
ఒకనాటి స్నేహం.. పాత్రికేయుడు సునీల్ హెగ్గరవళ్లితో రవి
సాక్షి, బెంగళూరు: తన వద్ద పనిచేస్తున్న పాత్రికేయుడు సునీల్ హెగ్గరవళ్లిని హత్య చేసేందుకు హాయ్ బెంగళూరు పత్రిక సంపాదకుడు రవి బెళగెరే ప్రొఫెషనల్ కిల్లర్స్‌కు సుపారీ ఇచ్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. పోలీసుల కథనం ప్రకారం... సెప్టెంబర్ 5న బెంగళూరులో జరిగిన గౌరీ లంకేష్ హత్యపై దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు....అక్రమాయుధాలు కలిగిన బెంగళూరుకు చెందిన షాహిద్ అలియాస్ తాహీర్ అనే నేరగాన్ని అదుపులోకి తీసుకున్నారు. విజయపుర (బిజాపుర) జిల్లాకు చెందిన షార్ప్‌షూటర్ శశిధర్ ముండేధర్ నుంచి ఇతనికి ఆయుధాలు అందినట్లు తేలింది. తనకు గౌరీ లంకేష్ హత్యతో సంబంధం లేదని తాహీర్ చెప్పాడు. హాయ్ బెంగళూరు పత్రిక సంపాదకుడు రవి బెళగెరే అతని సహోద్యోగి సునీల్ హెగ్గరవళ్లిని చంపడానికి సుపారీ ఇచ్చారని వెల్లడించాడు. ‘టార్గెట్’ను మట్టుబెట్టడానికే తాను ఆయుధాలను బెంగళూరుకు తీసుకువచ్చి తాహీర్‌కు ఇచ్చినట్లు అంగీకరించాడు. ఈ దిశగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి.
ఎక్కడ బెడిసిందంటే...
రవి బెళగారే వద్ద సునీల్ హెగ్గరవళ్లి పాత్రికేయుడిగా పనిచేశారు. రవి బెళగారే అనారోగ్యానికి గురైన సమయంలో 2012 నుంచి రెండేళ్లపాటు హాయ్‌బెంగళూరు పత్రికను సనీల్ హెగ్గరవళ్లి అన్నీ తానై నడిపారు. ఈ సమయంలో వ్యక్తిగత భేదాభిప్రాయాలు రావడంతో 2014 చివర్లో సునీల్ హెగ్గరవళ్లి ఆ పత్రిక నుంచి బయటికి వచ్చి సొంతంగా టీవీ చానల్ ఏర్పాటు చేశాడు. 2016 డిసెంబర్‌లో రవిబెళగారే సునీల్ హెగ్గరవళ్లికి ఫోన్ చేసి చానల్‌లో పెట్టుబడులు పెట్టడానికి కొంతమంది ముందుకు వచ్చారని చెప్పారు. సునీల్ హెగ్గరవళ్లి 2016 డిసెంబర్ 16న పద్మనాభనగర్‌లోని హాయ్‌బెంగళూరు పత్రికా కార్యాలయానికి వెళ్లగా అక్కడ రవి బెళగారే లేకపోగా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఉన్నారు. వారి వ్యవహారశైలి అనుమానాస్పదంగా ఉండటంతో సునీల్ హెగ్గరవళ్లి అక్కడి నుంచి వచ్చేశారు.
రెక్కీ విఫలం
సునీల్ హెగ్గరవళ్లిని చంపడానికి అతని ఇంటి వద్ద ఈ ఏడాది ఆగస్టు 28న శశిధర్ ముండాధర్ రెక్కీ నిర్వహించాడు. అయితే అక్కడ సీసీ కెమెరాలు ఉండటంతో వెనక్కు వచ్చేశాడు. ఇది జరిగిన తొమ్మిది రోజుల తర్వాత అంటే సెప్టెంబర్ 5న గౌరి లంకేష్ హత్య జరిగింది. అటుపై సెప్టెంబర్ 8న రవిబెళగారే సునీల్ హెగ్గేరహళ్లికి ఫోన్ చేసి గౌరి లంకేష్ హత్యకేసుకు సంబంధించిన రిపోర్టింగ్ నీవే బాగా చేయగలవని, పాత విషయాలు మరచిపోయి తిరిగి హాయ్ బెంగళూరులో పనిచేయడానికి రావాలని కోరారు. ఈ విషయాన్ని అదే రోజున తన ఫేస్‌బుక్ పేజ్‌లో కూడా సునీల్ హెగ్గేరహళ్లి పోస్ట్ చేశారు. అక్టోబర్ 6న సునీల్ హెగ్గేరవళ్లి తిరిగి హాయ్‌బెంగళూరులో చేరారు.
రవి బెళగెరె అరెస్టు
శుక్రవారం పోలీసులు సోదాలకు వెళ్లినప్పుడు రవి బెళగెరే తన కార్యాలయంలోని మొదటి అంతస్తులోనే ఉన్నారు. పోలీసులు విషయం చెప్పి అరెస్టు చేయడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో తనకు ఆరోగ్యం సరిగా లేదని అందువల్ల అరెస్టు చేయకూడదని కోరారు. సుమారు మూడు గంటల పాటు ఈ విషయమై పోలీసులు, రవి బెళగారే మధ్య వాగ్వాదం జరిగింది. అటుపై తన లాయర్ దివాకర్ సూచనల మేరకు అరెస్టుకు అంగీకరించారు. దీంతో శనివారం సాయంత్రం 6:15 గంటల సమయంలో పోలీసులు రవి బెళగారెను అరెస్టు చేసి తమతో పాటు తీసుకువెళ్లారు. రవి బెళగెరే అనారోగ్యంతో ఉండటంతో ప్రత్యేక బెడ్ సదుపాయం కల్పించి విచారిస్తున్నారు. నేడు (శనివారం) ఆయనను న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచే అవకాశం ఉంది. షార్ప్‌షూటర్ శశిధర్ ముండేధర్‌ను ఈ నెల 18 వరకూ తమ కస్టడీకి తీసుకున్నారు.
ఆశ్చర్యపోయిన సునీల్
విచారణలో వెలుగుచూసిన విషయాలను నిర్ధారణ చేసుకోవడానికి పోలీసులు సునీల్ హెగ్గేరవళ్లిని తమ కార్యాలయానికి పిలిపించారు. ‘నిన్ను చంపడానికి ప్రయత్నాలు జరిగాయి.’ అని చెప్పగా మొదట ఆశ్చర్యపోయిన సునీల్ హెగ్గేరవళ్లి తర్వాత గతంలో తన అనుభవంలోకి వచ్చిన అనుమానాస్పద విషయాలను ఒక్కొక్కటి పోలీసులకు చెబుతూ వచ్చారు. దీంతో ఈ హత్య వెనుక ప్రధాన సూత్రధారి రవిబెళగారే అని భావించిన పోలీసులు అతనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఏసీపీ సుబ్రహ్మణ్య నేతృత్వంలో పద్మనాభనగరలోని హాయ్‌బెంగళూరు కార్యాలయం, రవిబెళగారే నివాసంలో శుక్రవారం సాయంత్రం 3 గంటల నుంచి సోదాలు జ రిపి ఒక పిస్టల్, డబల్ బ్యారెల్‌గన్, జింక చర్మం, తాబేలు చిప్పను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment