
సిరిసిల్ల: ప్రేమించి పెళ్లి చేసుకుని తమ పరువు తీశారనే ఆగ్రహంతో ప్రేమ జంటను దారుణంగా హత్యచేశారు. తమ చేతుల మీదుగా పెంచిన మేనకోడలిని, ఆమె భర్తను మేనమామలే గొంతు కోసి చంపేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం బాలరాజ్‌పల్లిలో గురువారం ఈ విషాదం చోటుచేసుకుంది. ప్రేమ జంట నేదూరి హరీశ్ (24), రచన (22) అక్కడికక్కడే మృతి చెందారు. నిందితులు పరారయ్యారు.
పెంచిన చేతులతోనే చంపేశారు
చందుర్తి మండలం రామన్నపేటకు చెందిన దమ్ము లక్ష్మణ్, విజయలక్ష్మి దంపతుల కుమార్తె రచన. తండ్రి లక్ష్మణ్ అనారోగ్యంతో చాలా కాలం కిందే మరణించగా.. తల్లి కొన్నేళ్ల కింద కన్నుమూసింది. దాంతో బాలరాజ్‌పల్లెకు చెందిన మేనమామలు శేఖర్, అశోక్, నాగరాజులు కలసి రచనను పెంచి, చదివించారు. డిగ్రీ చదువుతున్న ఆమె కొంతకాలంగా మేనమామల ఇంటికి సమీపంలో ఉండే నేదూరి హరీశ్ (24)ను ప్రేమించింది. వారు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇద్దరిదీ ఒకే సామాజిక వర్గమే అయినా రచన మేనమామలు పెళ్లికి అంగీ కరించలేదు. దీంతో రెండు నెలల కింద ఆమె ఇంట్లోంచి వెళ్లిపోయి హరీశ్‌ను వివాహం చేసుకుంది. వారు హరీశ్ ఇంట్లోనే కాపురం పెట్టారు. అయితే రచన ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో తమ పరువు పోయిందని ఆమె మేనమామలు ఆగ్రహం పెంచుకున్నారు. పథకం ప్రకారం వారిని హత్య చేయాలని నిర్ణయించుకున్నారు.
గురువారం మేనమామలు నేదూరి శేఖర్, అశోక్, నాగరాజు కుమారుడు మనోజ్ (చింటు) ముగ్గురు కత్తులు చేతబట్టుకుని హరీశ్ ఇంట్లోకి వెళ్లారు. రచనను, హరీశ్‌ను గొంతుకోశారు. అక్కడే ఉన్న హరీశ్ తల్లి వజ్రవ్వ రోదిస్తూ ఆపేందుకు ప్రయత్నించినా వినలేదు. రచన, హరీశ్ రక్తపు మడుగులో కొట్టుకుంటూ అక్కడికక్కడే మరణించారు. అనంతరం నిందితులు ముగ్గురూ పరారయ్యారు. వేములవాడ సీఐలు శ్రీనివాస్‌రావు, మాధవిలు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఒక్కడే కుమారుడు
హత్యకు గురైన హరీశ్ తండ్రి ఎల్లయ్య, తల్లి వజ్రవ్వ వ్యవసాయ కూలీలు. వయసు మీదపడటంతో వారు కుమారుడిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఇప్పుడు హరీశ్ హత్యకు గురికావడంతో ఆవేదనతో కుప్పకూలిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment