ప్రమాద స్థలంలో చెల్లాచెదురుగా మృతదేహాలు
పెనుకొండ: అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని సత్తారుపల్లి వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బొలెరో వాహనాలు ఢీ కొన్న ఘటనలో 8 మంది మరణించారు. మరో 18 మంది గాయపడ్డారు. రొద్దం మండలం ఎల్.తిమ్మాపురం, లక్సానుపల్లి గ్రామాల నుంచి ఉదయం 6.45 గంటల సమయంలో టాప్‌లెస్ బొలెరో వాహనం (ఏపీ02 టీజే 0867)లో 26 మంది అనంతపురానికి బయలుదేరారు. పెనుకొండ మండలంలోని సత్తారుపల్లి వద్ద ఈ వాహనాన్ని ధర్మవరం సమీపంలోని దాడితోట నుంచి కర్ణాటకలోని టుంకూరుకు అరటి గెలలను తీసుకెళ్తున్న మరో బొలెరో వాహనం (ఏపీ02 టీహెచ్1409) 7.10 గంటల సమయంలో ఢీకొంది. ప్రమాదంలో అనంతపురానికి వెళ్తున్న వాహనంలోని ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. క్షతగాత్రుల్లో ఇద్దరు అనంతపురం, బెంగళూరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, 15 మందికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని స్థానికులు, పోలీసులు పెనుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల్లో లక్సానుపల్లికి చెందిన గోపాల్‌రెడ్డి (60), రవీంద్రరెడ్డి (50), ఎల్.తిమ్మాపురానికి చెందిన జి.ఆంజనేయులు (40), వెంకప్ప (60), వడ్డి ఆంజనేయులు (38), వెంకటస్వామి (68), వడ్డి భీమయ్య (65), నారాయణప్ప (40) ఉన్నారు. మృతులంతా వ్యవసాయ కూలీలే. రెండు వాహనాల డ్రైవర్లు రాజేష్, శివారెడ్డి పరారీలో ఉన్నారు.
అతివేగమే ప్రాణాలు తీసింది
ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అత్యంత వేగంగా వెళ్తున్న రెండు వాహనాలు నియంత్రణ కోల్పోవడంతోనే దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. కూలీలతో ఉన్న వాహనం బోల్తా పడిన తర్వాత 100 అడుగుల మేర రోడ్డుపై ఈడ్చుకుని వెళ్లడంతోనే మృతుల సంఖ్య పెరిగిందని చెబుతున్నారు. మృతుల్లోని వెంకప్ప చెయ్యి తెగిపడటం చూస్తే ప్రమాద తీవ్రత అర్థమవుతోంది. డ్రైవర్ వేగంగా నడుపుతుండటంతో ఆ బొలెరోలే ఎక్కిన కొంతమంది అంతకు ముందు రొప్పాల గ్రామం వద్ద దిగి మరో వాహనంలో వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. మృతదేహాలను ట్రాక్టర్‌లో పెనుకొండ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అక్కడి చేరుకున్న మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల రోదన ఒక్కసారిగా మిన్నంటింది. ఇంటి నుంచి వెళ్లిన అరగంటలోపే విగతజీవులుగా మారిన తమ వారి మృతదేహాలపై పడి రోదించిన తీరు అందరినీ కలచివేసింది.
వైఎస్సార్‌సీపీ నేతల పరామర్శ
ప్రమాద సమాచారం తెలుసుకున్న మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ గోపాల్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త నదీం అహ్మద్, పెనుకొండ సమన్వయకర్త శంకరనారాయణ, కదిరి సమన్వయకర్త డాక్టర్ సిద్ధారెడ్డి తదితరులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఓఎస్‌డీ చౌడేశ్వరి, పెనుకొండ ఇన్‌చార్జి డీఎస్పీ వెంకటరమణను అడిగి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. అనంతరం బాధిత కుటుంబాలను పరామర్శించారు.
రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సత్తారుపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతిచెందడంపై ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘోర ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకుని ఆరోగ్యంగా ఉండాలని ఆయన ప్రార్థించారు.
Comments
Please login to add a commentAdd a comment