పిన్నిక సుధాకర్, సంధ్య (ఫైల్), తరుణ్ (ఫైల్) ,ధనుంజయ్
చీమకుర్తి రూరల్: ‘పోయినేడు పెద్ద కొడుకును పొట్టన పెట్టుకుంది. ఇప్పుడు రెండో వాడిని రాక్షసంగా చంపేసింది. ఉన్న కొడుకులిద్దరూ పోతే మేము ఇంకెవరి కోసం బతకాలి’ అంటూ విషాహారానికి గురై మృతి చెందిన 4 ఏళ్ల బాలుడు ధనుంజయ్ తల్లిదండ్రులు పిన్నిక సుధాకర్, సంధ్య భోరున విలపిస్తున్నారు. ఓదారుస్తున్నా సుధాకర్, సంధ్య ఇప్పట్లో కోలుకునేలా కనిపించటం లేదని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిడతలపూడి గ్రామానికి చెందిన పిన్నిక ధనుంజయ్(4)ను అదే గ్రామానికి చెందిన ఆశా కార్యకర్త వేల్పుల జ్యోతి కుర్‌కురే ప్యాకెట్లో ఎలుకల మందు పెట్టి చంపిన విషయం తెలిసిందే.
బాలుడి తల్లిదండ్రులు రెండు రోజుల నుంచి విషాద ఛాయల నుంచి బయటపడ లేదు. ఏడాది క్రితం పెద్ద కొడుకు తరుణ్ కూడా ఇలాగే విషాహారానికి గురై ఒంగోలులోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. రెండో కొడుకు కూడా ఇలాగే విషాహారానికి గురై చనిపోవడంతో కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. తల్లి సంధ్యకు సిజేరియన్ ద్వారా పిల్లలు పుట్టారు. ఇక ఆమెకు పిల్లలు పుట్టే అవకాశం లేదు. ఉన్న పిల్లలు ఇద్దరూ అందనంత దూరాలకు పోయారు. ఇంక బతికేమీ సాధించాలంటూ తల్లిదండ్రులు విలపిస్తున్న తీరు గ్రామస్తులను ఆవేదనకు గురి చేస్తోంది.
సుధాకర్‌కు అన్నీ కష్టాలే
సుధాకర్ తండ్రి మూత్ర పిండాల వ్యాధితో కొన్ని నెలలుగా బాధపడుతున్నాడు. సుధాకర్‌కు తమ్ముడు ఉంటే గతంలో జరిగిన ఒక ప్రమాదంలో మృతి చెందాడు. ఇంట్లో ఒకదాని వెంట ఒకటి దురదృష్ట సంఘటనలు వెంటాడుతుంటే ఇక ఈ ఊరిలో ఏమి ఉంటామంటూ వాపోతున్నారు. పిడతలపూడి గ్రామం తప్ప పట్టణాల వైపు తొంగిచూడని సుధాకర్ గ్రామాన్ని నమ్ముకొని గొర్రెలు మేపుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు. అల్లారుముద్దుగా ఉండే ఇద్దరు కొడుకులను పోగొట్టుకున్నాడు. అంగన్‌వాడీ కేంద్రంలో ధనుంజయ్ మృతి చెందినందున ప్రభుత్వం నుంచి ఐసీడీఎస్ ద్వారా ఆర్థిక సాయం వస్తే దాని ఆసరాతో కుటుంబానికి కాస్త ఊరట లభిస్తుందని బంధువులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
సాక్ష్యం చెప్పిన పిల్లలకు అదురు జ్వరం
బాలుడు ధనుంజయ్‌కు కుర్‌కురేను ఆశా కార్యకర్త జ్యోతి తినిపించిందని సాక్ష్యం చెప్పిన చిన్న పిల్లలు అదురు జ్వరంతో భయపడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధనుంజయ్‌ను విషాహారానికి గురిచేసి చంపినట్లుగానే సాక్ష్యం చెప్పిన పిల్లలను జ్యోతి ఏమైనా చేస్తుందేమోనని భయపడటంతో పిల్లలు అదురుపోయి జ్వరంతో బాధపడుతున్నారు.
సీఐ విచారణ
ఒంగోలు రూరల్ సీఐ మాకినేని మురళీకృష్ణ సోమవారం పిడతలపూడి వచ్చి కేసు దర్యాప్తు కొనసాగించారు. గ్రామంలో మృతుడి ధనుంజయ్ తల్లిదండ్రులను పరామర్శించారు. అంగన్‌వాడీ కేంద్రంలో జరిగిన సంఘటనను విచారించినట్లు సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment