మంచంపై మన్యం
మండలాల వారీగా నమోదైన జ్వరపీడిత కేసులు
మండలం పీహెచ్‌సీలు జూలై ఆగస్ట్
పోలవరం 4 480 220
బుట్టాయగూడెం 6 2,800 1,500
జీలుగుమిల్లి 2 484 102
కుకునూరు 2 770 300
వేలేరుపాడు 2 1,000 550
కొయ్యలగూడెం 1 300 450
టి.నరసాపురం 2 489 195
పోలవరం : మన్యసీమ విష జ్వరాలతో వణికిపోతోంది. నిత్యం వందలాది మంది జ్వరాల బారిన పడుతూ చికిత్స కోసం పీహెచ్‌సీలను ఆశ్రయిస్తున్నారు. వైరల్ జ్వరాలతోపాటు టైఫాయిడ్, మలేరియా కేసులు సైతం ప్రమాదకర స్థాయిలో నమోదవుతున్నాయి. అక్కడక్కడా బయటపడుతున్న డెంగీ జాడలు కలవరపెడుతున్నాయి. గిరిజన మండలాలైన పోలవరం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, కుకునూరు, వేలేరుపాడుతోపాటు ఏజెన్సీని ఆనుకుని ఉన్న జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, టి.నరసాపురం వంటి మైదాన ప్రాంత మండలాల్లోనూ జ్వరాల కేసులు కలవరపెడుతు న్నాయి. పోలవరం నియోజకవర్గంలో 19 పీహెచ్‌సీలు ఉండగా, వేల సంఖ్యలో జ్వరాల కేసులు నమోదయ్యాయి.
ఈ ఏడాది జూలైలో 6,023, ఆగస్ట్‌లో ఇప్పటివరకు 3,317 కేసులు నమోదయ్యాయి. వీటిలో 20 నుంచి 30 శాతం టైఫాయిడ్ కేసులు కాగా, పదుల సంఖ్యలో మలేరియా బాధితులు సైతం ఆసుపత్రులకు వస్తున్నారు. వైద్యుల కొరత, రక్త పరీక్ష ఫలితాలు ఆలస్యమవుతుండటంతో ప్రైవే టు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇదిలావుంటే వాతావరణంలో మార్పులతోపాటు పంచాయతీలు రక్షిత మంచినీటి పథకాలను క్లోరినేషన్ చేయకపోవడం, గ్రామాల్లో నీరు నిల్వ ఉన్నచోట పారిశుధ్య పనులు చేపట్టకపోవడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. నీటి నమూనాలు సేకరించి పరీక్షించడం లేదు. నెలకు రెండుసార్లు పరీక్షించాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. కాచి చల్లార్చిన నీటి తాగాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రకటనలిస్తూ చేతులు దులిపేసుకుంటున్నారు.