ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, సిటీబ్యూరో: సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. వీరి బారినపడి మోసపోయిన పలువురు బాధితులు మంగళవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి. నగరానికి చెందిన ఓ వ్యక్తి శివార్లలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో విద్యనభ్యసించారు. ఆ సమయంలో ఈయనకు ప్రొఫెసర్‌గా వ్యవహరించిన వ్యక్తి పేరుతో ఇటీవల ఓ ఈ– మెయిల్ వచ్చింది. అందులో తనకు అర్జెంటుగా రూ.5 వేల విలువైన అమెజాన్ గిఫ్ట్ వర్చువల్ కూపన్లు కావాలని ఉంది.
దీంతో నగరవాసి వాటిని ఖరీదు చేసి మెయిల్ ద్వారా పంపాడు. ఇలా మొత్తం 18 సార్లు రూ.3.35 లక్షల విలువైన 65 కూపన్లను పంపాడు. ఓ సందర్భంలో అనుమానించిన బాధితుడు తన ప్రొఫెసర్‌ను సంప్రదించగా ఆ మెయిల్ ఐడీ తనది కాదంటూ సమాధానం వచ్చింది. దీంతో మోసపోయానని భావించిన బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. బాధితుడి పరిచయస్తులే ఇలా చేశారా? ఈయన విద్యనభ్యసించిన కాలేజీ వెబ్‌సైట్ నుంచి ఆలోమీ జాబితా సేకరించి ఎర వేశారా? అనే అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు.
►సిటీకి చెందిన మరో వ్యక్తి తన వద్ద ఉన్న కార్పెట్‌ను సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లో విక్రయించాలని భావించారు. దీనికోసం దాని ఫొటోతో పాటు తన ఫోన్ నంబర్‌ను ఓఎల్‌ఎక్స్‌లో పోస్టు చేశారు. దీన్ని చూసిన సైబర్ నేరగాళ్లు అందులో ఉన్న ఫోన్ నంబర్‌కు సంప్రదించారు. తనకు ఆ కార్పెట్ నచ్చిందంటూ రూ.3 వేలకు బేరమాడారు. ఆ మొత్తాన్ని క్యూఆర్ కోడ్స్ రూపంలో పంపిస్తున్నామంటూ చెప్పారు. దీనికి విక్రేత అంగీకరించడంతో గూగుల్ పే క్యూఆర్ కోడ్స్ పంపించారు. వీటిని స్కాన్ చేయగా రూ.3 వేలు ఈయన ఖాతాలోకి రాకుండా ఇటు నుంచే అటు వెళ్లిపోయాయి. ఈ విషయాన్ని నగరవాసి అవతలి వారికి చెప్పగా ఏదో పొరపాటు జరిగిందంటూ మళ్లీ పంపుతున్నామన్నారు. ఇలా రెండుమూడుసార్లు చేసి నేరగాళ్లు బాధితుడి ఖాతా నుంచి రూ.29,998 కాజేశారు.
►తక్కువ వడ్డీకి రుణం కోసం ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసిన నగరానికి చెందిన యువకుడు నిండా మునిగాడు. అందులో కనిపించిన ఓ ఫోన్ నంబర్‌లో సంప్రదించిన ఇతగాడి నుంచి అవతలి వాళ్లు ధ్రువీకరణ పత్రాలు వాట్సాప్‌లో తెప్పించుకున్నారు. అవన్నీ చూసిన తర్వాత రూ.3 లక్షల రుణం ఇస్తున్నామన్నారు. దీనికి సంబంధించిన ప్రాసెసింగ్ ఫీజు, జీఎస్టీ, ఇతర పన్నుల పేరుతో రూ.86,850 తమ ఖాతాల్లోకి బదిలీ చేయించుకుని మోసం చేశారు. జూబ్లీహిల్స్ ప్రాంతానికి 51 ఏళ్ల వ్యక్తి దుబాయ్‌లో ఇంజినీరింగ్ రంగ ఉద్యోగం కోసం ఆన్‌లైన్‌లో ప్రయత్నించారు. ఇతడి ప్రొఫైల్ నచ్చిందంటూ కాల్ చేసిన సైబర్ నేరగాళ్లు ఆ ఉద్యోగం ఇప్పిస్తామంటూ ప్రాసెసింగ్ ఫీజు పేరుతో రూ.33 వేలు స్వాహా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment