నిందితులను అరెస్టు చూపుతున్న డోన్ డీఎస్పీ ఖాదర్‌బాషా
కర్నూలు ,కృష్ణగిరి: జాతీయ రహదారులను లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడుతున్న ఆరుగురు అంతర్ రాష్ట్ర ముఠాను కృష్ణగిరి పోలీసులు ఎరుకల చెర్వు క్రాస్ రోడ్డు వలపన్ని పట్టుకున్నారు. డోన్ డీఎస్పీ ఖాదర్‌బాషా వారిని సోమవారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. కర్నూలు చెన్నమ్మ సర్కిల్‌కు చెందిన నీలి షికారీ శాలు అలియాస్ షారుక్‌ఖాన్, లవ్లీ , జెమిని అలియాస్ నాయుడు, రాయిరెడ్డి, కోడుమూరు మండలం అనుగొండకు చెందిన రాజు, కోసిగి మండలం సాతనూరుకు చెందిన లస్సీ అలియాస్ పాండు ముఠాగా ఏర్పడ్డారు. వీరు జాతీయ రహదారుల్లో లారీ డ్రైవర్లను లక్ష్యంగా చేసుకుని దోపిడీలు చేస్తున్నారు. వీరిపై ఇప్పటికే ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు స్టేషన్లలో 25 చోరీ కేసులు, మూడు మర్డర్ కేసులు, రెండు రాబరి కేసులు ఉన్నాయి. ఈ ముఠాకు నీలి షికారీ రాజు నాయకత్వం వహించినట్లు డీఎస్పీ తెలిపారు. కాగా ఈ ముఠాలోని సభ్యులందరూ దాయాదులే కావడం విశేషం.
ఎలా దొరికారు అంటే..
గత రెండు నెలలుగా ఈ దొంగల ముఠా జాతీయ రహదారులతో పాటు గ్రామాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఈయేడాది అక్టోబర్ 18న నల్గొండ జిల్లాకు చెందిన పవన్‌కమార్ అనే వ్యక్తి అమకతాడు టోల్‌గేట్ సమీపాన ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ఇతని బైక్ చోరీకి గురైంది. నవంబర్ 2న బాధితుడి ఫిర్యాదు మేరకు స్థానిక స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దీనికితోడు టోల్‌గేట్ వద్ద రాత్రి వేళల్లో ఆగి ఉన్న లారీ డ్రైవర్లు, క్లీనర్లను కత్తులతో బెదిరిస్తూ చోరీలకు పాల్పడతున్నట్లు సమాచారం రావడంతో ఆ పరిసరాల్లో పోలీసులు నిఘా పెంచారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం వాహనాల తనిఖీ చేపడుతుండగా ముగ్గురు వ్యక్తులు బైక్‌లపై వచ్చారు. అనుమానం వచ్చి వాహనాలకు సంబంధించిన పత్రాలు చూపించమని అడగగా వారి నుంచి సమాధానం రాలేదు. ఈ మూడు బైక్‌లో ఒకటి గతంలో చోరీకి గురైనది ఉండటంతో ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. మిగతా వారు సంగాల గ్రామం శివారులోని పొలాల్లో దాక్కొని ఉండగా వల పన్ని పట్టుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. నిందితుల నుంచి 22 బైక్‌లు, 60 సెల్‌ఫోన్‌లు, పలు రకాల కత్తులు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుల్లో రాజు, పాండు, లవ్లీలపై పశ్చిమగోదావరి, బ్రహ్మణకొట్కూరు, కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్ల పరిధిలో మర్డర్ కేసులు ఉన్నాయి. అలాగే రాజు అనే దొంగపై వారెంటు కూడా ఉందని డీఎస్పీ వెల్లడించారు. ఈ ముఠా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డారని చెప్పారు.
సిబ్బందికి రివార్డు
అంతరాష్ట్ర దొంగల ముఠాను పట్టుకుని వారి నుంచి దాదాపుగా రూ.10 లక్షల విలువచేసే వస్తువులను స్వాధీన పరుచుకోవడంతో డోన్ సీఐ రాజగోపాల్‌నాయుడు, కృష్ణగిరి, ప్యాపిలి, దేవనకొండ, డోన్ రూరల్ ఎస్‌ఐలు విజయభాస్కర్, మారుతీశంకర్, పీరయ్య, నరేంద్రకుమార్‌రెడ్డితో పాటు ఇద్దరు ఏఎస్‌ఐలు, ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లు, 11పీసీలు, ముగ్గురు హోంగార్డులకు డీఎస్పీ ఖాదర్‌బాషా రివార్డులు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment