కోదాడ కేంద్రంగా ఓ ఆయిల్ మిల్లు యజమాని కొంత కాలంగా చేస్తున్న నకిలీ నూనె దందా బట్ట బయలైంది. శనివారం హైదరాబాద్‌లో
కోదాడటౌన్ : కోదాడ కేంద్రంగా ఓ ఆయిల్ మిల్లు యజమాని కొంత కాలంగా చేస్తున్న నకిలీ నూనె దందా బట్ట బయలైంది. శనివారం హైదరాబాద్‌లో ఆయిల్‌ఫెడ్ అధికారులకు పట్టుబడ్డ నకిలీ నూనె ట్యాంకర్ కోదాడ నుంచి వచ్చిందని అధికారులు తేల్చడంతో స్థానికంగా సంచలనం కలిగించింది. మూతపడ్డ ఆయిల్ మిల్లు పేరుతో కొంత కాలంగా ఈ నకిలీదందా కొనసాగుతున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో ఉన్న మిల్లు కేంద్రంగా నకిలీ వేరుశనగ నూనెను సరఫరా చేస్తూ కోదాడ నుంచి సరఫరా చేస్తున్నట్లు కాగితాల మీద చూపుతున్నట్లు సమాచారం.
కోదాడలోని శ్రీనివాస థియేటర్ సమీపంలో ఆయిల్ మిల్లు ఉండేది. దీనిని కోదాడకు చెందిన విజయలక్ష్మి ఆయిల్ కార్పొరేషన్ వారు నడుపుతున్నారు. కోదాడ పరిసర ప్రాంతాలలో గడిచిన 15 సంవత్సరాల నుంచి వేరుశనగ పంట పండించక పోవడంతో ఈ మిల్లు మూత పండింది. దీంతో సదరు కార్పొరేషన్ వారు ఇతర ప్రాంతాల నుంచి నూనెను ట్రేడింగ్ పేరుతో సేకరించి ఆయిల్‌ఫెడ్‌కు సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. దీని కోసం హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతంలో ఓ మిల్లును తీసుకొని కోదాడ మిల్లు పేరుతో వ్యాపారం కొనసాగిస్తున్నారు. కోదాడలో రెండు దుకాణాలను తీసుకొని వీరు వేరుశనగ నూనెను రిటైల్, హోల్‌సేల్‌గా అమ్మకాలు కూడా కొనసాగిస్తున్నారు.
మిల్లు యజమాని వివరణ
తాము నూనెను ట్రేడింగ్ చేస్తామని, కల్తీతో తమకు ఎటువంటి సంబంధం లేదని కోదాడ విజయలక్ష్మి ఆయిల్ కార్పొరేషన్ యజమాని శంకర్ చెప్పా రు. క్వాలిటీ లేక పోతే తాము సరఫరా చేసిన నూనెను వెనక్కి తీసుకుంటామన్నారు. నూనె తాము తయారు చేసింది కాదని కేవలం ట్రేడింగ్ మాత్రమే చేశామన్నారు. మూత పడ్డ మిల్లుకు దీనికి సంబంధం లేదన్నారు. ఆయిల్‌ఫెడ్‌లో ఉన్న ఆంధ్రా తెలంగాణ అధికారులకు పడక తమపై బురదజల్లుతున్నారని ఆరోపించారు.