ఉమెన్స్‌ హాస్టల్లో హైటెన్షన్‌ | hi tntion in womens hostel in kadapa | Sakshi
Sakshi News home page

ఉమెన్స్‌ హాస్టల్లో హైటెన్షన్‌

Published Tue, Oct 10 2017 10:46 AM | Last Updated on Tue, Oct 10 2017 10:46 AM

hi tntion in womens hostel in kadapa

కళాశాల ఆవరణలో బైఠాయించిన విద్యార్థినులతో మాట్లాడుతున్న ప్రిన్సిపాల్, సీఐ

వైఎస్‌ఆర్‌ జిల్లా, వైవీయూ : కడపలోని ఎస్‌కేఆర్‌ అండ్‌ ఎస్‌కేఆర్‌ మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్‌లో సోమవారం ఉద్రిక్తత నెలకొంది. ఆ హాస్టల్‌ విద్యార్థిని అస్వస్థతకు గురి కావడంతో విద్యార్థినులు, విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనకు దిగడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.  ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్‌కేఆర్‌ అండ్‌ ఎస్‌కేఆర్‌ మహిళా డిగ్రీ కళాశాల ఆవరణలోనే కళాశాలకు అనుబంధంగా కోటిరెడ్డి రామసుబ్బమ్మ మహిళా హాస్టల్‌ ఉంది. కళాశాలలో 63 గదులు ఉండగా.. ఇందులో 370 మంది విద్యార్థినులు ఉంటున్నారు. ఆదివారం రాత్రి 9.30 గంటల సమయంలో చక్రాయపేట మండలం సురభి ప్రాంతానికి చెందిన రైతు పోతా నాగరాజు కుమార్తె అయిన గీతాంజలి అనే బీకాం ద్వితీయ సంవత్సరం విద్యార్థిని ఒక్కసారిగా కళ్లు తిరిగి స్పృహ కోల్పోయింది. అదే సమయంలో ఆమెకు నరాలు బిగుసుకుపోయి ఫిట్స్‌ రావడంతో కళ్లు తేలేయడంతో.. విద్యార్థినులు భయభ్రాంతులకు గురై కేకలు వేశారు.

విద్యార్థినిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు కొందరు విద్యార్థినులు ప్రయత్నించగా.. కాపలాగా ఉండాల్సిన వాచ్‌మెన్‌ కళాశాల ప్రధాన గేటుకు తాళం వేసి ఎక్కడికో వెళ్లిపోయాడు. దీంతో విద్యార్థినులకు ఏమి చేయాలో పాలుపోక హాస్టల్‌ కేర్‌టేకర్‌కు, డిప్యూటీ వార్డెన్‌లకు ఫోన్‌లు చేశారు. అంతలోపు కొందరు విద్యార్థినులు ధైర్యం చేసి విద్యార్థినిని ఓ టేబుల్‌పై వేసుకుని గేటు వరకు తీసుకెళ్లి 6 అడుగులకు పైగా ఉన్న గేటుపైకి అమ్మాయిలు ఎక్కి.. అవతలి వైపునకు దింపి వెంటనే కడపలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. దీంతో విద్యార్థినులు రాత్రంతా జాగారం చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇంత జరుగుతున్నా అటువైపుగా హాస్టల్‌ డిప్యూటీ వార్డెన్, చీఫ్‌ వార్డెన్‌ రాకపోవడంతో విద్యార్థినుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీనికి తోడు హాస్టల్‌ వాచ్‌మన్‌ తాత్కాలిక ఉద్యోగి కావడంతో తన బాధ్యతల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని పలుమార్లు చెప్పినప్పటికీ.. అతనిపై చర్యలు తీసుకోకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని విద్యార్థినులు పేర్కొన్నారు.

గేటుకు తాళం వేసి...
సోమవారం ఉదయం 9 గంటల సమయంలో కళాశాలకు డేస్కాలర్‌ విద్యార్థులు, అధ్యాపకులు రావడం ప్రారంభించారు. అప్పటికే కళాశాల ప్రధాన గేటుకు హాస్టల్‌ విద్యార్థినులు తాళం వేసి లోపల బైఠాయించి ఆందోళనకు దిగారు. వీరికి మద్దతుగా విద్యార్థి సంఘాల నాయకులు ప్రవేశించడంతో వ్యవహారం తీవ్రరూపం దాల్చింది. దీంతో ప్రిన్సిపాల్‌కు, వార్డెన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థినుల ప్రాణాలు పోతే బాధ్యులెవరంటూ ప్రశ్నించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ నినదించారు. అప్పటికే పోలీసులు రంగప్రవేశం చేయడంతోపాటు ఇద్దరు విద్యార్థి సంఘ నాయకులను తీసుకెళ్లేందుకు యత్నించడంతో విద్యార్థినులు అడ్డుకున్నారు. దీంతో గేటు బయట మరికొందరు విద్యార్థి సంఘాల నాయకులు అక్కడికి చేరుకుని గేటును తోసుకువచ్చే యత్నం చేశారు. దీంతో గేటును గట్టిగా ఊపుతూ.. విద్యార్థి నాయకులను లోనికి రానివ్వరా అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ప్రిన్సిపాల్‌ వచ్చి సమాధానం చెప్పాలంటూ వారు పట్టుపట్టారు.

దీంతో ప్రిన్సిపాల్‌ విద్యార్థి నాయకుల వద్దకు వచ్చి.. మీ దృష్టికి వచ్చిన సమస్యలను లిఖిత పూర్వకంగా రాసిస్తే పరిష్కరిస్తామని పేర్కొన్నారు. అనంతరం వన్‌టౌన్‌ సీఐ టి.వి. సత్యనారాయణ, తాలూకా సీఐ డి.భాస్కర్‌రెడ్డి పలుమార్లు విద్యార్థినులు, కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులతో చర్చలు జరిపారు.  వారి సమస్యలు ఏంటో తెలుసుకుని.. వాటిని పరిష్కరించాలని అధ్యాపక బృందానికి సూచించారు. దీంతో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి. సుబ్బలక్షుమ్మ విద్యార్థినుల వద్దకు విచ్చేసి వారి డిమాండ్లను పరిష్కరిస్తామని.. విద్యార్థినులు పేర్కొన్న సమస్యలన్నింటినీ వారం రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థినులు ఆందోళన విరమించారు. అనంతరం విద్యార్థి సంఘ నాయకులు ప్రిన్సిపాల్‌ చాంబర్‌లో ప్రిన్సిపాల్‌తో మాట్లాడి వినతిపత్రం అందజేశారు. దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఆందోళన కార్యక్రమాలతో కళాశాల అట్టుడికింది.

కన్నీటి పర్యంతమైన తండ్రి
అస్వస్థతకు గురైన విద్యార్థిని గీతాంజలిని ఆస్పత్రిలో చూసిన ఆమె తండ్రి నాగరాజు కన్నీటి పర్యంతమయ్యాడు. అయితే ప్రస్తుతానికి ఎటువంటి ప్రమాదం ఏమీ లేకపోయినప్పటికీ.. కుమార్తెను అలా బెడ్‌పైన చూడగానే బాధను ఆపుకోలేకపోయాడు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ తన కుమార్తెకు గతంలో ఎటువంటి ఫిట్స్‌ కానీ అనారోగ్య సమస్యలు కానీ లేవని తెలిపారు. అయితే ఎందుకిలా జరిగిందో కానీ.. సకాలంలో తోటి విద్యార్థినులే కాపాడారన్నారు. హాస్టల్‌ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధను వ్యక్తం చేశాడు. అనంతరం విద్యార్థినిని, ఆయన తండ్రిని కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి.సుబ్బలక్షుమ్మ, అధ్యాపకులు, విద్యార్థినులు పరామర్శించారు. విద్యార్థినికి అయ్యే వైద్య ఖర్చులు భరిస్తామని.. ఎటువంటి ఆందోళన చెందవద్దని వారు ఓదార్చారు. అనంతరం ఖర్చుల నిమిత్తం కొంత మొత్తాన్ని అందజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement