వివరాలు వెల్లడిస్తున్న పాలకొండ డీఎస్పీ స్వరూపారాణి. వెనుక నిందితుడు వెంకటరమణ
శ్రీకాకుళం,కొత్తూరు: మావోయిస్టుల పేరుతో పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తిని అరెస్టు చేసి గురువారం కోర్టులో హాజరుపర్చినట్లు పాలకొండ డీఎస్పీ స్వరూపరాణి తెలిపారు. ఈ మేరకు గురువారం కొత్తూరు పోలీస్‌స్టేషన్‌లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. కొత్తూరు మండలం మెట్టూరు బిట్–3 పునరావాస కాలనీకి చెందిన ఇరపాడు నిర్వాసితుడు వి.వెంకటరమణ మావోయిస్టుల పేరుతో ఎమ్మెల్యే నుంచి సొమ్ము వసూలు చేయాలని పథకం పన్నాడు. దీనిలో భాగంగా ఈ నెల 23న లబ్బ నుంచి బైక్‌పై ఇంటికి వస్తున్న తనను మార్గమధ్యంలో మావోయిస్టులు ఆపారని, ఎమ్మెల్యే సన్నిహితుడు ఎం.సీతారాం ద్వారా రూ.40 లక్షలు తీసుకురావాలని చెప్పినట్లు కట్టుకథ అల్లాడు.
ఈ విషయాన్ని సీతారాంకు చెప్పాడు. వీరిద్దరూ కలిసి ఈ నెల 24న మాతల గ్రామంలో ఉంటున్న ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ఇంటికి వెళ్లి విషయం చెప్పారు. వెంటనే ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు మెట్టూరు వద్ద ఈ నెల 24న వెంకటరమణను అదుపులోకి తీసుకొని విచారించారు. తనకు మావోయిస్టులు ఎవరూ వసూలు చేయమని చెప్పలేదని, తానే అప్పులు బాధతో ఇలా చేశానని పోలీసుల ఎదుట వెంకటరమణ అంగీకరించాడు. కాంట్రాక్టు పనులు చేసి సుమారు రూ.10 లక్షలు అప్పుల పాలయ్యాయని చెప్పాడు. అనంతరం వెంకటరమణను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. విలేకరుల సమావేశంలో సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ రవికుమార్ పాల్గొన్నారు.
మావోయిస్టుల కదలికలు లేవు..
సీతంపేట, భామిని, కొత్తూరుతో పాటు జిల్లాలో మావోయిస్టులు కదలికలు లేవని డీఎస్పీ స్వరూపరాణి స్పష్టం చేశారు. మావోయిస్టుల పేరుతో ఎవరైనా బెదిరింపులు చేస్తే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. బెదిరింపులు చేసినట్లు రుజువైతే నాన్ బెయిల్ కేసు నమోదు చేయడంతో పాటు ఏడేళ్ల జైలు శిక్ష పడుతుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment