ఆస్పత్రికి వచ్చిన బాధితుడు రాజు
జనగామ: అపెండెక్స్ నొప్పితో ఓ యువకుడు జిల్లా ప్రధాన ఆస్పత్రికి వస్తే.. వైద్యుల నిర్లక్ష్యంతో.. నాలుగు గంటలపాటు బాధితుడు నిరీక్షించిన ఘటన గురువారం రాత్రి జరిగింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. లింగాలఘనపురం మండలం కుందారం గ్రామానికి చెందిన ఎం.ఆంజనేయులు, లక్ష్మిల కుమారుడు రాజు(17) అపెండెక్స్ నొప్పితో బాధపడుతుండడంతో మధ్యాహ్నం 3 గంటలకు జనగామలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు.
అక్కడి వైద్యులు పరిశీలించి అపెండెక్స్‌గా గుర్తించి ఆపరేషన్ చేయాలని తల్లిదండ్రులకు వివరించారు. ఆర్థిక స్థోమత లేకపోవడంతో కుమారున్ని జిల్లా ప్రధాన ఆస్పత్రికి తీసుకు వచ్చారు. అనస్తిషియా(మత్తు డాక్టర్) వైద్యులు లేరు. వరంగల్ తీసుకు వెళ్లండి అంటూ వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సారూ.. పైసా లేదు.. కొడుకు నొప్పి తట్టుకోవడం లేదు..ఇక్కడే ఆపరేషన్ చేయాలని తల్లిదండ్రులు కాళ్లా వేళ్లా పడ్డా కనికరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
దీంతో ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగడంతో పాటు ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ రఘు, కలెక్టర్ వినయ్‌క్రిష్ణారెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని.. సూపరింటెండెంట్‌ను ఆదేశించడంతో రాత్రి 7.30 గంటలకు ఆపరేషన్ ప్రారంభించారు. పేద కుటుంబాలకు చెందిన రోగులు ఆస్పత్రికి వస్తే.. నిర్లక్ష్యం చేయరాదని కలెక్టర్ మందలించినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment