సీఐ పైడియ్యకు మొరపెట్టుకుంటున్న బాధితుడు
గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): ఎవరైనా హఠాత్తుగా ఫోన్ చేసి నీకు టాటా సఫారీ కారు కావాలా... పన్నెండు లక్షలు నగదు కావాలా... అని అడిగితే ఏమంటారు... ముందూ వెనుకా ఆలోచించకుండా కచ్చితంగా ఏదో ఒకదాన్ని ఎంచుకుంటారు. అలాగే ఓ యువకుడు అపరచితుని ఫోన్ ఉచ్చులో పడి వేల రూపాయలు నష్టపోయి లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. వివరాలిలా ఉన్నాయి. గోపాలపట్నం లక్ష్మీనగర్‌కు చెందిన కుప్పా ఆనంద్ అనే యువకుడు సమోసాలు అమ్ముకుని కుటుంబానికి దన్నుగా ఉంటున్నాడు. ఆ యువకుడు సంపాదనలో కొంత మొత్తాన్ని బ్యాంకులో భద్రపరచుకుంటున్నాడు. ఇదిలా ఉండగా రెండు రోజుల క్రితం షాప్‌క్లూస్ షాపింగ్ నుంచి మాట్లాడుతున్నామంటూ ఆ యువకుడికి ఫోన్ వచ్చింది. అప్పటికే ఆ యాప్ ద్వారా పలు రకాల సామగ్రి కొంటుండడంతో ఆ యువకుడు తనకు వచ్చిన ఫోన్‌ని అనుమానించలేదు.
మీరు ఇంత వరకూ కొనుగోలు చేసిన వాటికి సబంధించి మీకు కారు డ్రా పలికింది. మీకు టాటా సఫారీ కారు కావాలా..? లేక రూ.12లక్షలు నగదు కావాలా..? అని అడగడంతో ఆనంద్ ఉబ్బితబ్బిబ్బయ్యాడు. తర్వాత అదే నెంబరు నుంచి ఫోన్ వచ్చింది. మీకు కావాల్సిన డబ్బులు అంత మొత్తంలో విడుదల చేయాలంటే ముందుగా పన్నులు చెల్లించాలని చెప్పడంతో నిజమేనని నమ్మేసిన ఆనంద్ తన బ్యాంకు అకౌంట్ నుంచి వారు సూచించిన రెండు అకౌంట్ నంబర్లకు రూ28,600లు బదిలీ చేశాడు. తర్వాత అనుమానం వచ్చి ఆనంద్ సంబంధిత షాప్‌క్లూస్ నిర్వాహకులకు ఫోన్ చేస్తే తాము అలాంటి డ్రాలు తీయడం లేదని స్పష్టం చేశారు. దీంతో ఆ యువకుడు కళ్లు తేలేసేశాడు. తాను దారుణంగా మోసపోయానంటూ గోపాలపట్నం పోలీస్‌స్టేషన్ సీఐ పైడియ్య ఎదుట వాపోయాడు. మోసగాడు ఫోన్ ప్రకారం ట్రూ కాలర్ పరిశీలిస్తే లక్కీ డ్రా కాంటెస్ట్ అని చూపుతోంది. ఫోన్ జార్ఖండ్ నుంచి వచ్చినట్లుగా, అకౌంట్ నంబర్లు ఢిల్లీకి చెందినవిగా తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment