సాక్షి, విశాఖపట్నం: తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అనుచరుడు ఈగల సత్యనారాయణ (సత్యం)ను ఎంవీపీ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఎస్తేర్‌రాణి అనే మహిళపై దౌర్జన్యానికి దిగడంతోపాటు వేధింపులకు గురిచేసిన నేపథ్యంలో అతనిపై ఎంవీపీ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. వేధింపులు తాళలేక ఆదివారం రాత్రి ఎస్తేర్‌రాణి శానిటైజర్ తాగి ఆత్మహత్యకు పాల్పడగా కుటుంబ సభ్యులు కేజీహెచ్‌కు తరలించారు. దీంతో అక్కడికి వెళ్లిన ఎంవీపీ పోలీసులు ఆమె నుంచి వాంగ్మూలం తీసుకొని సోమవారం రాత్రి కేసు నమోదు చేశారు. మంగళవారం ఉదయం బీచ్‌రోడ్డులో ఈగల సత్యంను అదుపులోకి తీసుకున్నట్లు ఎంవీపీ ఎస్‌ఐ భాస్కర్ తెలిపారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో అక్కడి నుంచి సత్యంను సెంట్రల్ జైలుకు తరలించారు. ప్రస్తుతం కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఎస్తేర్‌రాణి పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. శానిటైజర్ తాగడం వల్ల శరీరంలోని అవయవాలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించినట్లు తెలిపారు.
మహిళా సంఘాల ఆగ్రహం
ఒంటరిగా ఉంటున్న మహిళ పట్ల ఈగల సత్యం వ్యవహరించిన తీరుపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మహిళలపై టీడీపీ నాయకులకు ఉన్న చిన్నచూపునకు ఈ ఘటన నిదర్శనమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం నాయకులు మంగళవారం కేజీహెచ్‌కు వెళ్లి ఎస్తేర్‌రాణిని పరామర్శించారు. వైఎస్సార్‌సీపీతోపాటు నగరంలోని మహిళా సంఘాలన్నీ అండగా ఉన్నాయంటూ భరోసా కల్పించారు. ఎస్తేర్‌రాణి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లతో మాట్లాడి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ తూర్పు నియోజకవర్గ మహిళ విభాగం అధ్యక్షురాలు కృపజ్యోతి మాట్లాడుతూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న వీడియోలు చూస్తుంటే ఎస్తేర్‌రాణిపై సత్యం ఏ స్థాయిలో దౌర్జన్యానికి దిగాడనేది అర్థమవుతుందన్నారు.
నిత్యం ఆమె ఇంటికి వెళ్లి దుర్భాషలాడుతూ, వేధిస్తూ మానసికంగా హింసించాడన్నారు. ఎమ్మెల్యే వెలగపూడి అండతోనే సత్యం ఇంతగా బరితెగించాడంటూ దుయ్యబట్టారు. మానసికంగా, శారీరకంగా ఎస్తేర్‌రాణిని హింసించిన తీరుపై కుటుంబ సభ్యులు తెలిపిన విషయాలు బాధ కలిగించాయన్నారు. సత్యంను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విశాఖలో మరోసారి ఇలాంటి ఘటన వెలుగుచూడకుండా పోలీసులు చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన దిశ వంటి చట్టాలను ఉపయోగించి సత్యంలాంటి వారికి తగిన గుణపాఠం నేర్పాలన్నారు. కార్యక్రమంలో శిరీష, షకీనా, వరలక్ష్మి, వెంకటలక్ష్మి, శశికళ పాల్గొన్నారు.
ఈగల సత్యానికి 14 రోజుల రిమాండ్
Published Wed, Sep 16 2020 9:57 AM | Last Updated on Wed, Sep 16 2020 10:23 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment