ఆద్యంతం రహస్యం | Conflicts in Hyderabad Police And Center Officials in Atul Sharma Case | Sakshi
Sakshi News home page

ఆద్యంతం రహస్యం

Published Mon, Jun 22 2020 8:39 AM | Last Updated on Mon, Jun 22 2020 8:39 AM

Conflicts in Hyderabad Police And Center Officials in Atul Sharma Case - Sakshi

అతుల్‌ శర్మ (ఫైల్‌)

సాక్షి, సిటీబ్యూరో: సాధారణంగా పోలీసులు ఏ చిన్న నేరగాడిని అరెస్టు చేసినా ప్రెస్‌మీట్లు పెట్టి హడావుడి చేస్తారు. పది తులాల బంగారం రికవరీ అయినా ఉన్నతాధికారులే తెరమీదికి వస్తారు. అలాంటి పోలీసులు ఓ అంతరాష్ట్ర మోసగాడిని అదీ సాక్షాత్తు ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) అడ్వైజర్‌గా చెప్పుకుని రూ.కోట్లలో దండుకున్న ఘరానా నేరగాడిని అత్యంత రహస్యంగా అరెస్టు చేశారు. ఇతడిపై కేసు నమోదు, పీటీ వారెంట్‌పై తీసుకురావడం, బెయిల్‌ పొంది బయటకు వెళ్లిపోవడం ఇలా ప్రతి అంకం  రహస్యంగానే సాగడానికి కారణం అంతుచిక్కట్లేదు. ఈ విషయంలో పోలీసు విభాగానికి, కేంద్ర నిఘా వర్గాలకు మధ్య ఓ కోల్డ్‌వార్‌ జరిగినట్లు తెలిసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారం పూర్వాపరాలు ఇవీ..(సైనేడ్‌ కిల్లర్‌ మోహన్‌ దోషి)

బీహార్‌లో పుట్టి లక్నోలో స్థిరపడి...
బీహార్‌కు చెందిన అతుల్‌ శర్మకు ఆంగ్లంపై మంచి పట్టు ఉంది. దీని ఆధారంగానే అనేక మందితో పరిచయాలు ఏర్పరచుకున్నాడు. ప్రధానంగా డిజిటల్‌ ఫ్లాట్‌ ఫామ్స్‌లో కనిపించే ప్రతి విషయాన్నీ నమ్మే వారినే ఎక్కువగా టార్గెట్‌ చేసేవాడు. తన పేరుతో సోషల్‌మీడియాలో వివిధ బ్లాగులు సృష్టించిన అతను ఖరగ్‌పూర్‌ ఐఐటీ నుంచి ఇంజినీరింగ్‌ పూర్తి చేశానని, ఆపై అమెరికాలోని మసచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ) ఉన్నత చదువులు అభ్యసించినట్లు పేర్కొన్నాడు. ఆ దేశ రక్షణ రంగంలో ఉన్నతోద్యోగం చేసినట్లు ప్రచారం చేసుకోవడమేగాక ‘నాసా’లో సైంటిస్ట్‌గా సేవలు అందించినట్లు అనేక బ్లాగుల్లో రాసుకున్నాడు. అయితే గతంలో అతుల్‌ను అరెస్టు చేసిన ఉత్తరాదికి చెందిన పోలీసులు ఐఐటీ ఖగర్‌పూర్‌లో ఆరా తీయగా... అతను తమ విద్యార్థి కాదంటూ స్పష్టం చేసినట్లు తెలిసింది. దీంతో ఇతడు బ్లాగుల్లో ‘లిఖించిన’ ఇతర అంశాలు వాస్తవ దూరమని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఇతగాడు లక్నోలోని హజ్రత్‌గంజ్‌ ప్రాంతంలో స్థిరపడ్డాడు. (నమ్మించి.. దోచేశాడు!  )

