‌లో డీమానిటైజేషన్‌ అమలులోకి రావడంతో నగదు ట్రాన్స్‌ఫర్‌ ఆలస్యం అవుతుందంటూ విఠల్‌కు చెప్పిన సైబర్‌ నేరగాళ్లు మరో రూ.3.2 లక్షలు కాజేశారు. ఆపై జీఎస్టీ పేరుతో మరో రూ.5.6 లక్షలు డిపాజిట్‌ చేయించుకున్నారు. ఓ దశలో విఠల్‌ను సంప్రదించిన ఎస్‌ఎం సవ్వాల్, ఆర్‌ఎన్‌ కంహార్‌ అనే వ్యక్తులు తాము షాప్‌ చెర్రీస్‌ సంస్థ అధిపతులమని, రాహిల్‌ కపూర్‌ పొరపాటు వల్లే నగదు చెల్లింపు ఆలస్యమైందంటూ ఆ డబ్బు తిరిగి సంస్థ ఖాతాలోకి మళ్లించి, మీకు చెల్లిస్తామంటూ ఎర వేశారు. ఇందుకుగాను రివర్ట్‌ చార్జీల పేరుతో మరో రూ.1.5 లక్షలు వసూలు చేశారు. ఇలా 2014–16 వరకు ఎనిమిది సంస్థల పేరుతో సంభాషించిన 18 మంది రూ.87 లక్షలు బ్యాంకు ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్‌ చేయించుకుని కాజేశారు. ఆపై వీరిలో కొందరి ఫోన్లు స్విచ్ఛాప్‌ కాగా.. మరికొందరు స్పందించడం మానేశారు.  

‘ఇండియా టుడే’ అంటూ మరో టీమ్‌...
ఆ తర్వాత కొన్ని రోజులకు విఠల్‌ను సంప్రదించిన మరో ముఠా తాము ‘ఇండియా టుడే’ సంస్థ నుంచి మాట్లాడుతున్నామంటూ పరిచయం చేసుకున్నారు. రాహుల్‌ తదితరులు టర్కీ ట్రిప్, నగదు బహుమతి పేరు చెప్పి మీ నుంచి రూ.87 లక్షలు కాజేసిన విషయం తమ దృష్టికి వచ్చిందని, అదో భారీ స్కామ్‌గా గుర్తించామని, ఆ మొత్తం మీకు తిరిగి ఇప్పిస్తామంటూ ఎర వేశారు. గతంలో తనను సంప్రదించిన వ్యక్తుల పేర్లతో పాటు ఆ సమయంలో వారు ఏఏ కంపెనీల పేర్లు చెప్పారో చెప్పడంతో విఠల్‌  పూర్తిగా నమ్మాడు. ఆపై మరో ఎపిసోడ్‌ ప్రారంభించిన ఈ బృందం 2016–17 మధ్యలో వివిధ ట్యాక్స్‌లు, పెట్టుబడుల పేరుతో రూ.29 లక్షలు కాజేసింది. ఇలా సైబర్‌ నేరగాళ్లకు రూ.1.16 కోట్లు చెల్లించిన విఠల్‌ ఓ దశలో తీవ్ర నిరాశకు లోనై ఆత్మహత్య చేసుకునే వరకు వెళ్లాడు. సంబంధీకులు భరోసా ఇవ్వడంతో శుక్రవారం సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. అదనపు డీసీపీ కేసీఎస్‌ రఘువీర్‌ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్‌ కేవీఎం ప్రసాద్‌ దర్యాప్తు చేపట్టారు. దుండగులు వినియోగించిన 37 బ్యాంకు ఖాతాలతో పాటు వారు వాడిన సెల్‌ఫోన్‌ నెంబర్ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ స్కామ్‌ మొత్తం ఢిల్లీ కేంద్రంగా సాగినట్లు ప్రాథమికంగా నిర్థారిస్తూ త్వరలో అక్కడకు ఓ ప్రత్యేక  బృందాన్ని పంపాలని భావిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement