
ఇంట్లో నిల్వ ఉంచిన కల్తీనూనె డబ్బాలు .టాయిలెట్‌లో నూనె, నూనె నింపడానికి ఉంచిన డబ్బాలు
విశాఖ సిటీ ,సీతమ్మధార (విశాఖ దక్షిణ) :
విశాఖలో కల్తీ వంట నూనె మాఫియా గుట్టురట్టయింది. నగరం నడి మధ్యలో మద్దిలపాలెం వద్ద గల కృష్ణా కళాశాల సమీపంలోని ఓ ఇంట్లో భారీ కల్తీ నూనెను విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఇంట్లో భద్రపరిచిన నూనె డబ్బాలను చూసిన విజిలెన్స్ అధికారులకే కళ్లు బైర్లు కమ్మాయి. వినియోగించిన నూనెను వివిధ ప్రాంతాల నుంచి సేకరించి రసాయనాలు కలిపి శుద్ధమైన నూనెగా మార్చుతున్నట్టు అధికారులు నిర్ధారించారు. నగరంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 4500 లీటర్ల కల్తీ వంటనూనెను గుర్తించారు. 20 లీటర్ల చొప్పున డబ్బాల్లో నిల్వచేశారు. ఇద్దరు నిర్వాహకులతో పాటు వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ టు విశాఖ
హైదరాబాద్‌లోని పలు హోటళ్లలో వినియోగించిన నూనెను వీరు కొనుగోలు చేస్తున్నట్టు విజిలెన్స్ అధికారులు తేల్చారు. తిరిగి అదే ఆయిల్‌ను కెమికల్ ట్రీట్ మెంట్ ద్వారా రీసైక్లింగ్ చేసి మళ్లీ హోటల్స్‌కు విక్రయిస్తున్నారు. పక్కాసమాచారంతో మంగళవారం మధ్యాహ్నం కృష్ణా కళాశాల సమీపంలో ఒక ఇంటిపై ఆకస్మిక దాడులు చేసి డబ్బాల్లో నిల్వ చేసిన 4,500 లీటర్ల కల్తీ నూనెను స్వాధీనం చేసుకున్నారు.
పక్కా సమాచారంతో దాడులు
విజిలెన్స్ డీఎస్పీ సీఎంనాయుడు మాట్లాడుతూ ఎస్పీ కోటేశ్వరావు ఆదేశాల మేరకు పక్కా సమాచారంతో దాడులు నిర్వహించినట్లు తెలిపారు. మద్దిలపాలెం హెచ్‌బీకాలనీ దరి కృష్ణా కళాశాల సమీపంలోని ఓ ఇంట్లో కల్తీనూనె నిల్వ ఉంచినట్లు గుర్తించామన్నారు. ఈ డబ్బాల్లో ఉన్న నూనెను ఎవరికీ అనుమానం రాకుండా ట్యాంకర్లలో వేసి విశాఖ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు. ఆహరభద్రతా అధికారులు పరిశీలించారని డబ్బాలపై ఎలాంటి కంపెనీ పేరు లేదని, లైసెన్స్ లేదని తేల్చినట్టు చెప్పారు. వీరు నెల రోజులు కిందట ఇల్లు అద్దెకు తీసుకున్నట్లు తెలిపారు. నిర్వాహకులు అప్పలనాయుడు, రవీంద్రరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. కల్తీనూనెను తరలించడానికి సిద్ధం చేసిన వాహనానికి ముందు భాగంలో నెంబరు ప్లేట్ లేదని చెప్పారు.
రీసైక్లింగ్‌తో మళ్లీ వినియోగం
ఫుడ్ కంట్రోలర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ నగరంలో పెద్ద పెద్ద హోటల్స్‌లో ఒక సారి వాడిన నూనెను వ్యాపారులు కొనుగోలు చేసి, చిన్న హోటల్స్, తోపుడుబళ్లు వ్యాపారులకు అమ్మకాలు చేస్తారని ప్రాథమిక సమాచారం అందినట్లు తెలిపారు. సేరించిన కల్తీనూనెను హైదరాబాద్ ల్యాబ్‌కు పంపిస్తున్నట్లు తెలిపారు. దీనిపై రెండు కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ నాయుడు తెలిపారు. ఈ దాడుల్లో సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ రమేష్, డీసీటీవో మోహన్, సహాయ ఆహరభద్రతాధికారులు అప్పారావు, ఏఎస్‌వో ప్రసాద్ పాల్గొన్నారు.

టాయిలెట్‌లో నూనె, నూనె నింపడానికి ఉంచిన డబ్బాలు

నూనె నింపడానికి ఉంచిన డబ్బాలు

విచారిస్తున్న డీఎస్పీ నాయుడు



ఇంట్లో నిల్వ ఉంచిన కల్తీనూనె డబ్బాలు .

కల్తీనూనె తరలించడానికి సిద్ధం చేసిన వ్యాన్

కల్తీనూనె తరలించడానికి సిద్ధం చేసిన వ్యాన్




విచారిస్తున్న డీఎస్పీ నాయుడు