1998 నుంచి వరుస కేసులు...
దేశ ప్రధానికి సాంకేతిక సలహాదారుగా, తన పేరు జైవర్ధన్‌గా పరిచయం చేసుకున్న అతుల్‌ శర్మ 1998లో తొలిసారి గుజరాత్‌కు చెందిన వ్యక్తిని మోసం చేశారు. ఐక్యరాజ్యసమితికి సంబంధించిన కాంట్రాక్టులు ఇప్పిస్తానంటూ డబ్బు వసూలు చేయడంపై అప్పట్లో కేసు నమోదు చేసిన సీబీఐ అతడిని అరెస్టు చేసింది. పీఎంఓ అడ్వైజర్, నాసా మాజీ సైంటిస్ట్‌గా ప్రచారం చేసుకున్న అతుల్‌ శర్మ 2012 నుంచి జైలుకు వెళ్లి వస్తున్నాడు. నాసా సైంటిస్ట్‌ను అంటూ అక్కడ ఓ మహిళను పరిచయం చేసుకున్న అతను అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామాతో కలిసి దిగినట్లు మార్ఫింగ్‌ చేసిన ఫొటోలు చూపించాడు. ఆమె నుంచి రూ.20 లక్షలు తీసుకుని మోసం చేయడంతో కేసు నమోదు చేసిన ముంబైలోని ఓషివార పోలీసులు ఇతడిని అరెస్టు చేశారు. మీరట్‌కు చెందిన ఓ మహిళతోనూ   ‘నాసా’ పేరు చెప్పి వివాహం చేసుకుని మోసం చేశాడు. విషయం తెలుసుకున్న ఆమె నిలదీయగా ఆమెపై హత్యాయత్నం చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులోనూ అతుల్‌ సింగ్‌ జైలుకు వెళ్ళి వచ్చాడు. పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలోని బౌబజార్‌ ఠాణాతో పాటు మీరట్‌లోనూ ఇతడిపై చీటింగ్‌ కేసు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.

పెద్దలతో పరిచయాలు..
అతుల్‌ శర్మకు ఢిల్లీ స్థాయిలో కొందరు పెద్దలతో పరిచయాలు ఉన్నాయి. పోలీసు అధికారులు, బ్యూరోక్రాట్స్, రాజకీయ నాయకులతో స్నేహం చేసేవాడు. ఈ ముసుగులో వారి  సహకారంతో కొన్ని పైరవీలు చేస్తుండటం వృత్తిగా మార్చుకున్నాడు. అయితే హఠాత్తుగా పీఎంఓ అడ్వైజర్‌ అవతారం ఎత్తిన అతుల్‌ సింగ్‌ ప్రధానమంత్రి స్థాయిలో పైరవీలు చేయిస్తానని ప్రచారం చేసుకునేవాడు. ఇలా వివిధ రాష్ట్రాలకు చెందిన సీనియర్‌ అధికారులతో పాటు రక్షణ రంగానికి చెందిన వారికీ ఎర వేశాడు. తనకు ఉన్న పరిచయాలను వినియోగించి కొందరికి పైరవీలు చేసిపెట్టినా అనేక మంది నుంచి డబ్బు వసూలు చేసి మోసం చేశాడు. రంగంలోకి దిగిన కేంద్ర నిఘా వర్గాలు అతుల్‌ శర్మ వ్యవహారం బట్టబయలు చేయడంతో లక్నోలో కేసు నమోదైంది. ఆ పోలీసులు ఈ మోసగాడిని అరెస్టు చేసి విచారించారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లోని అబిడ్స్‌ ప్రాంతంలోనూ ఓ వ్యాపారిని మోసం చేసినట్లు వెలుగులోకి వచ్చింది.

24 గంటల్లో బెయిల్‌..
సదరు వ్యాపారిని సంప్రదించిన కేంద్ర నిఘా వర్గాలు జాతీయ స్థాయిలో ఓ పైరవీ చేస్తానంటూ రూ.కోట్లలో తీసుకున్నట్లు తేలింది. ఆ బాధితుడి ఫిర్యాదుతో అతుల్‌ శర్మపై అబిడ్స్‌ ఠాణాలోనూ కేసు నమోదైంది. అప్పటికే అతగాడు లక్నో జైల్లో ఉన్న విషయం తెలుసుకున్న అబిడ్స్‌ పోలీసులు లాక్‌డౌన్‌కు ముందే పీటీ వారెంట్‌పై తీసుకువచ్చి అరెస్టు చేశారు. కనీసం 24 గంటల కూడా జైల్లో లేకుండానే అతడికి బెయిల్‌ వచ్చింది. దీనికి తోడు ఈ అంతర్రాష్ట్ర మోసగాడు చేసిన మోసం, కేసు నమోదు, పీటీ వారెంట్‌ జారీ, అరెస్టు, బెయిల్‌ పొందడం...  ఇవన్నీ అత్యంత రహస్యంగా జరిగిపోయాయి. ఈ వ్యవహారాన్ని కేంద్ర నిఘా వర్గాలు తప్పుపట్టినట్లు తెలిసింది. అయితే ఎక్కడా విషయం పొక్కనీయకుండా పోలీసులు జాగ్రత్తపడ్డారు. ప్రస్తుతం అతుల్‌ శర్మపై నమోదైన కేసు ఏ స్థితిలో ఉందో కూడా బయటకు చెప్పకుండా రహస్యంగా ఉంచుతున్నారు. దీనికి కారణం కొందరు ‘పెద్దలతో’ అతుల్‌ శర్మకు ఉన్న సంబంధాలే కారణమని సమాచారం. దీనిపై ఉన్నతాధికారులే సమాధానం చెప్పాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement