అదృష్టం ‘బారులా’ తెరుచుకుంది!
అదృష్టం ‘బారులా’ తెరుచుకుంది!
Published Fri, Jun 30 2017 10:33 PM | Last Updated on Tue, Sep 5 2017 2:52 PM
– ఆళ్లగడ్డ బార్‌కు అత్యధికంగా 22 మంది పోటీ
– డోన్‌కు ఒక్కరే దరఖాస్తు
– ఎమ్మిగనూరులో రెండు షాపులకు ఒక్క దరఖాస్తు రాని వైనం
కర్నూలు (కొండారెడ్డి ఫోర్టు): జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేయనున్న బార్ లైసెన్స్‌ల ఎంపిక కోసం శుక్రవారం సునయన ఆడిటోరియంలో జాయింట్ కలెక్టర్–2 రామస్వామి, ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్‌చార్జ్ డిప్యూటీ కమిషనర్ సీ.శ్రీరాములు ఆధ్వర్యంలో లక్కీ డిప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మొత్తం 11 బార్ లైసెన్స్‌ల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వగా ఎనిమిదింటికి లక్కీ డిప్ ద్వారా లైసెన్స్‌లను అధికారులు ఎంపిక చేశారు. జిల్లాలోని ఆదోనిలో మూడు, ఎమ్మిగనూరులో మూడు, గూడూరు, డోన్, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, నందికొట్కూరు మునిసిపాలిటీల్లో నూతనంగా ఒక్కో బార్ ఏర్పాటు కోసం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు అన్‌లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించారు. మొత్తం 11 బార్లకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానించగా 9 బార్లకు మొత్తం 72 దరఖాస్తులు వచ్చాయి.
- ఎమ్మిగనూరులో మొత్తం మూడు బార్లకు అనుమతి రాగా, కేవలం ఒక్కదానికే మాత్రమే మూడు దరఖాస్తులు రాగా వాల్మీకి శంకరయ్యను అదృష్టం వరిచింది. మిగిలిన రెండింటికి ఒక్క దరఖాస్తు రాలేదు.
- అత్యధికంగా ఆళ్లగడ్డలో ఏర్పాటు కానున్న బార్‌కు 22 దరఖాస్తులు వచ్చాయి. ఇక్కడ లక్కీడిప్‌లో పి.తుకారం అనే వ్యక్తిని లక్కు వరించింది.
- నందికొట్కూరులో 16 మందిలో ఒంకారేశ్వరెడ్డికి దక్కింది.
- ఆదోని మూడింటిలో మొదటి దానికి కే.రామన్న, రెండో దానికి కేపీరాజు, మూడోదానికి రాంపుల్లయ్యకు లక్కు కలసి వచ్చింది.
- ఆత్మకూరులో ఏడుగురులో విజయరవీంద్ర నాయక్, డోన్‌లో ఏకైక దరఖాస్తు దారుడు బీ.శ్రీనివాసులుగౌడ్‌ను ఎంపిక చేసినట్లు జేసీ–2 రామస్వామి ప్రకటించారు.
మహిళలను వరించని విజయం..
బార్ లైసెన్స్‌లను దక్కించుకునేందుకు ముగ్గురు మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. ఆత్మకూరులో వీ.హరిత, ఆళ్లగడ్డలో వెంకటలక్ష్మీ, నందికొట్కూరు నుంచి మానస అనే మహిళలు లక్కీడిప్‌లో పాల్గొన్నారు. అయితే ముగ్గురిలో ఒకరిని కూడా లక్కు వరించలేదు. మరోవైపు బార్‌లైసెన్స్‌ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఎక్కువగా యువకులు ఉండడం గమనార్హం.
దరఖాస్తులతోనే 1.42 లక్షల ఆదాయం...
బార్ లైసెన్స్‌ల దరఖాస్తుల ఫీజు ప్రభుత్వానికి రూ. 1.42 లక్షల ఆదాయాన్ని సమకూర్చింది. మొత్తం 71 దరఖాస్తుల నుంచి ఒక్కో దానికి రూ. రెండు లక్షల ప్రకారం చలానాలను స్వీకరించారు. లక్కీ డిప్ ద్వారా ఎంపికైనా, ఎంపిక కాకపోయినా దరఖాస్తు కోసం చెల్లించిన రూ.2లక్షలను వెనక్కి ఇవ్వరు.
డోన్‌లో చక్రం తిప్పిన డిప్యూటీ సీఎం అనుచరులు
డోన్‌లో డిప్యూటీ సీఎం అనుచరులు చక్రం తిప్పడంతో బార్ లైసెన్స్ కోసం కేవలం ఒక్క దరఖాస్తు మాత్రమే రావడం గమనార్హం. దరఖాస్తు చేసుకున్నా బి.శ్రీనివాసులు గౌడ్‌కు అధికారులు లైసెన్స్‌ను మంజూరు చేశారు.
– వివాదాస్పదమైన గూడూరు బార్ ఎంపిక
బార్ లైసెన్స్‌లను దక్కించుకునేందుకు టీడీపీ నేతలు పోటీ పడ్డారు. గూడూరు బార్ లైసెన్స్‌ను దక్కించుకునేందుకు కోడుమూరు నియోజకవర్గ ఇన్‌చారీ విష్ణువర్దన్‌రెడ్డి, ఎమ్మెల్యే మణిగాంధీ ఎత్తుకు పైఎత్తులు వేశారు. ఇక్కడ బార్ ఏర్పాటు కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానించగా మొత్తం నలుగురు దరఖాస్తులు చేసుకున్నారు. అయితే దరఖాస్తుకు లోకల్ బాడీ అథారిటీ జారీ చేసే ట్రేడ్ లైసెన్స్ సర్టిఫికెట్‌ను జత చేయకపోవడంతో మణిగాంధీ అనుచరుల దరఖాస్తులన్నీ రిజెక్ట్ అయ్యాయి.
విష్ణువర్దన్‌రెడ్డి అనుచరుడు కరుణాకర్‌కు మాత్రం నగర కమిషనర్ ట్రేడ్ లైసెన్స్‌ను జారీ చేయడంతో ఆయన దరఖాస్తును అధికారులు ఒకే చేశారు. అయితే కమిషనర్ తమ వాళ్లకు ట్రేడ్ లైసెన్స్‌లను జారీ చేయడంలో నిర్లక్ష్యం చేశారని ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ స్పందించి గూడూరులో ఏర్పాటు చేయనున్న బార్ లైసెన్స్ లక్కీడిప్ విజేత ఎంపిక వాయిదా వేయించారు. అయితే ఈ విషయంపై కోర్టుకు వెళ్తానని కరుణాకర్ ప్రకటించారు. డోన్‌లో ఒక దరఖాస్తు వచ్చినా లైసెన్స్ ఇచ్చారని, గూడూరులో ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు.
Advertisement
Advertisement