పోలీసులు స్వాధీనం చేసుకున్న కార్లు
తమిళనాడు, తిరువళ్లూరు: సినిమా షూటింగ్ ప్రయివేటు కంపెనీలకు కార్లు అవసరమయ్యాయని మోసం చేసి 19 కార్లతో ఉడాయించిన ముగ్గరిని అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి సుమారు రెండు కోట్ల రూపాయల విలువ చేసే కార్లను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తిరువళ్లూరు జిల్లా ఊత్తుకోట పెనాలూరుపేట, పూండి, తిరువళ్లూ తదితర ప్రాంతాల్లోని కారు యజమానుల వద్దకు నలుగురు యువకులు మూడు నెలల నుంచి తరచూ వెళ్లి ప్రవేటు కంపెనీ, సినిమా డైరెక్టర్లమంటూ పరిచయం చేసుకున్నట్టు తెలుస్తోంది. తమకు కార్లు అవసరం ఉందని, రోజుకు రెండు నుంచి నాలుగు వేల రూపాయల వరకు అద్దె చెల్లిస్తామని నమ్మించారు.
వీటిని నమ్మిన కొందరు కార్లను అద్దెకు ఇచ్చారు. మొదటి రెండు నెలల వరకు అద్దెను బ్యాంకు ఖాతాల్లో చెల్లించిన యువకులు తరువాత మాయమయ్యారు. ఇదే విషయాన్ని యువకుల వద్ద అడిగినా వారి నుంచి సరైన సమాధానం రాలేదు. బాధితులు తిరువళ్లూరు, ఊత్తుకోట, పెనాలూరుపేట తదితర పోలీసు స్టేషన్‌లకు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సిరీయస్‌గా స్పందించిన ఎస్పీ అరవిందన్, ఊత్తుకోట డీఎస్పీ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఊత్తుకోట అంబేడ్కర్ నగర్‌కు చెందిన ప్రవీణ్‌జార్జ్ (29), పన్నీర్‌సెల్వం (45), నందిమంగళం గ్రామానికి చెందిన భరత్(23), కమ్మవారి పాళ్యం గ్రామానికి చెందిన వెంకటేషన్(39) తదితర నలుగురు మోసం చేసినట్టు గుర్తించారు. ఇందులో ప్రవీణ్‌జార్జ్, పన్నీర్‌సెల్వం, భరత్‌ను అరెస్టు చేశారు. మరొకరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వీరి నుంచి 19 కార్లను స్వాధీనం చేసుకుని యజమానులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment