సాక్షి, బనశంకరి: ఆఖరికి శవంపై నున్న నగలను కూడా వదలని ఘరానా ప్రబుద్ధుడుని పోలీసులు అరెస్టు చేశారు. ప్రమాదానికి గురైన బాధితులకు సహాయం చేసే నెపంతో మృతురాలి బంగారు ఆభరణాలను అపహరించిన వ్యక్తిని మంగళవారం ఈశాన్య విభాగానికి చెందిన చిక్కజాల పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడి వద్ద నుంచి రూ.8 లక్షల విలువ చేసే 288 గ్రాముల బరువుగల బంగారు చైన్, బ్రాస్‌లేట్, నెక్లెస్, కమ్మలు, ఇతర బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ ఎస్.గిరీశ్ తెలిపారు.
ఏం జరిగిందంటే...
మంగళవారం డీసీపీ తెలిపిన వివరాల మేరకు... ఈ నెల 3 న చిక్కజాలకు చెందిన వేణుగోపాల్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి చెన్నరాయపట్టణకు ఇన్నోవా కారులో వెళ్తుండగా, చిక్కనహళ్లి వద్ద లారీ ఢీకొట్టింది. ఇన్నోవా కారు ధ్వంసం కాగా వేణుగోపాల్ తల్లి సరస్వతి దుర్మరణం చెందింది. మిగిలిన వారు గాయపడ్డారు. ఇదే మార్గంలో స్నేహితులతో విహారయాత్ర ముగించుకుని వస్తున్న యశవంతపుర బీకే. నగర నివాసి సోమశేఖర్ బాధితులకు సహాయం చేస్తున్నట్లు నటించి మృతురాలి నగలను చోరీ చేశాడు. విచారణ జరిపిన పోలీసులకు అసలు విషయం తెలిసింది. చోరీ సొత్తును హుణసమారేనహళ్లిలోని బంగారు ఆభరణాల కుదువ దుకాణంలో పెట్టడానికి సోమశేఖర్ పథకం పన్నిన్నట్లు పోలీసులు కనిపెట్టారు. వెంటనే చిక్కజాల ఇన్‌స్పెక్టర్ కేశవమూర్తి సిబ్బందితో దాడి చేసి సోమశేఖర్‌ను అరెస్ట్ చేశారు. చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ గిరీశ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment