అరెస్ట్ చేసిన నిందితులు, స్వాధీనం చేసుకున్న బైక్‌లతో ఇన్‌స్పెక్టర్లు బాజీజాన్‌సైదా, రామారావు
నెల్లూరు(క్రైమ్): రెండేళ్లుగా జిల్లాలో వివిధ ప్రాంతాల్లో బైక్ దొంగతనాలకు పాల్పడుతూ పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న ముగ్గురు దొంగల బృందంలోని ఇద్దరు నిందితులను నెల్లూరులోని సీసీఎస్, నవాబుపేట పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక సీసీఎస్ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో సీసీఎస్ ఇన్‌స్పెక్టర్లు షేక్ బాజీజాన్‌సైదా, జి.రామారావులు వివరాలను వెల్లడించారు. దుత్తలూరు మండలం రాచవారిపల్లెకు చెందిన పి.వెంకటరత్నం, చంద్రగిరి మండలం అయితేపల్లి అగరాల గ్రామానికి చెందిన పవన్‌కుమార్‌రెడ్డి అలియాస్ పవన్ అలియాస్ చంటి, కోవూరు కోనమ్మతోటకు చెందిన వి.కిశోర్ అలియాస్ పెయింటర్ కిశోర్‌లు స్నేహితులు. వీరు బృందంగా రెండేళ్లుగా వివిధ ప్రాంతాల్లో బైక్‌లను దొంగలించి వాటిని అమ్మి సొమ్ము చేసుకుని జల్సాలు చేయసాగారు.
వారి కదలికలపై సీసీఎస్ ఇన్‌స్పెక్టర్లు, నవాబుపేట ఇన్‌స్పెక్టర్ కె.వేమారెడ్డి ఆధ్వర్యంలో సీసీఎస్, నవాబుపేట ఎస్సైలు కె.శేఖర్‌బాబు, బి.శివప్రకాష్, రమేష్‌బాబు తమ సిబ్బందితో ప్రత్యేక బృందాలతో నిఘా ఉంచారు. మంగళవారం నిందితులు పి.వెంకటేశ్వర్లు, పవన్‌కుమార్‌రెడ్డిలు ప్రశాంతినగర్ జంక్షన్‌లో ఉన్నారన్న పక్కా సమాచారం అందుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం విచారించగా పలుచోట్ల బైక్ దొంగతనాలకు పాల్పడినట్లు నేరం అంగీకరించడంతో అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.12 లక్షల విలువచేసే బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్లు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి చోరీ సొత్తు స్వాధీనం చేసుకునేందుకు కృషిచేసిన సీసీఎస్ ఇన్‌స్పెక్టర్లతోపాటు ఎస్సై కె.శేఖర్‌బాబు, ఏస్సై జె.వెంకయ్య, హెడ్ కానిస్టేబుల్స్ సయ్యద్‌వారీస్ అహ్మద్, ఆర్.సత్యనారాయణ, కానిస్టేబుల్స్ జి.నరేష్, ఎం.సుబ్బారావు, జి.అరుణ్‌కుమార్‌లను ఉన్నతాధికారులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment