
సాక్షి, హైదరాబాద్: నిలోఫర్ కిడ్నాప్ కేసులో మరో కొత్త కోణం బయటికొచ్చింది. శిశువును కిడ్నాప్ చేసిన మంజుల అనే మహిళ శిశువు తనకే పుట్టినట్టు భర్త కుమార్ గౌడ్, అత్త, బంధువులను నమ్మించింది. తనకు 5 నెలల క్రితమే అబార్షన్ అయినా భర్త, కుటుంబ సభ్యులకి ఈ విషయం తెలియనీయకుండా మంజుల జాగ్రత్తలు తీసుకుంది. బాబు పుట్టాడు అని భర్త కుమార్‌కు కిడ్నాప్ చేసిన రోజు ఫోన్ చేసి పేట్ల బురుజు ఆసుపత్రికి రప్పించింది. మంజుల మాటలను నమ్మి ఆసుపత్రికి వెళ్లి బాబుని తీసుకుని స్వగృహానికి కుమార్ గౌడ్ వచ్చాడు. సోమవారం ఉదయం బాబు చనిపోవడంతో తన బాబే చనిపోయినట్టు భావించి పూడ్చి పెట్టినట్లు పోలీసుల ఎదుట కుమార్ గౌడ్ చెప్పారు. తన భార్య మంజుల మోసం చేసిందని తెలుసుకుని ఆవేదన వ్యక్తం చేశాడు.
పూడ్చిన బాబును బయటకి తీశాక డీఎన్ఏ టెస్ట్ నిర్వహించనున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇరు కుటుంబాలు నాగర్ కర్నూలు జిల్లా బండోపల్లిలో చిన్నారిని పూడ్చిపెట్టిన స్థలానికి చేరుకున్నాయి. శిశువు సమాధి వద్ద కన్నతండ్రి భోరున విలపించడం అక్కడున్నవారిని కదిలిచింది. పోలీస్ బందోబస్తు నడుమ వైద్యుల బృందం శిశువు మృతదేహాన్ని వెలికితీసింది. ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు స్థానికులు ఇక్కడికి భారీగా తరలివచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment