లక్కు ఎవరిదో!
ఎంత పెట్టుబడి పెట్టినా నష్టం రానిది మద్యం వ్యాపారం. అందుకే షాపులకోసం అన్ని వేల మంది పోటీ పడుతుంటారు. జిల్లాలో 410 మద్యం దుకాణాల నిర్వహ ణ కోసం ఏకంగా మూడువేల మందికి పైగా దరఖాస్తులు వేశారంటే ఎంత ఆదా యం ఉందో అర్థమయిపోతోంది. దరఖాస్తులు వేసిన వారందరికీ దుకాణాలు రావు. కాస్త అదృష్టం కూడా ఉండాలి. ఈ అదృష్టం ఎవరిని వరిస్తుందో సోమవారం తేలనుంది. లక్కీడిప్ పద్ధతిలో దుకాణాలు కేటాయిస్తారు. ఇందుకోసం ఎక్సైజ్ అధికారులు ఏర్పాట్లు చేశారు.
- నేడు మద్యం దుకాణాల కేటాయింపు
- పీవీకేఎన్ కళాశాలలో ఏర్పాట్లు పూర్తి
- తొలి విడతలో 320దుకాణాలకే దరఖాస్తులు
- 90 దుకాణాలకు పడని టెండర్లు
- దరఖాస్తు రుసుంతో రూ.12 కోట్ల ఆదాయం
చిత్తూరు (అర్బన్): జిల్లాలోని మద్యం దుకాణాల కోసం నిర్వహించే లక్కీడిప్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. చిత్తూరు నగరంలోని పీవీకేఎన్ డిగ్రీ కళాశాలలో లాటరీ పద్ధతిలో దుకాణాల కేటాయిస్తారు. కలెక్టర్, ఎక్సైజ్ అధికారుల సమక్షంలో ఈ వ్యవహారం జరుగుతుంది. ఉదయం 10.30 గం టల నుంచి సర్కిళ్ల వారీగా దుకాణాలకు లాటరీ తీస్తారు. దరఖాస్తులన్నింటినీ టెండరు బాక్సుల్లోంచి బయటకు తీసి, వాటికి టోకెన్ నంబర్లు కేటాయిస్తారు. వీటిని ఒక డబ్బాలో వేసి ప్రతి దుకాణానికీ మూడు టోకెన్లు బయటకు తీస్తారు.
ఇందులో తొలిగా వచ్చిన టోకెన్ నంబర్ వారికి దుకాణం కేటాయిస్తారు. ఇతను ఆ దుకాణం లెసైన్సు ఫీజులో 1/3 వంతు నగదును సాయంత్రం లోపు అధికారులకు చెల్లిస్తే, మంగళవారం ప్రొవిజన్ లెసైన్సు జారీ చేస్తారు. అలా చెల్లించకున్నా, తనకు దుకాణం వద్దని చెప్పినా, రెండోసారి వచ్చిన టోకెను నెంబరు ఆధారంగా మరో వ్యక్తికి, అతనూవద్దనుకుంటే మూడోసారి వచ్చిన వ్యక్తికి కేటాయిస్తారు. అతను వద్దనుకుంటే సం బంధిత దుకాణానికి రీ-టెండరు నిర్వహిస్తారు.
90 దుకాణాలకు నిల్...
జిల్లాలో 410 మద్యం దుకాణాల్లో 320 దుకాణాలకు మాత్రమే టెండర్లు పడ్డాయి. 90 దుకాణాలకు ఒక్క టెండరు కూడా పడలేదు. ఈ ప్రాం తాల్లో వ్యాపారం జరగదనే ఉద్దేశంతోనే ఎవరూ ముందుకురాలేదని తెలుస్తోంది. 320 దుకాణాలకు 3,048 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు రుసుం ద్వారా జిల్లాలో తొలి విడతగా ప్రభుత్వానికి రూ.12 కోట్ల ఆదాయం లభించింది.
దరఖాస్తులు పడని దుకాణాలు ఇవే..
దరఖాస్తులు పడని దుకాణాల్లో చిత్తూరు ఎక్సైజ్ పరిధిలో చిత్తూరు అర్బన్ స్టేషన్‌లోని 4, రూరల్‌లో 4, కార్వేటినగరంలో 3, మదనపల్లెలో 3, మొలకలచెరువులో 4, పుంగనూరులో 7, పలమనేరులో 9, వాల్మీకిపురంలో 4, పీలేరులో 4 ఉన్నాయి.
మిగిలిన 147 దుకాణాలకు 1,418 దరఖాస్తులు వచ్చాయి. తిరుపతి ఎక్సైజ్ పరిధిలో దరఖాస్తులు రానివి తిరుపతి అర్బన్‌లో 3, రూరల్‌లో 4, పాకాలలో 13, పుత్తూరులో 8, శ్రీకాళహస్తిలో 2, సత్యవేడులో 7, నగరిలో 10 ఉన్నాయి. మిగిలిన 173 దుకాణాలకు 1,556 దరఖాస్తులు వచ్చాయి. గత ఏడాది జిల్లాలో 458 దుకాణాల్లో 70తీసుకోవడానికి ఎవరూ ముందురాలేదు. ఈ సారి 70 దుకాణాలతో పాటు అదనంగా మరో 20కి దరఖాస్తులు పడకపోవడంతో రీ-టెండర్ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. అప్పటికీ ఎవరూ రానిపక్షంలో వీటి స్థానంలో ప్రభుత్వ మద్యం దుకాణాలు వెలుస్తాయి.