అడ్మిన్ ఎస్పీ షేక్‌షావలికి తన సమస్యను చెప్పుకుంటున్న లక్ష్మీదేవి
కర్నూలు : అదనపు కట్నం కోసం అల్లుడు గర్భిణిగా ఉన్న తన కుమార్తెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని డోన్ పాత పేటకు చెందిన లక్ష్మీదేవి అడ్మిన్ ఎస్పీ షేక్షావలికి ఫిర్యాదు చేశారు. తనకు రెండు కళ్లు కనపడవని, తన కుమార్తె హత్య సంఘటనపై విచారణ జరిపించి తగు న్యాయం చేయాలని ఆమె కోరారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో అడ్మిన్ ఎస్పీ ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 52 ఫిర్యాదులు వచ్చాయి.
ఫిర్యాదుల్లో కొన్ని...
♦ ఎస్వీఆర్ చిట్‌ఫండ్స్ వారు చిట్టీలు కట్టించుకుని మెచ్యూర్ అయినప్పటికీ డబ్బు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని కర్నూలు ప్రజలు ఫిర్యాదు చేశారు. సంఘటనపై విచారణ జరిపి తగు న్యాయం చేయాల్సిందిగా బాధితులు విజ్ఞప్తి చేశారు.
♦ ఏపీ సీడ్స్ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ ఇంజినీర్ ఉద్యోగం ఇప్పిస్తానని ఆళ్లగడ్డకు చెందిన రమణ నాయక్ రూ.5 లక్షలు తీసుకుని మోసం చేశాడని నంద్యాలకు చెందిన రాకేష్‌కుమార్ ఫిర్యాదు చేశారు.
♦ తన కుమారులు ఇంట్లో ఉన్న డబ్బులన్నీ తీసుకుని వెళ్లిపోయారని, ప్రస్తుతం జీవనాధారం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కర్నూలు బండిమెట్టకు చెందిన మహబూబ్ బీ ఫిర్యాదు చేశారు. భర్త అనారోగ్యంతో చనిపోయినందున తనను పోషించాల్సిన బాధ్యత కుమారులు మరచి తన వద్ద ఉన్న డబ్బును కూడా లాక్కుని వెళ్లాపోయారని ఆమె వాపోయారు.
♦ తమ పొలానికి సంబంధించి వేరే వ్యక్తి నకిలీ పాసు పుస్తకం సృష్టించి నంద్యాల ఆంధ్రాబ్యాంకులో రుణం తీసుకుని ఆ మొత్తాన్ని చెల్లించడం లేదని, అతనికి సహకరించి తనను మోసం చేసినవారిపై చర్యలు తీసుకోవాలని రుద్రవరం మండలం మందలూరుకు చెందిన వేణుగోపాల్‌రెడ్డి విన్నవించారు.
♦ తన భర్త అనారోగ్యంతో చనిపోయాడని, అయితే వారసత్వంగా రావాల్సిన ఆస్తిలో భాగం ఇవ్వకుండా భర్త సోదరులు లింగన్న, నానెపాటి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆలూరు మండలం మొలగవేలినికి చెందిన సంధ్య ఫిర్యాదు చేశారు. తనకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని, భర్త చనిపోయిన తర్వాత హైదరాబాదులో కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నామని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
♦ ప్రజాదర్బార్, డయల్ యువర్ ఎస్పీకి వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అడ్మిన్ ఎస్పీ హామీ ఇచ్చారు. లీగల్ అడ్వైజర్ మల్లికార్జునరావు, డీఎస్పీలు బాబుప్రసాద్, హుసేన్ పీరా, వెంకటాద్రి ల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment