గ్రామంలో పర్యటించిన ఎస్‌ఐ రేవతి
శ్రీకాకుళం ,రేగిడి: మండలంలోని కాగితాపల్లికి చెందిన గ్రామ వలంటీర్ కిమిడి గౌరీశ్వరరావు రేషన్ సరుకులు పంపిణీ చేస్తుండగా అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త దూబ అప్పలనాయుడుతోపాటు మరో నలుగురు టీడీపీ కార్యకర్తలు దాడి చేసి గాయపరిచిన విషయం పాఠకులకు విధితమే. ఈ ఘనటలో బాధితుడు గౌరీశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన రేగిడి ఎస్‌ఐ బి.రేవతితోపాటు పోలీసులు నిందితుల కోసం ఆరా తీశారు. ఈ విషయం తెలుసుకున్న నిందితులు దూబ అప్పలనాయుడుతోపాటు మిగిలిన వారంతా గ్రామం నుంచి ఇతర ప్రాంతాలకు పరారయ్యారు. గ్రామంలో రేషన్ సరుకులను పార్టీలకు అతీతంగా అందించేందుకు వచ్చిన గౌరీశ్వరరావుపై దాడి చేయడాన్ని గ్రామస్తులు నియోజకవర్గంలోని ప్రజా సంఘాల నాయకులు, వైఎస్సార్‌సీపీ నాయకులు తప్పుపడుతున్నారు.
నిందితులను అదుపులోకి తీసుకుని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. గ్రామంలో ఉద్రిక్తత వాతావరణ పరిస్థితులు ఉండడంతో పోలీసులు పహారా కాస్తున్నారు. పరారీలో ఉన్న నిందితులు కోసం పోలీసులు అన్ని ప్రాంతాల్లో గాలిస్తున్నారు. రేగిడి, రాజాం, పాలకొండ ప్రాంతాల్లోని ప్రధాన రహదారిపై వెళ్తున్న వాహనాలను పరిశీలిస్తున్నారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఎస్‌ఐ స్పష్టం చేశారు. గౌరీశ్వరరావుపై దాడి విషయాన్ని సీరియస్‌గా ఉన్నతాధికారులు పరిగణలోకి తీసుకున్నారన్నారు. ఈ ఘటనలో గాయపడిన గౌరీశ్వరరావు ఆరోగ్యం ప్రస్తుతం కుదుట పడిందని ఆయన తండ్రి నీలన్నాయుడు సాక్షికి తెలిపారు. శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స అందుతుందన్నారు. తమ కుమారుడిపై దాడిచేసిన వ్యక్తులతో తమకు భవిష్యత్‌లో కూడా ప్రమాదం పొంచి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment