Fake oil
-
నగరంలో కల్తీ నూనె కలకలం
విశాఖ సిటీ ,సీతమ్మధార (విశాఖ దక్షిణ) : విశాఖలో కల్తీ వంట నూనె మాఫియా గుట్టురట్టయింది. నగరం నడి మధ్యలో మద్దిలపాలెం వద్ద గల కృష్ణా కళాశాల సమీపంలోని ఓ ఇంట్లో భారీ కల్తీ నూనెను విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఇంట్లో భద్రపరిచిన నూనె డబ్బాలను చూసిన విజిలెన్స్ అధికారులకే కళ్లు బైర్లు కమ్మాయి. వినియోగించిన నూనెను వివిధ ప్రాంతాల నుంచి సేకరించి రసాయనాలు కలిపి శుద్ధమైన నూనెగా మార్చుతున్నట్టు అధికారులు నిర్ధారించారు. నగరంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 4500 లీటర్ల కల్తీ వంటనూనెను గుర్తించారు. 20 లీటర్ల చొప్పున డబ్బాల్లో నిల్వచేశారు. ఇద్దరు నిర్వాహకులతో పాటు వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ టు విశాఖ హైదరాబాద్‌లోని పలు హోటళ్లలో వినియోగించిన నూనెను వీరు కొనుగోలు చేస్తున్నట్టు విజిలెన్స్ అధికారులు తేల్చారు. తిరిగి అదే ఆయిల్‌ను కెమికల్ ట్రీట్ మెంట్ ద్వారా రీసైక్లింగ్ చేసి మళ్లీ హోటల్స్‌కు విక్రయిస్తున్నారు. పక్కాసమాచారంతో మంగళవారం మధ్యాహ్నం కృష్ణా కళాశాల సమీపంలో ఒక ఇంటిపై ఆకస్మిక దాడులు చేసి డబ్బాల్లో నిల్వ చేసిన 4,500 లీటర్ల కల్తీ నూనెను స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో దాడులు విజిలెన్స్ డీఎస్పీ సీఎంనాయుడు మాట్లాడుతూ ఎస్పీ కోటేశ్వరావు ఆదేశాల మేరకు పక్కా సమాచారంతో దాడులు నిర్వహించినట్లు తెలిపారు. మద్దిలపాలెం హెచ్‌బీకాలనీ దరి కృష్ణా కళాశాల సమీపంలోని ఓ ఇంట్లో కల్తీనూనె నిల్వ ఉంచినట్లు గుర్తించామన్నారు. ఈ డబ్బాల్లో ఉన్న నూనెను ఎవరికీ అనుమానం రాకుండా ట్యాంకర్లలో వేసి విశాఖ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు. ఆహరభద్రతా అధికారులు పరిశీలించారని డబ్బాలపై ఎలాంటి కంపెనీ పేరు లేదని, లైసెన్స్ లేదని తేల్చినట్టు చెప్పారు. వీరు నెల రోజులు కిందట ఇల్లు అద్దెకు తీసుకున్నట్లు తెలిపారు. నిర్వాహకులు అప్పలనాయుడు, రవీంద్రరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. కల్తీనూనెను తరలించడానికి సిద్ధం చేసిన వాహనానికి ముందు భాగంలో నెంబరు ప్లేట్ లేదని చెప్పారు. రీసైక్లింగ్‌తో మళ్లీ వినియోగం ఫుడ్ కంట్రోలర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ నగరంలో పెద్ద పెద్ద హోటల్స్‌లో ఒక సారి వాడిన నూనెను వ్యాపారులు కొనుగోలు చేసి, చిన్న హోటల్స్, తోపుడుబళ్లు వ్యాపారులకు అమ్మకాలు చేస్తారని ప్రాథమిక సమాచారం అందినట్లు తెలిపారు. సేరించిన కల్తీనూనెను హైదరాబాద్ ల్యాబ్‌కు పంపిస్తున్నట్లు తెలిపారు. దీనిపై రెండు కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ నాయుడు తెలిపారు. ఈ దాడుల్లో సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ రమేష్, డీసీటీవో మోహన్, సహాయ ఆహరభద్రతాధికారులు అప్పారావు, ఏఎస్వో ప్రసాద్ పాల్గొన్నారు. -
గోల్డ్ ప్లస్ పేరుతో నకిలీ నూనె
కాకినాడ: గోల్డ్ ప్లస్ ఆయిల్ పేరుతో నకిలీ నూనె తయారు చేస్తున్న కంపెనీపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని పారిశ్రామిక వాడలో శనివారం వెలుగు చూసింది. కల్తీ నూనె తయారు చేస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు 900 ఆయిల్ క్యాన్లను స్వాధీనం చేసుకున్నారు. దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. పూర్తి వివారలు తెలియాల్సి ఉంది. -
6వేల లీటర్ల కల్తీ నూనె స్వాధీనం
ఎర్రగుంట్ల: తుది గడువు దాటిపోయిన ఆయిల్ ప్యాకెట్లపై తేది మార్చి విక్రయించేందుకు గొడౌన్లో నిల్వ ఉంచారని సమాచారం అందుకున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో అధికారులు సుమారు 6 వేల లీటర్ల కల్తీ నూనెను స్వాధీనం చేసుకున్నారు. పట్టబడిన ఆయిల్ విలువ సుమారు రూ. 7.5 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్లలో 3ఎఫ్ కంపెనీకి చెందిన ఆయిల్ గోడౌన్లో అక్రమంగా తేదిలు మార్చి నిల్వ ఉంచారని సమాచారం అందడంతో అధికారులు దాడులు చేసి గొడౌన్ యజమానిని అదుపులోకి తీసుకున్నారు. -
నకిలీ నూనె దందా
కోదాడటౌన్ : కోదాడ కేంద్రంగా ఓ ఆయిల్ మిల్లు యజమాని కొంత కాలంగా చేస్తున్న నకిలీ నూనె దందా బట్ట బయలైంది. శనివారం హైదరాబాద్‌లో ఆయిల్‌ఫెడ్ అధికారులకు పట్టుబడ్డ నకిలీ నూనె ట్యాంకర్ కోదాడ నుంచి వచ్చిందని అధికారులు తేల్చడంతో స్థానికంగా సంచలనం కలిగించింది. మూతపడ్డ ఆయిల్ మిల్లు పేరుతో కొంత కాలంగా ఈ నకిలీదందా కొనసాగుతున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో ఉన్న మిల్లు కేంద్రంగా నకిలీ వేరుశనగ నూనెను సరఫరా చేస్తూ కోదాడ నుంచి సరఫరా చేస్తున్నట్లు కాగితాల మీద చూపుతున్నట్లు సమాచారం. కోదాడలోని శ్రీనివాస థియేటర్ సమీపంలో ఆయిల్ మిల్లు ఉండేది. దీనిని కోదాడకు చెందిన విజయలక్ష్మి ఆయిల్ కార్పొరేషన్ వారు నడుపుతున్నారు. కోదాడ పరిసర ప్రాంతాలలో గడిచిన 15 సంవత్సరాల నుంచి వేరుశనగ పంట పండించక పోవడంతో ఈ మిల్లు మూత పండింది. దీంతో సదరు కార్పొరేషన్ వారు ఇతర ప్రాంతాల నుంచి నూనెను ట్రేడింగ్ పేరుతో సేకరించి ఆయిల్‌ఫెడ్‌కు సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. దీని కోసం హైదరాబాద్‌లోని దిల్సుఖ్నగర్ ప్రాంతంలో ఓ మిల్లును తీసుకొని కోదాడ మిల్లు పేరుతో వ్యాపారం కొనసాగిస్తున్నారు. కోదాడలో రెండు దుకాణాలను తీసుకొని వీరు వేరుశనగ నూనెను రిటైల్, హోల్‌సేల్‌గా అమ్మకాలు కూడా కొనసాగిస్తున్నారు. మిల్లు యజమాని వివరణ తాము నూనెను ట్రేడింగ్ చేస్తామని, కల్తీతో తమకు ఎటువంటి సంబంధం లేదని కోదాడ విజయలక్ష్మి ఆయిల్ కార్పొరేషన్ యజమాని శంకర్ చెప్పా రు. క్వాలిటీ లేక పోతే తాము సరఫరా చేసిన నూనెను వెనక్కి తీసుకుంటామన్నారు. నూనె తాము తయారు చేసింది కాదని కేవలం ట్రేడింగ్ మాత్రమే చేశామన్నారు. మూత పడ్డ మిల్లుకు దీనికి సంబంధం లేదన్నారు. ఆయిల్‌ఫెడ్‌లో ఉన్న ఆంధ్రా తెలంగాణ అధికారులకు పడక తమపై బురదజల్లుతున్నారని ఆరోపించారు.