సాక్షి, హైదరాబాద్ : తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చేసుకుని, ఇంటి తాళాలు పగులకొట్టి చోరీలకు పాల్పడుతున్న కేటుగాళ్లను చాదర్‌ఘాట్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు నిందితుల వివరాలను హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇటీవల చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్లవారుజామున జరిగిన చోరీ ఘటనలో నిందితులైన మొహమద్ ఖాదర్ అలియాస్ ఆయుబ్, జామీమ్, మక్దూమ్, వేముల సాయికుమార్‌ను అరెస్ట్ చేశామని తెలిపారు. కేసుకు సంబంధించి నిందితులందరిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించామని, వారి నుంచి రూ. 12 లక్షలు నగదుతోపాటు 22 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నామని సీపీ చెప్పారు.
నిందితుడు ఆయుబ్‌కు మీర్‌చౌక్ హత్యతోపాటు పలు కేసుల్లో ప్రమేయముందని, ఈ మధ్యనే జైలు నుంచి విడుదలై అతను బయటకు వచ్చాడని తెలిపారు. జామీమ్‌పై కూడా పలు పోలీసుస్టేషన్లలో కేసులు ఉన్నాయని, ఈ కేసులోని నిందితులపై పలు పోలీసుస్టేషన్లలో ఇప్పటికే 16 కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. వీటిలో సైదాబాద్, చాదర్‌ఘాట్ పోలీసుస్టేషన్ల పరిధిలో నమోదైన సంచలనాత్మక కేసులు కూడా ఉన్నాయని తెలిపారు.
వెళ్లేముందు పోలీసులకు సమాచారం ఇవ్వండి!
ఇక, అత్యవసరంగా ఊరెళ్లాల్సి వస్తే.. వెళ్లేముందు పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీపీ అంజనీ కుమార్ సూచించారు. బిస్కెట్ కంపెనీలో చోటుచేసుకొన్న ఘటనలో కీలక నిందితుడైన దినేష్ కుమార్‌ను ఆదివారం అరెస్టుచేశామని తెలిపారు. పట్టుబడ్డ నిందితుని నుంచి ఆరు లక్షల మేరకు ప్రాపర్టీ రికవరీ చేశామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment