
హస్తినాపురం: రాచకొండ కమిషనరేట్ పరిధిలోని వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. భార్య, రెండేళ్ల కుమారుడిని హత్యచేసి ప్లాస్టిక్ డ్రమ్ములో కుక్కి ఇంట్లో నుంచి వ్యక్తి వెళ్లిపోయాడు. దుర్వాసన రావడంతో ఇంటి యజమాని మంగళవారం రాత్రి వనస్థలిపురం పోలీసులకు సమాచారం అందించాడు. ఈ సంఘటన నాలుగు రోజుల క్రితం జరిగి ఉండవచ్చునని మృతురాలి భర్త హత్యచేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం కొత్తపల్లికి చెందిన గౌరవరపు రాజమ్మ, ఉప్పలయ్య దంపతులు తన కూతురు కవిత, కొడుకుతో కలిసి మన్సూరాబాద్‌లో నివాసముంటున్నారు. ఇంటి పక్కన ఒడిషాకు చెందిన ఆయూబ్, కవితను ప్రేమించి నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు.
గత 18 నెలలుగా సయ్యద్ ఇబ్రహిం ఇంట్లో రెండేళ్లుగా కుమారుడు ఇర్ఫాన్‌తో కలిసి ఆయూబ్, కవిత దంపతులు అద్దెకుంటున్నారు. ఆయూబ్ ఆటోనగర్‌లోని ఇసుక లారీల అడ్డాలో కూలీగా పనిచేస్తున్నాడు. భార్యాభర్తల మధ్య శనివారం గొడవ జరిగింది. అనంతరం భార్య కవిత, కుమారుడు ఇర్ఫాన్‌ను హత్యచేసి వారిద్దరి శవాలను డ్రమ్ములో కుక్కి పారిపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎల్‌బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, వనస్థలిపురం ఏసీపీ గాంధీనారాయణ, వనస్థలిపురం క్రైం సీఐ జగన్నాథం, హయత్‌నగర్ సీఐ సతీష్ ఘటనా స్థలానికి చేరుకొని డ్రమ్ములో ఉన్న రెండు మృతదేహాలను బయటికి తీశారు. కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి మృతదేహాలను తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment