కర్నూలు(ఓల్డ్‌సిటి), న్యూస్‌లైన్ : కల్లూరు మండలంలోని పెద్దపాడు గ్రామ సమీపంలో ఉన్న ఏపీ మోడల్ స్కూల్‌లో మంగళవారం విద్యార్థుల ఎంపికకు సంబంధించి లక్కీడిప్ తీశారు. జిల్లాలోని 32 మండలాల్లో ఏపీ మోడల్ స్కూల్స్ ఉన్నాయి. అందులో మంగళవారం 16 పాఠశాలలకు సంబంధించి విద్యార్థులను, బుధవారం 16 పాఠశాలలకు చెందిన విద్యార్థులను ఎంపిక చేయనున్నట్లు ముందే ప్రకటించారు.
దీంతో మంగళవారం ఉదయం సి.బెళగల్, కల్లూరు, గూడూరు, మిడ్తూరు, ఓర్వకల్లు, బనగానపల్లి, ఆస్పరి, మంత్రాలయం, మండలాల పాఠశాలల ఎంపిక చేపట్టారు. ఒక్కో మండలం ఎంపికను ఒక్కో గదిలో నిర్వహించారు. మధ్యాహ్నం నందవరం, పత్తికొండ, పెద్దకడబూరు, ఎమ్మిగనూరు, ఆలూరు, కోడుమూరు, మద్దికెర, గోనెగండ్ల మండలాల విద్యార్థులకు లక్కీడిప్ నిర్వహించారు. సి.బెళగల్ మండల మోడల్ స్కూల్ లక్కీడిప్ కార్యక్రమాన్ని అదనపు జాయింగ్ కలెక్టర్ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మోడల్ స్కూల్‌కూ 80 సీట్లు కేటాయించగా 16 మందిని వెయిటింగ్ లిస్టులో ఉంచినట్లు తెలిపారు. 80 మందిలో అనివార్యకారణాలతో ఎవరైనా హాజరు కాకపోతే వెయిటింగ్ లిస్టులో ఉన్న 16 మందికి అవకాశం కల్పిస్తారన్నారు.
సెలెక్ట్ అయిన విద్యార్థులు ఈ నెల 30 నుంచి వచ్చే నెల 6 లోపు పాఠశాలలో ఒరిజినల్ సర్టిఫికెట్స్ అందజేయాలని లేక పోతే ఆ విద్యార్థి సీటు క్యాన్సిల్ అవుతుందని తెలిపారు. ఏపీ మోడల్ స్కూళ్లు గతేడాది ప్రారంభించగా అప్పుడు తక్కువ దరఖాస్తులు వచ్చాయని అన్నారు. ఈ సంవత్సరం ప్రతి మండలానికి 80 సీట్లు ఉండగా 200కుపైగా అప్లికేషన్స్ రావడం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఈ సంవత్సరం ఏపీ మోడల్‌స్కూల్లో వచ్చిన ఫలితాలు పట్లా అశోక్‌కుమార్ ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పెద్దపాడు ఏపీ మోడల్ స్కూలు పాఠశాల ప్రిన్సిపాల్ జాస్మిన్, తదితరులు పాల్గొన్నారు.
తల్లిదండ్రులు, విద్యార్థులకు తప్పని తిప్పలు
కౌన్సెలింగ్ నిర్వహించే ఏపీ మోడల్ స్కూలు నగరశివారులో ఉండడం వ ల్ల జిల్లా నలుమూలల నుంచి వచ్చిన తల్లిదండ్రులు, పిల్లలు ఇబ్బందులు పడ్డారు. ప్రధాన రహదారికి కిలోమీటర్ దూరంలో స్కూల్ ఉండడంతో చిన్న పిల్లలు ఎండలో నడవలేక తీవ్ర అవస్థలు పడ్డారు. జిల్లాలో మొత్తం 52 మండలాలు ఉండగా కేవలం 32 మండలాలకే మోడల్ స్కూళ్లు పెట్టారని, మిగిలిన మండలాల్లోనూ ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. కల్లూరు మండలానికి సంబంధించిన లక్కీడిప్‌లో స్వల్ప గందరగోళం చోటు చేసుకుంది. బాలికల జనరల్‌లో ఒకే నంబర్ రెండు సార్లు రిపీట్ కావడంతో గుర్తించిన తల్లిదండ్రలు ఆందోళనకు దిగారు. వెంటనే అదనపు సంయుక్త కలెక్టర్ అశోక్‌కుమార్ చొరవ తీసుకుని పరిస్థితిని చక్కదిద్దారు.
మోడల్ స్కూళ్లకు విద్యార్థుల ఎంపిక
Published Wed, May 28 2014 1:59 AM | Last Updated on Sat, Mar 23 2019 9:03 PM
Advertisement
Advertisement